చంద్రబాబు శవ రాజకీయాలు

  • భూమా మృతికి బాబే కారకుడు
  • రౌడిషీట్‌ ఓపెన్‌ చేసి ఆసుపత్రి పాలు చేశాడు
  • మంత్రి పదవి ఆశచూపి మృతికి కారకుడయ్యాడు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు
వెలగపూడి: ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి ప్రధాన కారకుడు ముఖ్యమంత్రి చంద్రబాబేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గిరిజన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో గెలిచిన భూమాను మంత్రి పదవి ఇస్తానని తెలుగుదేశంలోకి లాక్కొని ఆయన మరణానికి కారకుడయ్యాడని విమర్శించారు. సంవత్సరం గడిచినా మంత్రి పదవి ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపిస్తేనే ఇస్తానని ఒత్తిడి తీసుకొచ్చింది నిజమా కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. నాగిరెడ్డి సంతాపసభను అడ్డం పెట్టుకొని చంద్రబాబు అసెంబ్లీలో శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ.... భూమా నాగిరెడ్డికి సంతాపం తెలియజేసే సభలో ఆ విషయాన్ని పక్కనబెట్టి టీడీపీ సభ్యులు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వ్యతిరేకించి మాట్లాడడం బాధాకరమన్నారు. సంతాప సభలో మాట్లాడాల్సివస్తే భూమా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ప్రలోభాలకు లోబడి పార్టీ మారిన విషయాలను ప్రస్తావించాల్సివస్తుందని, అది అసెంబ్లీ రికార్డుల్లో నమోదు అవుతోందని మానవత్వంతో,, మంచితనంతో సంతాపసభకు వెళ్లలేదన్నారు. ఆ విషయాన్ని గ్రహించకుండా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడే తీరు చాలా బాధాకరమన్నారు. 

శోభానాగిరెడ్డికి ఎందుకు సంతాపం తెలపలేదు
భూమా నాగిరెడ్డి సతీమణి శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోతే అసెంబ్లీలో ఎందుకు సంతాప సభ పెట్టలేదని చంద్రబాబును గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. గతంలో శోభా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు చేశారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు శోభా నాగిరెడ్డి చనిపోతే మీరెందుకు ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టారని చంద్రబాబును నిలదీశారు. శోభా నాగిరెడ్డి అంత్యక్రియలకు చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. ఇప్పుడు సభలో ఉన్నవారంతా నీతి కబుర్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ పట్టుబడితే మరుసటి రోజున సంతాప సభ ఏర్పాటు చేశారన్నారు. అసెంబ్లీలో భూమా కుటుంబంపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తూ, మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. 

అఖిలప్రియ పరిస్థితి బాధాకరం
భూమా నాగిరెడ్డి కుమార్తె ఎమ్మెల్యే అఖిల ప్రియ పరిస్థితి బాధకరం అన్నారు. ఓ కుటుంబంలో తల్లి, తండ్రీ చనిపోతే ఏ కుటుంబ సభ్యులకైనా తీరని బాధ అని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తండ్రి చనిపోయి కుమిలిపోతున్న అఖిల ప్రియతో అసెంబ్లీలో చంద్రబాబు అబద్దాలు మాట్లాడిస్తున్నారని వాపోయారు. నూతనంగా ఏర్పడిన అసెంబ్లీలో మొదటి రోజు సభకు హాజరుకాని అఖిలప్రియను చంద్రబాబు, లోకేష్‌ వారిని పొగిడించుకోవడానికి దగ్గరుండి వెంటపెట్టుకొచ్చారని అన్నారు. భూమా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి, కేవలం మంత్రి పదవికోసం మా పార్టీలోకి వచ్చారని చంద్రబాబు ఎందుకు సభలో చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. చిట్టచివరగా చంద్రబాబుతోనే నాగిరెడ్డి మాట్లాడారు. వారు ఇరువురి మధ్య ఏం చర్చ జరిగిందో ఎవరికి తెలుసన్నారు. భూమా నాగిరెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు ఆ రోజున ఎందుకు రౌడీ షీట్‌ ఓపెన్‌ చేశారో బాబు సమాధానం చెప్పాలన్నారు. యుద్ధ వాతావరణం నెలకొల్పి పోలీసులతో అరెస్టు చేయించి ఆయనను ఆసుపత్రి పాలు చేయించింది మీరు కాదా అని చంద్రబాబును తూర్పారబట్టారు. దయచేసి చంద్రబాబు శవరాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. 
Back to Top