చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకో


పలమనేరు (చిత్తూరు జిల్లా), 5 డిసెంబర్ 2012:

కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నామని తమపై ఆరోపణలు గుప్పిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ హెచ్చరించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అప్పుడు ఎన్ని కోట్లకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు పెద్ద అవినీతి పరుడని 2002లో తెహల్కా చెప్పిన విషయాన్ని మరచిపోవద్దని శ్రీమతి విజయమ్మ గుర్తు చేశారు.

     తెలుగుదేశం పార్టీకి చెందిన పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి బుధవారం నాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీమతి వైయస్ విజయమ్మ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలమనేరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రసంగించారు. అధికారంలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోని చంద్రబాబు  ఇపుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ రుణాలు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని అన్నారు. విద్యుత్తు బిల్లులు కట్టకపోతే రైతులను జైలుకు పంపించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కరవుతో రాష్ర్టం అల్లాడుతుంటే కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదని ఎద్దేవా చేశారు.

     గాలి జనార్ధన్ రెడ్డికి ఒబుళాపురం గనులు కట్టబెట్టింది చంద్రబాబు నాయుడేననీ, ఐఎంజీ భూముల వ్యవహారంలో కూడా ఆయన హస్తం ఉందని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. కోర్టులు క్లీన్ చిట్ ఇవ్వకున్నా, చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారని అన్నారు. ప్రజల కష్టాలు చూసిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి  పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అన్ని విభాగాల్లో పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని శ్రీమతి విజయమ్మ మండిపడ్డారు. తెలుగుదేశం, కాంగ్రెస్ కుమ్మక్కయ్యి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలులో పెట్టించారన్నారు.

టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు

ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న తెలుగుదేశం పార్టీలో ఇమడలేకనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి చెప్పారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే అక్రమ కేసులు పెట్టారని అమర్‌నాథ్ రెడ్డి ఆరోపించారు.

జోరు వర్షంలోనూ భారీగా జనసందోహం

     పలమనేరులో జరిగిన బహిరంగ సభకు జనం భారీగా తరలి వచ్చారు. ఒకవైపు జోరున వర్షం కురుస్తున్నా శ్రీమతి విజయమ్మ ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు.  పార్టీ నేతలు వై.వి. సుబ్బారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి రోజా తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.

Back to Top