భిక్షాటనతో వైయస్‌ఆర్‌సీపి వినూత్న నిరసన

హైదరాబాద్, 27 ఆగస్టు 2012 : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియింబర్సుమెంట̴్ పథకాన్ని యధావిధిగా అమలు చేయాలంటూ వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భిక్షాటనతో వినూత్న నిరసన నిర్వహించారు.  హైదరాబాద్‌లోని అబిడ్సు ప్రాంతంలో సోమవారంనాడు ఈ నిరసన నిర్వహించారు.  ఫీజు రీయింబర్సు పథకాన్ని క్రమేపీ నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం కుటిల పన్నాగం పన్నుతోందని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ కార్యకర్తలు, విద్యార్థులు ఆరోపించారు. పేద విద్యార్థులు కూడా పై చదువులు చదివి ఉన్నత స్థాయికి రావాలన్న ఉన్నతాశయంతో వైయస్‌ ప్రారంభించిన ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని రాష్ట్ర సర్కార్‌ తుంగలో తొక్కేయడానికి దారులు వెతుకుతోందని విమర్శించారు. పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఇంజనీరింగ్‌ ఇతర వృత్తి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తిగా ఫీజును ప్రభుత్వమే చెల్లించాలని నినదించారు. తమ డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించే వరకూ నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తూనే ఉంటామని ఈ నిరసన కార్యక్రమానికి నేతృత్వ వహించిన హైదరాబాద్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్కక్షుడు, జి.హెచ్‌.ఎం.సి. సభ్యుడు ఆదం విజయకుమార్‌ హెచ్చరించారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు కేవలం రూ. 35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తప్పుపట్టింది. ఇంజనీరింగ్‌ విద్యార్థికి అయ్యే ఫీజు మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Back to Top