బాబు ఓటర్లను ప్రలోభపెడుతున్నారు

  • ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అడ్డదారులు
  • నీరు–చెట్టు నిధుల ద్వారా ఓటర్లను ఆకర్షించే ఆపరేషన్‌
  • ఎన్నికల అధికారిని కలిసిన వైయస్సార్సీపీ నేతలు
  • అవకతవకలు జరగకుండా చూడాలని వినతిపత్రం అందజేత
హైదరాబాద్‌: ఏపీలో జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా చూడాలని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు నాయకుడు అడ్డదారులు తొక్కడానికి సమాయత్నం అవుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో 600ల వాగ్ధానాలకు పైగా ఇచ్చిన చంద్రబాబు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఉపాధ్యాయులతో హడావిడిగా మీటింగ్‌ పెట్టి నేను గతంలో తప్పు చేశాను... నన్ను మన్నించండి.. నేను మీకు అన్ని చేసిపెడతానని ఓట్ల కోసం చంద్రబాబు కపటప్రేమ కురిపిస్తున్నాడని దుయ్యబట్టారు.

 ఓట్ల కోసం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఈవో, ఎంఈవోలకు రాత్రికి రాత్రే జీవో విడుదల చేసి ప్రమోషన్‌ల ద్వారా ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నారు. అధికారులతో సమావేశం పెట్టి మీరు మాకు ఓటేయాలని అడిగే ముఖ్యమంత్రిని ఇక్కడే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. నీరు చెట్టు పథకం కింద నిధులు విడుదల చేస్తూ ఓట్లు కొనుగోలు చేసే స్థితికి బాబు దిగజారారన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ఎంపీటీసీలను బెదిరించి, కిడ్నాపులు చేశారని గుర్తు చేశారు.  చంద్రబాబు దుశ్చర్యలను అడ్డుకోవాలని ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను కోరినట్లు పేర్కొన్నారు. ఏ పార్టీకి ఎన్నికల క్యాంపులు పెట్టే అధికారం లేదని, క్యాంపులు పెడితే వారి సభ్యత్వాలు కూడా రద్దు అవుతాయని  భన్వర్‌లాల్‌ చెప్పినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఎవరు అవినీతికి పాల్పడినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని భరోసా ఇచ్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మలు వివరించారు. 
 
Back to Top