బెయిలొస్తుందన్న దశలో చంద్రబాబు రాద్ధాంతం

హైదరాబాద్ 17 సెప్టెంబర్ 2013:

తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిలు వచ్చే అవకాశాలు మెరుగైన దశలో రాద్ధాంతం చేసి, అడ్డుకోవడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  దమ్ముంటే శ్రీ జగన్మోహన రెడ్డిని ప్రజాకోర్టులో ఎదుర్కోవాలని చంద్రబాబు నాయుడుకు సవాలు చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డికి బెయిలు వస్తోందంటే చంద్రబాబుకు గుండెపగిలినంత పనవుతోందన్నారు.  శ్రీ జగన్మోహన్ రెడ్డికి బెయిల్‌ రాకుండా అడ్డుకునేందుకు తన పార్టీ ఎంపీలను ఢిల్లీ పంపి వ్యవస్థలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. శ్రీ జగన్‌ కేసును నిర్భయ కేసుతో పోల్చి బాబు రాక్షాసానందం పొందుతున్నారని మండిపడ్డారు.  తనకు అధికారం కావాలి, శ్రీ జగన్‌కు బెయిల్ రాకూడదనేదే ఆయన ధ్యేయమన్నారు.  బెయిల్‌ వస్తే కుప్పంలో కూడా ఓడిపోతాననే భయం చంద్రబాబును వెంటాడుతోందన్నారు.

సామాజిక అత్యాచారం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.  తెలంగాణకు సంబంధించి కేంద్రానికి  బ్లాంక్ చెక్కు వంటి లేఖ  ఇవ్వడం ద్వారా ఆయన ఈ రాష్ట్రాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు వ్యవహార శైలి చూసి సభ్య సమాజం తలదించుకుంటున్నదన్నారు.

శ్రీ జగన్మోహన్ రెడ్డికి బెయిలు వచ్చే అవకాశాలు మెరుగుపడడంతో చంద్రబాబు కాళ్ళు చల్లపడ్డాయనీ, దానితో తక్షణం ఆత్మ గౌరవ యాత్రను ముగించుకుని హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చేశారని ఎద్దేవా చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డికి బెయిలు లభించకుండా గత వారం రోజులుగా చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయనకు బెయిలు లభిస్తే వచ్చే ఎన్నికలలో డిపాజిట్లు కూడా రావని భీతిల్లుతున్నారని ఎద్దేవా చేశారు.

సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం సీబీఐ దర్యాప్తును పూర్తిచేసి చివరి చార్జిషీటును దాఖలు చేయాల్సిన గడువు సెప్టెంబరు 9తో పూర్తయ్యిన విషయాన్ని అంబటి గుర్తుచేశారు. దర్యాప్తు, రాజ్యాంగ సంస్థలను ప్రభావితం చేసి, శ్రీ జగన్మోహన్ రెడ్డికి బెయిలు రాకుండా చేయడానికి చంద్రబాబు ఎంపీల బృందాన్ని ఢిల్లీకి పంపారని ఆయన ఆరోపించారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జైలులో ఉన్నప్పటికీ ఎన్నికలలో ఒక్క సీటు గెలుచుకోలేని పరిస్థితిలో ఉన్న చంద్రబాబు చేపట్టింది... ఆత్మగౌరవ యాత్ర కాదనీ, ఆత్మ రక్షణ యాత్రనీ ఎగతాళి చేశారు. బెయిలు రాకుండా ఆయన రహస్యంగా పనిచేస్తుండగా... ఆయన పార్టీ ఎంపీలు బహిరంగంగానే ఈ గేమ్‌లో పాలుపంచుకుంటున్నారన్నారు.
శ్రీ జగన్మోహన్ రెడ్డి కేసును నిర్భయ కేసుతో పోల్చి చంద్రబాబు వికృత ఆనందాన్ని అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎటువంటి నేరమూ చేయనప్పటికీ శ్రీ జగన్మోహన్ రెడ్డి 16 నెలలుగా జైలులో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతవరకూ ఒక్క ఆరోపణకు కూడా రుజువుకాని విషయం గుర్తుంచుకోవాలన్నారు. నిజానికి రాష్ట్ర విభజనకు మద్దతు తెలిపి చంద్రబాబు తెలుగు సమాజంపై అఘాయిత్యం చేసి తీవ్రమైన నేరం చేశారని ఆయన ఆరోపించారు.

Back to Top