ఆత్మగౌరవ యాత్ర హక్కు చంద్రబాబుకు లేదు

హైదరాబాద్ 28 ఆగస్టు 28:

సీమాంధ్ర ప్రాంతం అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న ఉద్యమాలతో రావణ కాష్టంలా రగిలిపోతుంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో చలికాచుకుంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. తెలంగాణపై ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండా సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు,  యాత్రలు చేసే నైతిక హక్కు ఆయనకు లేదని స్పష్టంచేశారు. అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురైనా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.  పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో ఆయన ప్రసంగం..

తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిగారిని నిర్బంధించి 15 నెలలైందని అంబటి చెప్పారు. అలాగే రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలనీ, లేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనీ డిమాండు చేస్తూ ఆయన జైలులో నిరవధిక  దీక్ష ప్రారంభించి నాలుగు రోజులైదన్నారు.  రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది మొదలు రాష్ట్రంలో ఏర్పడిన పరిణామాలను వివరించడానికి తమ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఢిల్లీ వెళ్లారనీ, రాష్ట్రపతినీ, ప్రధాన మంత్రినీ కలిసి  సమైక్యాంధ్రకు మద్దతుగా జరుగుతున్న ఉద్యమాన్నీ, సీడబ్ల్యూసీ తీర్మాన నేపథ్యంలో కొందరు సాగిస్తున్న దమనకాండనూ విజయమ్మ వివరించారన్నారు. బుధవారం జంతర్‌మంతర్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారని చెప్పారు. జగన్మోహనరెడ్డిగారికి బెయిలు కోసమే ఇదంతా చేస్తున్నారని  టీడీపీ రాద్దాంతం చేస్తుండడాన్ని రాంబాబు ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేతలకు బుర్ర చెడిపోయి మాట్లాడుతున్నట్లుందన్నారు. ప్రధానినీ, రాష్ట్రపతినీ  కలిస్తే బెయిలొస్తుందా అని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. అంటే కాంగ్రెస్ పార్టీ మీరు కుమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డిగారిని జైల్లో పెట్టించారనే వాదనను అంగీకరిస్తున్నారా? అని నిలదీశారు. ఈ విషయాన్ని తాము మొదట్నుంచీ చెబుతున్నట్లు గుర్తుచేశారు. కోర్టుల ద్వారానే జగన్మోహన్ రెడ్డిగారికి బెయిలొస్తుందని చెప్పారు. వచ్చే నెల 9కి సుప్రీం కోర్టు సీబీఐకి ఇచ్చిన గడువు ముగుస్తోందనీ, ఆ సమయానికి ఆ సంస్థ చార్జిషీటు దాఖలు చేస్తే తమ నేతకు బెయిలొస్తుందని భావిస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు ఇలాంటి వాదన చేయడం దారుణమన్నారు. ఢిల్లీ పెద్దలు కుట్ర చేస్తే.. దానితో మీరు చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డిగారిని జైలుపాలు చేశారనే విషయాన్ని విజయమ్మ గారి ప్రస్తుత పర్యటనపై ఆరోపణలు చేయడం ద్వారా చెప్పకనే చెబుతున్నారా అని అంబటి అడిగారు. ఈ విషయం గురించి మాట్లాడాలని రాంబాబు డిమాండ్ చేశారు.

చంద్రబాబుది ఏ వాదం
రాజశేఖరరెడ్డిగారే తెలంగాణ వాదానికి ఆజ్యం పోశారని టీడీపీ అంటోందన్నారు. టీఆర్ఎస్ పార్టీ వచ్చి రాజశేఖరరెడ్డిగారు, ఆయన కుటుంబమూ సమైక్యవాదమనడంతోనే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్న విషయాన్ని గుర్తుచేశారు. మహానేత మాట్లాడలేని పరిస్థితిలో ఉండగా ఆయన సమైక్య వాదనీ కొందరు, వేర్పాటువాదని కొందరూ అనడంలో ఔచిత్యాన్ని ప్రశ్నించారు. ఒక్కసారి చరిత్ర చూస్తే ఆయన సమైక్యవాదో , ప్రత్యేకవాదో తెలుస్తుందని చెప్పారు. రాజశేఖరరెడ్డిగారు ఏ వాదో చెప్పడం కాదనీ, బతికున్న చంద్రబాబు ఏ వాదో చెప్పాలనీ రాంబాబు టీడీపీ నేతలను డిమాండ్ చేశారు. చంద్రబాబు సమైక్యవాదా, ప్రత్యేకవాదా, అవకాశవాదా చెప్పాలని కోరారు. బతికున్నాడు.. మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు.. అనేక సందర్భాలలో మాట్లాడుతున్నాడు.. అలాంటి చంద్రబాబు నోరు మెదపకుండా గోడ మీద పిల్లిలా ఎందుకు వ్యవహరిస్తున్నాడో చెప్పాలని ఆయన టీడీపీ నాయకులను కోరారు. తెలంగాణలో జై తెలంగాణా అనీ, సీమాంధ్ర ప్రాంతంలో నై తెలంగాణా అనీ అంటారనీ, అక్కడో లొల్లి, ఇక్కడో లొల్లీ చేస్తూ చంద్రబాబు గోడ మీద పిల్లిలా సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారన్నారు.

సమైక్యాంధ్ర కావాలని కోరుతూ చంద్రబాబు ఆదేశం మేరకు ఒకాయన ఢిల్లీలో శ్రీకృష్ణుని వేషం వేస్తారనీ, కొరడాతో కొట్టుకుంటారనీ, మరొకాయన రాజమండ్రిలో ఫుట్ బాల్ ఆడతారనీ రాంబాబు ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఆవరణలో కొరడాతో కొట్టుకోవడం కాదనీ, టీడీపీ ఆఫీసుకు వచ్చి చంద్రబాబును  ఫుట్ బాల్ ఆడాలనీ, ఏవాదో చెప్పాలనీ డిమాండ్ చేయాలనీ సూచించారు. టీడీపీ నేతలు ఆడుతున్న డ్రామాలను ప్రజలను గమనిస్తూనే ఉంటారని హెచ్చరించారు. సీమాంధ్ర ప్రాంతం అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న ఉద్యమాలతో రావణ కాష్టంలా రగిలిపోతుంటే చరిత్ర హీనుడైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో చలికాచుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టి కాంగ్రెస్, టీడీపీలను చిత్తుచిత్తుగా ఓడించినందుకు కక్షగట్టి జైల్లో పెట్టి 15నెలలైనప్పటికీ, తన కుటుంబం ఎన్నో కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటానని చెప్పి, చంచల్ గుడా జైల్లో నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర వీరుడని పేర్కొన్నారు. చరిత్ర వీరుడి కుటుంబాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు చరిత్రహీనులకు లేదని రాంబాబు స్పష్టంచేశారు.

హాట్ లైన్ ఉండగా అపాయింట్‌మెంట్ ఎందుకు చంద్రబాబూ!
ఎన్టీ రామారావు వారసులమని చెప్పుకుంటున్న చంద్రబాబు సీడబ్ల్యూసీ తీర్మానానికి ముందు మాట్లాడుతూ తమకు ప్రధాని అపాయింట్‌మెంటే లభించలేదంటున్నారనీ, రోజూ హాట్ లైన్లో మాట్లాడుకునే మీకు అపాయింట్‌మెంట్ ఎందుకని ప్రశ్నించారు. జూలై 28,29 తేదీలలో కాంగ్రెస్ హైకమాండ్‌తో మంతనాలు జరిపింది నిజం కాదా చంద్రబాబు చెప్పాలని కోరారు. తమ పార్టీ సభ్యుల మాదిరిగానే టీడీపీ సభ్యులు కూడా జూలై 25నే రాజీనామా చేసుంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదని పేర్కొన్నారు. రాజీనామా చేయకపోగా జూలై 31న మాట్లాడుతూ తనకు తాను స్టేట్సు మ్యాన్ అని కితాబునిచ్చుకున్నారనీ, తెలంగాణ స్టేట్ కా లేక ఆంధ్ర స్టేట్ కా అని అడిగారు. ఇప్పటి వరకూ ఆయన తానేం చేస్తున్నాడో చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో పడిపోయాడని విమర్శించారు. ఆయనకు గౌరవ యాత్ర చేసే హక్కు లేదన్నారు. రాజీనామా అప్పుడు యాత్రకు బయలుదేరాలని డిమాండ్ చేశారు. ఎంపీ పదవికి హరికృష్ణ రాజీనామా ఇచ్చి ఆమోదింపజేసుకుంటే చంద్రబాబు ద్వంద్వ వైఖరితో నాటకాలాడుతున్నారన్నారు. తన వైఖరేమిటో చెప్పకుండా సీమాంధ్రలో అడుగుపెట్టే హక్కు ఆయనకు లేదని రాంబాబు స్పష్టంచేశారు. ఒకవేళ వెడదామనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

బాడీ లాంగ్వేజి తప్ప బొత్సకు ఏమీ తెలియదు
సమన్యాయం అంటే ఏమిటని ప్రశ్నిస్తున్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు అసలు న్యాయమంటే ఏమిటో తెలుసా అని రాంబాబు నిలదీశారు. బాడీ లాంగ్వేజి తప్ప ఏ లాంగ్వేజీ తెలియని ఆయనకు ఎలా చెబితే అర్థమవుతుందని ప్రశ్నించారు. ఒకరు ఓడామనీ, ఒకరు గెలిచామనీ అనుకోకుండా ఇరుప్రాంతాల వారు ఆనందంగా ఉండాలి.. విడిపోవడానికి సిద్ధపడాలి.. అది సమన్యాయమంటే అని వివరించారు. న్యాయమంటే తెలియని బొత్స గాంధీ భవన్ని బ్రాందీ భవన్ గా మార్చారని కాంగ్రెస్ పార్టీ వారే చెప్పిన సందర్భాలున్నాయని ఎద్దేవా చేశారు. లాంగ్వేజీ గురించి అర్థమవకపోవడమే కాక, నిఘంటువులు చూసే శక్తిగానీ, సామర్థ్యం గానీ కూడా ఆయనకు లేవన్నారు. తెలుగు మీద అసలు అవగాహనే లేదని ఎద్దేవా చేశారు. సమన్యాయమంటే ఏమిటో తెలియని దౌర్భగ్య పరిస్థితిలో ఓ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడుండడం విచారకరమన్నారు. ఆయనను చూసి తెలుగువారంతా సిగ్గుపడాల్సి వస్తోందన్నారు. ఒకరికి దుఖం, ఒకరికి సంతోషం లేకుండా ఇద్దరూ సంతోషంగా ఉండేలా చేయడమే సమన్యాయమనీ, ఇదే వైయస్ఆర్ కాంగ్రెస్ సిద్ధాంతమనీ ఆయన చెప్పారు. షిండేగారికి ఇచ్చిన లేఖ ఇంగ్లీషులోనే ఉందనీ, జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ దానిని చదువుకుంటే సమన్యాయమంటే ఏమిటో తెలుస్తుందని చెప్పారు. చంద్రబాబులాగా తాము బ్లాంక్ చెక్ ఇవ్వలేదన్నారు. విభజించాల్సి వస్తే ఓ తండ్రిలా సమన్యాయం చేయండని చెప్పాం తప్ప మా వైఖరిని మార్చుకోలేదని రాంబాబు స్పష్టంచేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top