చంద్రబాబు పై సీబీ'ఐ': కిరణ్

ఒంగోలు:  ఐఎంజీ భారత అనే సంస్థకు రూ.కోట్ల విలువైన భూముల్ని అతి తక్కువ ధరకే ధారాదత్తం చేసిన కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై త్వరలోనే సీబీఐ దర్యాప్తు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకాశం జిల్లా ఇందిరమ్మ బాటలో స్వయంగా వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో అంతా అవినీతేననీ, దోచుకు తింటున్నారనీ చెబుతున్న చంద్రబాబు తన పాలనలో అవకతవకలను మరిచారని ఆయన తెలిపారు. నిజానికి ఈ రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడంత అవినీతిపరుడు వేరొకరు లేరన్నారు. ఎకరా రూ. కోటి విలువ చేసే 450 ఎకరాల భూముల్ని.. ఎకరా రూ. 50 వేల ధరకే ఐఎంజీ భారత సంస్థకు కట్టబెట్టారనీ, దీనిపై త్వరలోనే కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారించబోతోందనీ కిరణ్ వివరించారు. రాత్రి అద్దంకిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కువ నిధులు కేటాయించిందని, తాను ఈ ఒక్క సంవత్సరంలోనే ఐదేళ్లలో ఇచ్చినన్ని నిధులు కేటాయించానని చెప్పారు.

బాబు పాలనే రుజువు..

చీరాలలో సీఎం మాట్లాడుతూ... చంద్రబాబు ఇప్పుడు ప్రకటించి బీసీ డిక్లరేషన్ బోగస్ అని ఆయన తొమ్మిదేళ్ల పాలనే రుజువు చేసిందన్నారు. బాబు 2004 వరకు సీఎంగా ఉండి బీసీలకు కేటాయించింది రూ.933 కోట్లేనని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2009 వరకు కేటాయించిన నిధులు రూ.2,166 కోట్లని, అదే 2011లో కేటాయించిన నిధులు రూ.3,017 కోట్లని చెప్పారు. దీన్ని బట్టి బాబు ప్రకటించిన బీసీల డిక్లరేషన్ అవాస్తవమని స్పష్టమవుతోందన్నారు. బీసీలపై తమ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ టీడీపీకి లేదన్నారు.

ఉప్పు రైతులకు విద్యుత్ చార్జీలు పెంచారు...

ఉప్పును సాగుచేసే రైతులకు వైయస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా విద్యుత్ చార్జీని యూనిట్‌కు రూ. 4.10 నుంచి రూ. 1.00కు తగ్గించారని, మీ ప్రభుత్వం వచ్చిన తరువాత దీనిని రూ. 2.10కు పెంచారని చినగంజాం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూనె వెంకటేశ్వర్లు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. పర్చూరులో జరిగిన రైతులతో ముఖాముఖిలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఉప్పుపై సేవా రుసుం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతులు చెప్పిన విషయాలు విన్న సీఎం ఒక్కదానికీ సమాధానం ఇవ్వలేదు. 

వైయస్ఆర్, రోశయ్యల బకాయిలు చెల్లిస్తున్నా..

సీఎంలుగా వైయస్ రాజశేఖర రెడ్డి, రోశయ్యల బకాయిలు తాను ఇస్తున్నానని, ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించటానికే సరిపోయిందని కిరణ్ చెప్పారు. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకి వైయస్‌ఆర్ రుణాలు ఇప్పించారని, తాను వడ్డీలేని రుణాలు ఇస్తున్నానన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కూలీలకు కూడా వర్తింపజేసేందుకు ప్రయత్నిస్తున్నామనీ, ఈ విషయాన్ని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్ళామనీ కిరణ్ తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top