ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించిన సంస్కృతి బాబుది

తెలుగుదేశం నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి
రెండేళ్లలో ఒక్క హామీ అయినా నేరవేర్చారా
ప్రజలు కడుపుమండి అల్లాడుతుంటే రాళ్లతో కొట్టరా..?
విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు
రాజధాని మొదలు దేవుడి భూముల వరకు లూటీ చేస్తున్నారు
టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన బొత్స సత్యనారాయణ

హైదరాబాద్ః ఎన్నికల హామీలు నెరవేర్చాలని ప్రజల పక్షాన ప్రతిపక్షనాయకుడు డిమాండ్ చేస్తుంటే...వాగ్ధానాలు అమలు చేయాల్సింది పోయి టీడీపీ నేతలు వైయస్ జగన్ పై విమర్శలకు దిగడం దుర్మార్గమని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మైకు ఉంది కదా అని తెలుగుదేశం నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు రాళ్లతో, చెప్పులతో కొట్టరా అని నేతలను హెచ్చరించారు.  ఎన్టీఆర్ ను చెప్పులతో  కొట్టించిన సంస్కృతి చంద్రబాబుదని బొత్స ధ్వజమెత్తారు. ప్రజల అభిప్రాయాన్నే వైయస్ జగన్ వ్యక్తపరిచారని ఆయన స్పష్టం చేశారు. 

తెలుగుదేశం నేతల నోటికి అడ్డూ, అదుపు లేకుండా పోయిందని బొత్స మండిపడ్డారు. హామీలు అమలు చేయాలని ప్రశ్నించడమే తప్పా..?  దేనికి ఆవేశపడుతున్నారని తెలుగుతమ్ముళ్లను నిలదీశారు. ఏపీకి అన్యాయం జరిగేలా ఎగువరాష్ట్రం ప్రాజెక్ట్ లు కడుతుంటే నోరు మెదపని మీరా మాట్లాడేది అంటూ తెలుగుదేశం నేతలపై బొత్స విరుచుకుపడ్డారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి ఓటుకు నోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు..ఏపీని తెలంగాణకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఛార్జిషీటులో 23 సార్లు బాబు పేరు పెట్టారని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.  హామీలు నిలబెట్టుకోకపోతే, విలువలు కాపాడుకోకపోతే, జనం సొమ్ము దోచేస్తుంటే.....బాబును రాష్ట్ర ప్రజానీకం క్షమించదని బొత్స హెచ్చరించారు. 

రాజకీయాల్లో ఏవైనా తప్పులు జరిగితే  దాన్నితాము సరిదిద్దుకొని పనిచేశామే గానీ....బాబు లాగా నిస్సిగ్గుగా తప్పుల మీద తప్పుల 
చేస్తూ ప్రజలను వంచించలేదని దుయ్యబట్టారు. రెండేళ్లలో మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా బాబు..? మీ పాలనలో ఏ ఒక్కరైనా సంతృప్తిగా ఉన్నారా...?  రాత్రి ఒకటి, పగలు మరొకటి మాట్లాడుతూ  జీవోలు విడుదల చేస్తారు. వ్యవస్థలన్నా, ప్రజలన్నా బాబుకు ఏమాత్రం గౌరవం లేదని,  మాటలతో కప్పిపుచ్చుకుంటారని బొత్స విమర్శించారు.  ప్రజలు కడుపుమండి అల్లాడుతుంటే...మీరు దోపిడీ సొమ్ముతో విదేశాలు పట్టుకు తిరుగుతున్నారు.  విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్రం, దేశం పరువును తీస్తున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేస్తూ...పిల్లలతో ప్రమాణం చేయిస్తారా..? ఒక్కసారి గ్రామాలకు పోయి చూడండి. పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తుందని అదికార టీడీపీని హెచ్చరించారు.  

వైస్రాయ్ హోటల్  దగ్గర ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించిన దానికి ఏం సమాధానం చెబుతారు బాబు. అలాంటి సంస్కృతి ఉన్న మీరా మాట్లాడేది.  వైయస్ జగన్ మానసిక స్థితి బాగోలేదని యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. ఓ పక్క ఖజానా ఖాళీ అయిపోయింది, రాష్ట్రం అప్పుల్లో ఉందంటూనే....జీడీపీ రెండెంకల వృద్ధి రేటు సాధించామని చెబుతున్నారు.  మీ మానసిక స్థితి బాగా ఉందా యనమల. ఖజానా ఖాళీ అయితే రెండెంకల జీడీపీ ఎలా వస్తుంది. ఏవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ద్వంద్వవైఖరితో మాట్లాడుతున్న మీకా మాకా మానసిక స్థితి బాగోలేనిది అంటూ  బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు ప్రతి అంశాన్ని వ్యాపార దృక్పథంతో చూస్తున్నారని బొత్స మండిపడ్డారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారు. డబ్బున్నవాళ్లకే రాజ్యసభ సీట్లు అమ్ముకుంటున్నారని  సొంత పార్టీ నేతలే దుమ్మెత్తిపోస్తున్నారు.  దీనికేం సమాధానం చెబుతారు బాబు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు అందరినీ మోసం చేశారు. రాజధాని భూములు, అసైన్డ్ భూములు దోచుకున్నారు. దానిపై ఎంక్వైరీ లేదు. పైపెచ్చు కొనుక్కుంటే తప్పేంటని మాట్లాడుతున్నారు.  ఆఖరికి  దేవాదయ భూములు కూడా దోచుకుంటున్నారు.  దానిపైనా విచారణ లేదు. ఇసుక, మట్టి సహా పంచభూతాలను దోచేస్తున్నారని బొత్స నిప్పులు చెరిగారు. 

దీనికి తోడు కేంద్రకేబినెట్ లో ఉన్న ఒక్కగానొక్క మీ మినిస్టర్ ఆశోకజపతి రాజు స్కాం బయటపడింది. లోకేష్, అప్పారావు మధ్య లాలూచీ...అశోకగజపతి రాజు మధ్యవర్తిత్వం సంగతేమిటి బాబు..? ఇన్ని అవకతవకలు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అవినీతిని సహించనని మాట్లాడే మీరు దీనిపై ఏం చర్యలు తీసుకుంటారు. నాయకుడే ప్రధాన ముద్దాయి అయినప్పుడు చర్యలు ఎక్కడ ఉంటాయని బాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. బాబు మీ పార్టీ నాయకులే మిమ్మల్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి మనిషిని ఏరకంగా చూడాలని ప్రతిపక్ష నేత అంటే దానికి రాద్దాంతం చేస్తారా..?  ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలతో అధికారంలోకి వచ్చిన మీరు.... ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఆత్మపరిశీలన చేసుకొని బుద్ధిగా మెలిగి ప్రజాపరిపాలన మీద దృష్టి పెట్టాలి. 
Back to Top