జీవీఎంసీ ఎన్నికల కార్యాచరణకు వైఎస్సార్‌సీపీ శ్రీకారం

విశాఖపట్నం: ప్రజలతో మమేకం... ప్రజా సమస్యలపై పోరాటం... సమస్యల పరిష్కారానికి పార్టీ విధానంపై ప్రచారం...ప్రజా సమస్యలపై పార్టీ పంథా ఇదీ... క్షేత్రస్థాయి నుంచి బలోపేతం...కష్టించేవారికి గుర్తిం పునిస్తామన్న భరోసా...గెలుపే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక..ప్రచారంలో దూకుడు.. గెలుపే లక్ష్యం..పార్టీ రాజకీయ కార్యాచరణ ఇదీ.. గ్రేటర్ విశాఖలో పాగా వేయడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల సన్నాహాలకు తెరతీసింది. గురువారం నిర్వహించిన  నగర కమిటీ సమావేశం పార్టీశ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపింది.

పార్టీ  ఎన్నికల కార్యాచరణను పరిశీలకులు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు  ఎన్నికల కార్యాచరణ ప్రణాళికను సవివరంగా వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల ప్రణాళిక వరకు అధిష్టానం మార్గదర్శకాలకు అనుగుణంగా చేపడతమని తేల్చిచెప్పారు. కార్యకర్తలు భరోసా కల్పిస్తూ... విజయంపై విశ్వాసాన్ని పెంపొంది స్తూ ఆద్యంతం స్ఫూర్తిదాయంగా సమావేశాన్ని నిర్వహించారు.

క్షేత్రస్థాయి నుంచి పటిష్టం
జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని  విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి పేర్కొన్నారు. నగరస్థాయి, నియోజకవర్గస్థాయి, డివిజన్‌స్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రజ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఉద్యమిస్తామన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తే తాము ఆ సమస్యలను ఎలా పరిష్కరించేదీ కూడా ప్రజలకు వివరిస్తామన్నారు.

అభ్యర్థుల ఎంపికపై పార్టీ విధానాన్ని పరిశీలకులు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. విజయావకాశాలే ఏకైక ప్రాతిపదికగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.  ఏ ఒక్క నేతకో అనుకూలంగా ఉంటే చాలు అభ్యర్థి కావచ్చన్న భ్రమలు పెట్టుకోవద్దని కుండబద్దలు కొట్టారు.  కార్యకర్తలు నేరుగా సంప్రదించవచ్చన్నారు.

శని, ఆదివారాలు ఇక్కడే
గ్రేటర్ విశాఖ ఎన్నికల కార్యాచరణ కోసం తాము ప్రతి శని, ఆదివారాలు నగరంలోనే ఉంటామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. తద్వారా ఈ ఎన్నికలకు పార్టీ ఎంతటి ప్రాధాన్యమిస్తుందో స్పష్టం చేశారు. మత్స్యకార, వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తూ  మరో ముగ్గురిని ఎన్నికల పరిశీలకులను త్వరలో నియమిస్తుందని తెలిపారు. విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు కర్తవ్యబోధ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది.

కేవలం మాటలు చెప్పడం కాకుండా స్వయంగా సమస్యల పరిష్కారానికి వారిద్దరూ చొరవచూపడం వారిని ఆకట్టుకుంది. నేతల ద్వారా కాకుండా నేరుగా తమను కలిసేందుకు అవకాశం ఇవ్వడంపట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. జీవీఎంసీ ఎన్నికలకు ముందుగానే పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగడంతో కార్యకర్తల్లో నమ్మకం పెరిగింది. సమావేశం అనంతరం కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డిలను కలసి పార్టీ పటిష్టపై చర్చించారు.

సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యేలు  కర్రి సీతారాం, తైనాల విజయ్‌కుమార్, మళ్ల విజయ్‌ప్రసాద్, గొల్ల బాబూరావు, తిప్పల గురుమూర్తిరెడ్డి, సమన్వయకర్తలు కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, రాష్ట్ర అధికార  ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు జాన్ వెస్లీ, హనోక్, సత్తి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు రవిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు విల్లూరి భాస్కర్, మహిళా విభాగం అధ్యక్షురాలు ఉషాకిరణ్‌లతోపాటు ఇతర అనుబంధ సంఘాలు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.   
 
డివిజన్ అధ్యక్షులకు ప్రశ్నావళి
గ్రేటర్ ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగింది. అందుకు నిదర్శనంగా డివిజన్ అధ్యక్షులకు ఓ ప్రశ్నావళితో కూడిన ప్రొఫార్మాను అందించింది. డివిజన్‌కు సంబంధించిన సమగ్ర సమాచారంతోపాటు రాజకీయ, సామాజిక అంశాలను అందులో ప్రశ్నల రూపంలో పొందుపరిచారు. ఆ ప్రశ్నావళిని నింపి వచ్చేవారం నిర్వహించే సమావేశంలో తమకు అందించాలని పరిశీలకులు తెలిపారు. తద్వారా తమ డివిజన్లపై అధ్యక్షులకు ఎంత అవగాహన ఉందన్నది తెలుసుకోవడంతోపాటు క్షేత్రస్థాయి నుంచి పూర్తి సమచారాన్ని రాబట్టాలన్నది పార్టీ ఉద్దేశం.
Back to Top