ప్రతిపక్ష నేతపై సీఎం వ్యాఖ్యలు దారుణం

() జాతీయ నేతల పేర్లు ఉచ్చరించే అర్హత చంద్రబాబుకు లేదు
() బాబును విశ్వాసఘాతకుడన్న ఎన్‌టీఆర్‌
() ఆయన రాజకీయ జీవితమంతా కుట్రలు, హత్యలే
() ఏపీ చరిత్రలో వైయస్‌ జగన్‌ వంటి ప్రతిపక్ష నేత రాలేదు
() అవినీతిని అడ్డుకుంటున్నాడనే బాబుకు ఆక్రోశం
() వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి

హైదరాబాద్‌: ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలు బట్టబయలు చేసే వరకు వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిద్రపోరని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. వైయస్‌ జగన్‌ లాంటి ప్రతిపక్ష నేత ఉండటం విడ్డూరమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను భూమన ఖండించారు. బాబు అవినీతిని వైయస్‌ జగన్‌ అడ్డుకోవడంతో ఇలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పుచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వరరావు, నంబూద్రిపాది, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, రోశయ్య వంటి నాయకులను చూశానని పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. వాళ్లంతా దేశం కోసం త్యాగం చేశారని,జాతీయ నాయకులను బాబు ఏకవచనంతో ఉచ్చరించడం దారుణమని భూమన అన్నారు. వారి పేర్లు కూడా ఉచ్చరించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. బాబు చెప్పిన వారంతా దేశ రాజకీయాలకు శిఖరం లాంటి వారని, అలాంటి ఆఖరితరంలో వచ్చిన చంద్రబాబు జాతీయనేతల ఆలోచనలు, ఆశయాలను సమాధి కట్టిన గంజాయి మొక్క అని అభివర్ణించారు. బాబుపై వచ్చినన్ని ఆరోపణలు ఏ సీఎంపై రాలేదని తెలిపారు. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, ఆయన గొప్పతనం ఏంటో ఎన్‌టీఆర్‌ మాటలు వింటే తెలుస్తుందన్నారు.. తెలుగు ప్రజల ఆరాధ్యదైవమైన స్వర్గీయ ఎన్‌టీ రామారావు చంద్రబాబును ఉద్దేశించిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా వీడియో ద్వారా గుర్తు చేశారు. ‘‘వాడు ఔరంగజేబు వారసుడు, విశ్వాసఘాతకుడు’’ అని ఎన్‌టీఆర్‌ వ్యాఖ్యానించారంటే చంద్రబాబు వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమవుతోందన్నారు. 
ఆ హత్యలకు కారకులెవరు బాబూ?
చంద్రబాబు మచ్చలేని నాయకుడైతే..1991లో కడపలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి పోలంకి వెంకటసుబ్బయ్యను హత్య చేసింది ఎవరని వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కావలి టికెట్‌ కోసం డాక్టర్‌ ప్రభాకర్‌నాయుడి నుంచి రూ.50లక్షలు లంచం తీసుకొని గిరిజన కోటయ్యను హత్య చేయించింది ఎవరని నిలదీశారు. ఆయన రాజకీయ జీవితమంతా కుట్రలు, హత్యా రాజకీయాలే అని ఆరోపించారు. చంద్రబాబు బేతాళ మాంత్రికుడికి తీసిపోరని, తంత్ర విద్యలన్నీ ఆయన వద్దే ఉన్నాయన్నారు.
కేసీఆర్‌ బెదిరింపులకు భయపడి..
పదేళ్ల పాటు హైదరాబాద్‌లోనే ఉంటానని శపథం చేసిన చంద్రబాబు ఏడాదికే ఎందుకు అమరావతికి పరుగులు తీశారని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. నాడు హైదరాబాద్‌లో పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటామని ప్రకటించి, తెలంగాణలోటీడీపీని అధికారంలోకి తెచ్చే వరకు ఇక్కడే ఉంటానని చెప్పాడన్నారు. అయితే ఓటుకు నోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన చంద్రబాబు కేసీఆర్‌ బెదిరింపులకు భయపడి అమరావతికి పరుగులు తీశారని ఎద్దేవా చేశారు.
వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వమే మా ఆస్తి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యక్తిత్వం, ఔన్నత్యం, పోరాట పటిమనే తమ ఆస్తి అని భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ఏ ఒక్క వాగ్ధానం చంద్రబాబు నెరవేర్చలేదని, తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో చేసిన ఐదు సంతకాల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని ఫైర్‌ అయ్యారు. ఇలాంటి సీఎంపై ఒత్తిడి తెచ్చేందుకు వైయస్‌ జగన్‌ యుద్ధం ప్రకటించి చంద్రబాబు అవినీతిని అడ్డుకుంటుంటే..ఆయనేమో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. పోలవరం పూర్తి చేయాలని కోరడం తప్పా? అమరావతి నిర్మించాలని డిమాండ్‌ చేయడం నేరమా? హామీలు నెరవేర్చండి అని కోరడం సరికాదా అని ప్రశ్నించారు. అభివృద్ధి చేయండని వైయస్‌ జగన్‌ మొత్తుకుంటున్నారని ఆయన తెలిపారు.తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టే చంద్రబాబుపై వైయస్‌ జగన్‌ యుద్ధం ప్రకటించారన్నారు. ఇది జీర్ణించుకోలేని సీఎం ప్రతిపక్షాన్ని చీల్చేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.30, రూ.40 కోట్లు ఎర చూపి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని ఆక్షేపించారు. ఆంధ్ర ప్రదేశ్‌ చరిత్రలో వైయస్‌ జగన్‌ వంటి ప్రతిపక్ష నేతను  ఇంత వరకు రాలేదన్నారు. మూగబోయిన ప్రజల రోదన వైయస్‌ జగన్‌ గొంతులో నుంచి ప్రతిధ్వనించిందని..ప్రభుత్వంపై పోరు కొనసాగుతుందని హెచ్చరించారు. చంద్రబాబు రాజకీయ కుట్రను ఛేదించేవరకు వైయస్‌ జగన్‌ నిద్రపోరు, నిద్రపోనివ్వరని భూమన హెచ్చరించారు.
Back to Top