ఊస‌ర‌వెల్లికే టూష‌న్ చెప్పేర‌కం బాబు



* హోదాపై రోజుకోమాట‌..పూట‌కో అబ‌ద్ధం
* బాబుతో పాటు క‌ర‌వూ ఆయ‌న వెంటే వ‌చ్చింది
* గిట్టుబాటు ధ‌ర‌లు లేక రైతులు ఇబ్బందులు ప‌డుతున్నా ప‌ట్టించుకోరు
* ఇక్క‌డ కేసీఆర్‌.. అక్క‌డ మోడీ అంటే బాబుకు భ‌యం
* హోదా వ‌స్తేనే రాష్ట్రం అభివృద్ధి
* ప్ర‌త్యేక హోదా సాధించే వ‌ర‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పోరాటం
* అద్దంకి బ‌హిరంగ స‌భ‌లో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌
అద్దంకి: చ‌ంద్ర‌బాబు నాయుడు రోజుకోమాట‌.. పూట‌కో అబ‌ద్ధం చెబుతున్నార‌ని, ఊస‌ర‌వెల్లి రంగులు మార్చ‌డంకంటే వేగంగా బాబు మాట‌లు మారుస్తున్నార‌ని, ఊస‌ర‌వెల్లికే టూష‌న్ చెప్పే ర‌కం చంద్ర‌బాబు అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. చంద్ర‌బాబుతో పాటు క‌రువు ఆయ‌న‌కు తోడుగా వ‌చ్చింద‌ని, ఆయ‌న అధికారంలో ఉంటే క‌రువే క‌రువ‌న్నారు. అద్దంకి బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రైన అశేష జ‌న‌వాహినుద్దేశించి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తూ చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. హోదా కోసం ఆఖరిఅస్త్రంగా మంత్రులతో రాజీనామా చేయిస్తామని చంద్రబాబు చెబుతున్నారు.. కానీ ఇప్పటికే నాలుగేళ్లు గడిచాయి కనుక ఆఖరి అస్త్రంగా కాకుండా మొదటి అస్త్రంగానే రాజీనామా చేయించాలని వైయ‌స్ జ‌గ‌న్ డిమాండ్ చేశారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు  ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో మార్చి1న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశామ‌ని, మార్చి 3న మా పార్టీ నేత‌లు ఢిల్లీకి ప‌య‌న‌మ‌య్యార‌ని, ఈ నెల 5న ఢిల్లీలో హోదాకోసం ధ‌ర్నా చేయ‌బోతున్నార‌న్నారు. మంగళవారం నుంచి పార్లమెంట్ వేదికగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పోరాటం చేస్తార‌ని, అప్పటికీ కేంద్ర దిగి రాకపోతే మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం పెడ‌తామ‌న్నారు. అయినా కేంద్రం స్పందించకపోతే ఏప్రిల్ 6న పార్టీ ఎంపీలు రాజీనామా వాళ్ల ముఖాన కొట్టి రాష్ట్రానికి వ‌స్తార‌న్నారు. చంద్రబాబు పార్ట్‌నర్‌కు చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసానికి టీడీపీ ఎంపీల మ‌ద్ద‌తు ఇప్పించాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ప‌రోక్షంగాఅన్నారు.  మొత్తం 25 మంది ఏపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్రం దిగిరాదా అని చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు.

రైతుల‌ను ఆదుకోవ‌డంలో బాబు విఫ‌లం
ఈ ఏడాది 32 శాతం కరీప్ పంటకు వ‌ర్ష‌పులోటు ఉంద‌ని,  ర‌బీ పంటకు 71శాతం లోటు ఉన్న పరిస్థితుల్లో రైతున్నలను ఆదుకోవాల్సిన ముఖ్య‌మంత్రి ఆ చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు. కరీఫ్‌లో కరువొస్తే ఎవరైనా రబీలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీలు, రుణాలు ఇప్పిస్తారని, కానీ చంద్రబాబు మాత్రం రైతులను గాలికొదిలేశార‌ని మండిప‌డ్డారు. ఆఖరికి పండించిన పంటకు కనీసం గిట్టుబాట ధర కల్పించలేని వ్యక్తి సీఎం చంద్ర‌బాబు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాలుగేళ్లలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేద‌న్నారు. 

మ‌హానేత హ‌యాంలో కందులు రూ.10000లు ప‌లికేవి
దివంగ‌త మ‌హానేత వైయ‌స్ఆర్ ముఖ్య‌మంత్రి గా ఉన్న స‌మ‌యంలో కందికి ధ‌ర రూ.9000ల నుంచి రూ.10000లు ఉండేద‌ని, ఇప్పుడు రూ.4000ల‌కు కూడా అమ్ముకోలేని ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. యార్డుల‌కు తీసుకెళ్తే  కేవ‌లం 2 బ‌స్తాలే కొంటున్నార‌ని, అదేమ‌ని అడిగితే తేమ ఉంద‌ని అంటున్నార‌న్నారు. ద‌ళారులు మాత్రం రూ.4వేల‌కు కందులు కొంటున్నార‌ని, వాళ్ల ద‌గ్గ‌ర నుంచి చంద్ర‌బాబు కొన్ని రూ.5450ల‌కు అమ్ముకుంటున్నార‌ని, బాబే ద‌ళారి అవ‌తార‌మెత్తితే ఇక రైతుల‌కు ఎక్క‌డ న్యాయం జ‌రుగుతుంద‌ని వైయ‌స్ జ‌గ‌న్ మండిప‌డ్డారు. 

కేసీఆర్ అన్నా.. మోడీ అన్నా బాబుకు భ‌యం
చంద్ర‌బాబు నాయుడికి ఇక్క‌డ కేసీఆర్ అన్నా.. అక్క‌డ మోడీ అన్నా చ‌చ్చేంత భ‌యం అని, అందుకే ఈ ఇద్ద‌రూ ఏమి చెప్పినా తిరుగు మాట్లాడ‌ర‌ని వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. ఓటుకు కోట్లు కేసుల్లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన టేపులు తెలంగాణ వద్ద ఉన్నాయని, అందుకే ఏ విషయంలోనూ నోరు తెరిచి ప్రశ్నించే స్థితిలో చంద్రబాబు లేర‌న్నారు. ఏమైనా అడిగితే తనను జైలుకు పంపిస్తారేమోనన్న భయం చంద్రబాబులో కనిపిస్తోంద‌న్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి నీళ్లు అందని ప్ర‌స్తుతం ఉంద‌న్నారు. ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీరందించే గుండ్ల‌క‌మ్మ ప్రాజెక్టును బాబు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. కుడికాలువ ద్వారా నీళ్లు ఇప్పించ‌లేని దుస్థిలో బాబుఉన్నార‌న్నారు. ఎడ‌మ కాలువ ద్వారా తెలంగాణ‌కు నీళ్లు తీసుకెళ్తూ కేసీఆర్ అక్క‌డ భూముల‌ను స‌స్య‌శ్యామ‌లం చేస్తున్నార‌న్నారు. ఇక్క‌డ బాబుకు లేంది ఏంటి? అక్క‌డ కేసీఆర్‌కు ఉండేది ఏంటి? అని వైయ‌స్ జ‌గ‌న్ బాబును ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల వ‌చ్చిన‌ప్పుడు మాత్రం వ‌చ్చి టెంకాలు కొట్టి వెళ్తార‌న్నార‌ని విమ‌ర్శించారు. 

ఎన్నిక‌ల హామీల‌కు తిలోద‌కాలు
చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెర‌వేర్చ‌లేద‌ని మండిప‌డ్డారు. ఇంటికొక ఉద్యోగం అని, నిరుద్యోగుల‌కు రూ.2వేలు అని చెప్పి మోసం చేశార‌న్నారు. రైతులు, డ్వాక్రా సంఘాలు రుణాలు మాఫీ చేస్తామ‌ని చెప్పి మోసం చేశార‌న్నారు. ప్ర‌తి ఇంటికీ 20 లీట‌ర్ల మిన‌ల్ వాట‌ర్ ఇస్తాన‌ని ఇవ్వ‌లేద‌న్నారు. ఇలా ఒక‌టి కాదు.. రెండు కాదు.. వంద‌ల సంఖ్య‌లో హామీలు ఇచ్చి అన్ని వ‌ర్గాల వారిని మోసం చేశార‌న్నారు. బెల్టుషాపుల‌ను ర‌ద్దు చేస్తామ‌న్న చంద్ర‌బాబు వీధికో బెల్టు షాపు తెరిచార‌న్నారు. ఫోన్ చేస్తే ఇంటికి మంచినీళ్లు వ‌స్తాయో రావో తెలియ‌దు కానీ బాబు పాల‌న‌లో మ‌ద్యం మాత్రం ఇంటికే వ‌స్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

నాలుగేళ్ల పాల‌న‌లో అంతా అవినీతే
బాబు నాలుగేళ్ల పాల‌న చూసుకుంటే అవినీతి.. అక్ర‌మాలేన‌ని వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. ఎన్నిక‌ల ముందు ధ‌ర‌లు త‌గ్గిస్తామ‌ని చెప్పి అధికారంలోకి రాగేనే అన్నీ ధ‌ర‌లు పెంచార‌న్నారు. గ‌తంలో రేష‌న్ షాపుకు వెళ్లితే రూ.185ల‌కే 9 ర‌కాల వ‌స్తువులు ఇచ్చేవాళ్లేర‌ని, ఇప్పుడు బియ్యం త‌ప్పితే వేరే ఏదీ ఇవ్వ‌డం లేద‌ని మండిప‌డ్డారు. విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు మూడు సార్లు పెంచార‌న్నారు.  ఇలా ఇసుక‌, మ‌ట్టి, పేదల భూములు ఆఖ‌రికి గుడి భూముల‌ను కూడా వ‌ద‌ల‌కుండా దోచుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ఆరోగ్య‌శ్రీ‌కి పూర్వ వైభ‌వం తెస్తాం
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరోగ్య‌శ్రీ‌కి పూర్వ వైభ‌వం తీసుకువ‌స్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. నాన్న‌గారి పాల‌న ఒక‌సారి గుర్తు తెచ్చుకుంటే అది స్వ‌ర్ణ‌యుగమ‌న్నారు. ప్రస్తుతం బాబు పాల‌న‌లో ప్ర‌జ‌లు ఒక్క‌రు కూడా సంతోషంగా లేర‌న్నారు. పేద‌వాడు అనారోగ్యంపాలైతే ఆస్తులు అమ్ముకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంద‌న్నారు. ఆరోగ్య‌శ్రీ‌ని నిర్వీర్యం చేస్తున్నారు. దేవుడి ద‌య‌.. మీ అంద‌రి ఆశీస్సుల‌తో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగ‌నాఏ ఆరోగ్య‌శ్రీ‌కి పూర్వ వైభ‌వం తీసుకువ‌స్తామ‌న్నారు. రూ.1000లు దాటితే దానిని ఆరోగ్య‌శ్రీ కిందికి చేర్చి ఉచితంగా వైద్యం చేయిస్తామన్నారు. ఎక్క‌డ వైద్యం చేయించుకున్నా ప్ర‌భుత్వమే భ‌రించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. చెవిటి, మూగ పిల్ల‌ల‌కు ఆప‌రేష‌న్ చేయించాలంటే ఆరేడు ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని, టీడీపీ స‌ర్కార్ వాళ్ల‌కు ఆప‌రేష‌న్ చేయించ‌కుండా చేతులెత్తేస్తోంద‌న్నారు. పేద‌ల ప్ర‌భుత్వం రాగానే వాళ్ల‌కు ఎన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చు అయినా ఉచితంగా ఆప‌రేష‌న్ చేయిస్తామ‌న్నారు. అంతేకాకుండా పేద‌లు కోలుకునే వ‌రకు డాక్ట‌ర్ల స‌ల‌హాలు తీసుకుని అవ‌స‌ర‌మైతే వాళ్ల‌కు రూ.10000లు పింఛ‌న్ ఇస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. నాన్న‌గారు ఒక అడుగు ముందుకు వేస్తే ఆయ‌న కొడుకుగా నేను రెండ‌డుగు ముందుకు వేసి ప్ర‌జ సంక్షేమానికి కృషి చేస్తాన‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. 

బాబు నాలుగేళ్ల పాల‌న‌పై క‌థ‌
చంద్ర‌బాబు నాలుగేళ్ల పాల‌న‌పై వైయ‌స్ జ‌గ‌న్ క‌థ చెప్పారు. అన‌గ‌న‌గా ఒక మంచి మ‌నిషి ఉన్నాడంట‌. ఆ మ‌నిషి ఉన్న ప్రాంతంలో వ‌ర‌ద‌లు రావ‌డంతో త‌న ద‌గ్గ‌ర ఉన్న ప‌శువులు, గొర్రెలు, కోళ్లు అన్నీ తీసుకుని పైత‌ట్టు ప్రాంతానికి బ‌య‌లుదేరాడు. అయితే ఆ క్ర‌మంలో వ‌ర‌ద‌ల్లో ఒక కొండు చిలువ కొట్టుకుని పోతుంటే మంచి మ‌నిషి కాబ‌ట్టి ఆ కొండ చిలువ‌ను కాపాడాడు. దాన్ని కూడా త‌న‌తో పాటు తీసుకునిపోయి సాక‌డం మొద‌లు పెట్టారు. మ‌నం చంద్ర‌బాబును గ‌తంలో 9 ఏళ్లు సాకిన‌ట్లుగా.. కొండ‌చిలువ త‌న బుద్ధిని పోనిచ్చుకోలేదు. ఆ మంచి మ‌నిషి ద‌గ్గ‌ర ఉన్న మేక‌లు, కోళ్ల‌ను తిన‌డం మొద‌లు పెట్టింది. బాబు రైతుల‌ను, ఉద్యోగుల‌ను, ప్ర‌జ‌ల‌ను పీల్చి పిండి పిప్పిచేసిన‌ట్లుగా.. అయితే తాను చేర‌దీస్తే త‌న ద‌గ్గ‌ర ఉన్న కోళ్ల‌ను.. మేక‌ల‌ను తింటోంద‌ని ఆ మంచిమ‌నిషి ఆ కొండ చిలువ‌ను బ‌షిష్క‌రించారు. ప్ర‌జ‌లు చంద్ర‌బాబును 10ఏళ్ల పాటు తిర‌స్క‌రించిన‌ట్లుగా. త‌ర్వాత 10 ఏళ్లు క‌నిపించ‌లేదు. ప‌దేళ్ల త‌ర్వాత ఆ మంచి మ‌నిషి ద‌గ్గ‌రికి కొండ చిలువ వ‌చ్చి నేను మారాను న‌న్ను న‌మ్ము అని అడిగింది. మంచి మ‌నిషి కాబ‌ట్టి స‌రే అన్నాడు. ఇప్పుడు చంద్ర‌బాబు అబ‌ద్ధాలు చెప్పి ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన‌ట్లుగా.. కానీ కొండ చిలువ బుద్ధి మార‌లేదు. ఈసారి ఆ మంచి మ‌నిషి ఆవు దూడ‌ల‌ను కూడా తిన‌డం మొద‌లు పెట్టింది. ఇప్ప‌డు  చంద్ర‌బాబు రైతులను, డ్వాక్రా సంఘాల‌ను, రాజ‌ధాని భూముల‌నుఖాళీ చేస్తున్న‌ట్లు. అయితే ఉన్న‌ట్లుండి కొండ చిలువ ఆ మ‌నిషిపై అమిత‌మైన ప్రేమ చూప‌డం మొద‌లు పెట్టింది. ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌పై క‌ల్ల‌బొల్లి ప్రేమ చూపుతున్న‌ట్లుగా. ఉన్న‌ట్లుండి కొండ చిలువ తిన‌డం మానేసింది. ఏమైందో ఏమో అని ఆ మ‌నిషి ఆ కొండ‌చిలువ‌ను డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి తీసుకెళ్తాడు. డాక్ట‌ర్ చెప్పిన మాట‌లు విని కంగు తింటాడు. ఆ కొండ చిలువ నిన్ను చుట్టుకుంటున్న‌ది నీ బ‌లం చూడ‌డానిక‌ని, నిన్ను నాకుతున్న‌ది నీ త‌ల త‌న నోట్లో ప‌డుతుందో లేదో తెలుసుకోవ‌డానికి అని చెప్తాడు. ఇప్పుడు చంద్ర‌బాబు అన్నీ తినేసిన‌ట్లుగా ఈసారి మాత్రం చంద్ర‌బాబును క్ష‌మిస్తే రాష్ట్రంలోనే మ‌నుషులే లేకుండాచేస్తార‌ని వైయ‌స్ జ‌గ‌న్ క‌థ ముగించేస్తారు. 
Back to Top