బాబు జీవితమంతా అంతే

  • మహానేత ప్రాజెక్టులు కడితే..తాను కట్టినట్టు బాబు బిల్డప్‌
  • ఎన్నికల్లో సొంతంగా గెలిచే సత్తా లేక పక్క పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్నారు
  • తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు నిర్మించని బాబు
  • పోతిరెడ్డిపాడుకు అడ్డుపడిన దేవినేని ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు
  • ప్రాజెక్ట్‌లపై శ్వేతపత్రం విడుదల చేయండి
  • వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డిని అడ్డుకోవడం అప్రజాస్వామికం
  • ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్‌ :  చంద్రబాబు జీవితమంతా పక్కవారిపై ఆధారపడటమే తప్పా..సొంతంగా ఏది చేయలేరని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఇతరులకు రావాల్సిన క్రెడిట్‌ను తాను తీసుకునేందుకు, తన పార్టీ నేతలతో పొగిడించుకునేందుకు మీటింగ్‌లు పెట్టుకుంటూ..అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులను హాజరుకాకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ జిల్లా కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి గృహ నిర్భందం, పోలీసులు అడ్డుపడటాన్ని శ్రీకాంత్‌రెడ్డి తప్పుపట్టారు. ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల చర్చకు సిద్ధమా అంటూ సర్కార్‌కు ఆయన సవాల్‌ విసిరారు. చంద్రబాబు హయాంలో ఎన్ని  ప్రాజెక్టులు కట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

 చంద్రబాబు నిజంగా తానే ప్రాజెక్టులు కట్టానని అనుకుంటే ప్రతిపక్షం గొంతు నొక్కడం ఎందుకని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి పూర్తి చేసిన ప్రాజెక్టులను తాను కట్టానని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనా కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. పైడిపాలెం రిజర్వాయర్‌ ప్రారంభం నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డిని గృహ నిర్భంధం చేయడాన్ని శ్రీకాంత్‌ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ప్రోటోకాల్‌ను విస్మరించడం ప్రజాస్వామ్య దేశంలో మంచి పద్ధతి కాదన్నారు. రాయలసీమలోని ప్రాజెక్టులన్నీ తానే కట్టానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు అనంతపురం జిల్లాలో ఓడి చెరువుకు శంకుస్థాపన చేశారని, ఆ ప్రాజెక్టుకు చంద్రబాబు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. 1995వ సంవత్సరంలో అనంతపురం జిల్లాలోనే హంద్రీనీవా ప్రాజెక్టుకు 45 టీఎంసీల సామర్థ్యంలో నిర్మిస్తామని శంకుస్థాపన చేశారన్నారు. 1999 ఎన్నికల సమయంలో అదే ప్రాజెక్టుకు అనంతపురం జిల్లా ఆత్మకూరు వద్ద 5 టీఎంసీలకు సామర్థ్యాన్ని కుదిస్తూ మరో శంకుస్థాపన చేశారని తెలిపారు. 1999 నుంచి 2004వ సంవత్సరం వరకు ఆ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారన్నారు.

వాస్తవాలు మాట్లాడుతున్నాం
ప్రాజెక్టులపై తాము రాజకీయ కోణంలో మాట్లాడటం లేదని, వాస్తవాలు మాట్లాడుతున్నామని గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక బాబు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు రూ.3800 కోట్లు కేటాయించారన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులకు చంద్రబాబు 5 శాతం అరకొరగా చేపట్టి, వాటిని తానే కట్టినట్లు ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. బాబు తన సొంత మనుషులకు కాంట్రాక్టులు అప్పగించేందుకు ప్రాజెక్టు అంచనాలు పెంచారని ఆరోపించారు. నాడు రాయలసీమకు నీళ్లు ఇచ్చేందుకు మహానేత పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు చేపడితే మంత్రి దేవినేని ఉమా అప్పట్లో పాదయాత్ర చేసి అడ్డుపడ్డారని గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైయస్‌ఆర్‌ ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు, ఎన్ని నిధులు కేటాయించారో అన్న విషయంపై టీడీపీ నేతలకు దమ్మూ, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని శ్రీకాంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. పులివెందులకు నీళ్లు ఇచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కృషి చేశారని, దానికి రూ.24 కోట్లు కేటాయించి అంతా తానే చేసినట్లు చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.గత తొమ్మిదేళ్ల పాలనలో బాబుకు పైడిపాలెం ప్రాజెక్టు ఎందుకు గుర్తు రాలేదని ఆయన నిలదీశారు. పక్క తోటలోని పండ్లు తనవే అన్నట్లు, పక్కపార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తన పార్టీలో చేర్చుకోవడం, మహానేత కట్టించిన ప్రాజెక్టులు తానే కట్టించినట్లు ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకే సాధ్యమని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.


Back to Top