విద్యుత్ కోతలపై వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర బంద్ విజయవంతమైంది. బంద్‌ను సక్సెస్ చేసిన అన్ని వర్గాల ప్రజలకు వైయస్‌ఆర్ సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మీడియా సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు.హైదరాబాద్, 31 ఆగస్టు 2012 : విద్యుత్ కోతలకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్ ప్రశాంతంగా విజయవంతమైందని పార్టీ నాయకురాలు, కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం విలేకరులతో మాట్లాడుతూ, బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. బంద్‌ను విఫలం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్ని విధాలుగా కుట్రలు పన్నినా ప్రజలు బంద్‌ను విజయవంతం చేశారన్నారు. బంద్‌ను విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార, వాణిజ్య వర్గాలు, విద్యా, తదితర సంస్థలకు శోభా నాగిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.ప్రజా సమస్యలపై తమ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఎక్కడికక్కడ వందలాది మంది నాయకులు, వేలాది మంది కార్యకర్తలను అరెస్టులు చేయించి, స్టేషన్లలో వేసిందని శోభా నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకుల అరెస్టు అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బంద్ విజయవంతం కాలేదని చెప్పుకునేందుకు ఖాళీ బస్సులను ఈ సర్కార్ తిప్పిందని, విద్యా సంస్థలను మూసివేయవద్దని బెదరించిందని ఆమె ఆరో్పించారు. తమ పార్టీ నాయకులను అరెస్ట చేయించిందని, ముందుగానే కొందరిని హౌస్ అరెస్టులు కూడా చేయించిందని శోభా నాగిరెడ్డి దుయ్యబట్టారు. ఈ రోజు బంద్ కేవలం తమ పార్టీ కార్యక్రమం కాదని, బంద్‌ను నిర్వీర్యం చేయడం కాకుండా విద్యుత్ సమస్య పరిష్కారానికి కొన్ని చర్యలైనా తీసుకుని ఉంటే ఇంత సమస్య వచ్చి ఉండేది కాదన్నారు.విద్యుత్ కోతలతో జనం బాగా విసిగిపోయి ఉన్నారని, అందుకే వారంతా బంద్‌లో స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారని ఆమె పేర్కొన్నారు. బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాలుపంచుకున్న ఫలితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా విజయవంతమైందని చెప్పారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు, విద్య తదితర సంస్థలు ముందే సెలవు ప్రకటించి బంద్‌కు సహకరించారని తెలిపారు. ఈ బంద్‌ను చూసి అయినా స్పందించాలని కాంగ్రెస్ పార్టీకి శోభా నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.వర్షాలు లేకపోయినా, జలాశయాల్లో నీళ్ళు అడుగంటిపోతున్నా, విద్యుత్ సమస్య వచ్చి పడబోతున్నదని తెలిసినా రాష్ట్ర సర్కార్ పట్టించుకోలేదని శోభా నాగిరెడ్డి విమర్శించారు. అదనపు విద్యుత్ కోసం కేంద్రప్రభుత్వానికి లేఖ ఇచ్చినట్లు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకుంటోంది గాని దాని ప్రయోజనం ఏమీ కనిపించడం లేదని ఆరోపించారు.రాజకీయ లబ్ఢి కోసం తమ పార్టీ బంద్ పిలుపునివ్వలేదని ఒక ప్రశ్నకు శోభా నాగిరెడ్డి బదులిచ్చారు. రాష్ట్ర ప్రజలకు సమస్యలు లేవని, విద్యుత్ కోతలు లేవని కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వచ్చి చెప్పాలని సవాల్ చేశారు. హైదరాబాద్‌లో బంద్‌ను సమర్ధంగా నిర్వహించలేకపోయారా? అన్న మీడియా ప్రశ్నకు ఆమె బదులిస్తూ, బలవంతంగా దుకాణాలు మూయించడం, బస్సలు ధ్వంసం చేయడం తమ పార్టీ సిద్ధాంతం కాదన్నారు. జనాగ్రహాన్ని ప్రశాంతంగా వెల్లడించాలన్నదే తమ పార్టీ అభిమతం అన్నారు. ప్రజా సమస్యలపై ఇతర పార్టీలు చేసే అందోళనలకు తమ పార్టీ సంఘీభావం ప్రకటిస్తుందని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. భవిష్యత్‌లో సీపీఎం పార్టీతో కలిసి పనిచేస్తుందా అన్న మరో ప్రశ్నపై శోభా నాగిరెడ్డి స్పందిస్తూ, ప్రజా పోరాటాలను వామపక్షాలతో కలిసి నిర్వహిస్తామన్నారు. ఈ విషయాన్ని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి గతంలోనే చెప్పారని, ఇప్పటికీ తమ పార్టీ అదే విధానం కొనసాగిస్తున్నదని చెప్పారు. అయితే, తెలుగుదేశం పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పనిచేసే ప్రశ్నే లేదని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు స్పష్టం చేశారు.టి.వి. 9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వక్రీకరణ :ఒక వైపున విద్యుత్ కోతలతో ప్రజలు రోడ్ల మీదికి వస్తే బంద్ విఫలం అంటూ టి.వి. 9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానళ్ళలో ప్రసారాలు చేయడం పట్ల శోభా నాగిరెడ్డి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నేటి బంద్ కేవలం ఒక పార్టీ కార్యక్రమం కాదని, ప్రజల సమస్యలపై ప్రజా స్పందన అన్నారు. బంద్ లేదని ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు మీరు ఏం చెప్పదలచుకున్నారని టి.వి. 9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానళ్ళను ఆమె సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యే లేదన్నది మీ ఉద్దేశమా అని నిలదీశారు. దయచేసి ఇలాంటి వ్యతిరేక వార్తలను ప్రసారం చేయవద్దని శోభా నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.కృష్ణదాస్ సతీమణిపై దాడికి ఖండన :నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సతీమణి పద్మప్రియను ఒక ఎస్‌ఐ బలవంతంగా లాక్కెళ్ళి జీప్‌లో ఎక్కించడాన్ని శోభా నాగిరెడ్డి ఖండించారు. ఆ సమయంలో కృష్ణదాస్ ఒక భర్తగా స్పందిస్తే తప్పా లని ఆమె అన్నారు. ఇలాంటి సంఘటనను కూడా కొన్ని మీడియా సంస్థలు వ్యతిరేకంగా చూస్తున్నాయని తప్పుపట్టారు. ఒక ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై రోడ్డెక్కితే, ఆ సందర్భంగా ఆయనకు గాయం తగిలితే ఆ మీడియా సంస్థలకు అది వార్తగా కనిపించలేదా అని నిలదీశారు. ఈ వ్యవహారంపై ప్రివిలేజ్ కమిటీకి నివేదిస్తామని అన్నారు.తమ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపును ఇంత విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శోభా నాగిరెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.