చంద్రగిరిలో పోటీ చేసి చూడు

కదిరి: దమ్ముంటే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు, సినీ నటి రోజా సవాల్ విసిరారు. కదిరిలో ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. బీసీలు అత్యధికంగా ఉన్న కుప్పం నియోజకవ ర్గంలో టీడీపీ తరఫున చంద్రబాబు కాకుండా మరో బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపితే ఆయనకు, ఆయన పార్టీకి బీసీల పట్ల ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుందన్నారు. బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలను ఇంకెంత కాలం మోసగిస్తారని ఆమె ధ్వజమెత్తారు. ఆయనకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పిన ‘బీసీలకు 100 స్థానాలు’ మాటకు కట్టుబడాలన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ కోతలపై నిరసనలు తెలియజేస్తే చంద్రబాబు కాల్చి చంపించారని, ప్రస్తుతం అదే పార్టీ నేతలు విద్యుత్ కోతలపై ఆందోళనలు చేస్తుంటే జనం నవ్వుకుంటున్నారని ఆమె విమర్శించారు. జగన్ రూ. 30 కోట్లిచ్చి ఎన్‌డీటీవీ ద్వారా తనకు అనుకూలంగా సర్వే చేయించుకున్నారని చంద్రబాబు చేస్తున్న విమర్శపై అడిగిన మరో ప్రశ్నకు ఆయనలాగా వైస్రాయ్ హోటల్‌లో ఎమ్మెల్యేలను బంధించి సీఎం కావాలని జగన్ అనుకొని ఉంటే ఎప్పుడో అయ్యేవారని, ఇలాంటి బుద్ధులు చంద్రబాబుకే చెల్లుతాయన్నారు.

జగన్ వెంటే జనం

కాంగ్రెస్, టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా జనం వైఎస్సార్ కాంగ్రె స్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉన్నారని ఆ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి(సీఈసీ) సభ్యురాలు, సినీ నటి రోజా చెప్పారు. కదిరి రూరల్ పరిధిలోని డీ.చెర్లోపల్లి వద్ద హంద్రీ-నీవా రిజర్వాయర్ పనుల జాప్యాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ నేత ఎస్‌ఎండీ ఇస్మాయిల్ ‘రైతుబాట’ పేరుతో చేపట్టిన పాదయాత్రను సోమవారం ఆమె పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లయ్యగారిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘మహానేత వైఎస్సార్ పేదలకుఇళ్లు ఇచ్చారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతో ఖరీదైన వైద్యం అందించారు, ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులను ఆదుకున్నారు. జలయజ్ఞం పేరుతో మహా యజ్ఞాన్నే చేపట్టారు. రూ. 2లకే కిలో బియ్యం ఇచ్చారు. పెన్షన్లతో అందరినీ ఆదుకున్నారు. పావలా వడ్డీకే రుణాలిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువులు అందరికీ అబ్బేలా చేశారు. అందుకే ఆయన అందరి హృదయాల్లో గూడుకట్టుకున్నారు.' అని ఆమె పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు జొన్నా రామయ్య, డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ కృషి ఫలితంగానే హంద్రీ -నీవా ఈ ప్రాంతానికి వచ్చిందన్నారు. కార్యక్రమంలో వైయస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, బీసీ నాయకులు మీసాల రంగన్న, మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్, డాక్టర్ నాగేంద్రకుమార్‌రెడ్డి, పూల శ్రీనివాసరెడ్డి, అనంతపురం నగర కమిటీ అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, యువజన విభాగం నగర అధ్యక్షుడు విద్యాసాగర్‌రెడ్డి, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు లింగాల రమేష్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ వేమల ఫర్హానా ఫయాజ్, ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బయప్ప, పార్టీ సమన్వయకర్త సుధాకర్‌రెడ్డి, నాయకులు ఆర్వేటి శాంతమ్మ, అజ్జుకుంటు రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే పాదయాత్ర : ఎస్‌ఎండీ ఇస్మాయిల్

ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ‘రైతు బాట’ పేరుతో నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టినట్లు వైఎస్సార్ సీపీ నాయకుడు ఎస్‌ఎండీ ఇస్మాయిల్ తెలిపారు. సోమవారం ఆయన కదిరి రూరల్ పరిధిలోని మల్లయ్యగారిపల్లి నుంచి దిగువ చెర్లోపల్లి హంద్రీ -నీవా రిజర్వాయర్ మీదుగా పాదయాత్ర చేపట్టారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్లు చాంద్‌బాషా, లోకేశ్వర్‌రెడ్డి, బైకు భాస్కర్‌రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు శివారెడ్డి, రాజారెడ్డి, మండెం మధు, అన్నదాత రామిరెడ్డి, సంపంగి గోవర్దన్, కొమ్మెద్ది అప్పల్ల, యువజన విభాగం నాయకులు ఇమ్రాన్, జబీవుల్లా, నీలకంఠారెడ్డి, రామచంద్రారెడ్డి, జేకే జాఫర్‌ఖాన్, టీఎస్ అహ్మద్‌బాషా ఉన్నారు.

మాట మార్చడం కాంగ్రెస్ పార్టీకే చెల్లు

అనంతపురం అర్బన్: మనిషి జీవించి ఉన్నపుడు ఒకలా .. మరణించిన తర్వాత ఒకలా మాట్లాడడంతో కాంగ్రెస్ పార్టీకే చెల్లని వైయస్‌ఆర్ సీపీ మైనార్టీ నేత సాలార్ బాషా ధ్వజమెత్తారు. 108, 104, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ప్రవేశపెట్టారని ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయనకు ఏం తెలుసని మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. సోమవారం నగరంలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహానేత కృషితోనే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు.

Back to Top