రెండు నాలుకల బాబు

  • దేశంలో ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తున్నాయి
  • ఎన్నో కులాలు, మతాలున్నా మనదేశం భిన్నత్వంలో ఏకత్వం
  • మీడియాలో పక్షపాత ధోరణి కనిపిస్తోంది
  • సోనియా, చంద్రబాబు స్వార్ధానికి తెలుగువారిని విడగొట్టారు
  • మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖపట్నం: ప్రజల అవసరాలను గుర్తించి ప్రజా ఉపయోగకర కార్యక్రమాలు చేసిన వారే రాజకీయ నేతలవుతారని, తన స్వార్థం కోసం ప్రజాశ్రేయస్సును తాకట్టుపెట్టడం రాజకీయ నాయకుడి లక్షణం కాదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.  రాజ్యసభలో ప్రవేశించడానికి తనకు పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం కల్పించారని..చిత్తశుద్ధితో, ప్రజల అంచనాలకు తగినట్లుగా పనిచేయాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. మన దేశం, మన రాష్ట్రం, మన ఊరు, మన భాష, సంస్కృతి చాలా గొప్పవన్నారు. విదేశాల్లో ఉన్న ప్రజా సంబంధాలతో పోలిస్తే మన గొప్పతనం ఏంటో అర్థమవు తుందన్నారు. మన దేశంలో భిన్న సంస్కృతులు, మతాలు, సామాజికవర్గాలు ఉన్నా భిన్నత్వంలో ఏకత్వంతో మన దేశం ముందంజ వేస్తోందని అన్నారు. కానీ 1960, 70 సంవత్సరాలతో పోల్చుకుంటే ప్రజాస్వామ్య, సామాజిక విలువలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇది దేశానికి మంచిది కాదన్నారు. దేశంలో ఇప్పుడు పరిస్థితులు విశ్లేషిస్తే భాషలవారీగా, మతాల వారీగా, కులాల వారీగా విడిపోయి, స్వప్రయోజనాలను కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఉన్న ముఖ్యమైన నాలుగు వ్యవస్థలు సమన్యాయం పాటించి, కులమతాలకు అతీతంగా న్యాయం చేస్తేనే ఈ వ్యవస్థ పదికాలాల పాటు సవ్యంగా కొనసాగుతుందని, కానీ దురదృష్టవశాత్తు వ్యవస్థలన్నీ కులమతాల మయమైపోయాయని ఆయన అన్నారు. 

అధికారం కాదు, ప్రజాబలం ముఖ్యం
మనం ప్రజా ప్రయోజనాల కోసమా..? స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నామా అనేది అధికారపార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు. 2014 ఎన్నికల ముందు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు సమాయుక్తమై ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ మాత్రం ఒంటరిగా పోటీ చేసిందన్నారు. మూడు పార్టీలకు 45 శాతం ఓట్లు వస్తే, ఒక్క వైయస్‌ఆర్‌ సీపీకే 44 శాతం ఓట్లు వచ్చాయన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ 175 స్థానాలకు 67 స్థానాల్లో గెలిచినా, అధికారంలోకి రాకపోవచ్చు గానీ, ప్రజాబలం ఎంతుందనేది ముఖ్యమని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బాధ్యాతాయుతంగా పనిచేస్తుందా..నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్న వైయస్‌ఆర్‌ సీపీ పనిచేస్తుందా?  అనేది మీడియా ఎత్తి చూపాలన్నారు. కానీ మీడియా కూడా పార్టీలు, కులాల వారీగా విడిపోయినట్లు కనిపిస్తోందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ నేతల్లా వ్యవహరించకుండా చిత్తశుద్దితో బాధ్యతాయుతంగా నడుచుకోవాలనేది తన ఉద్దేశ్యమని చెప్పారు. మీడియాలో కొంత పక్షపాత ధరోణి కనిపిస్తోందని, మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్లేషించిన మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకుండా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమవ్వాలన్నారు. 

 సర్జికల్‌ స్ట్రైక్స్‌పై విమర్శలా?
భారత దేశ రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయని ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంస్కృతిని కొల్లగొట్టాలని ఒకవైపు పాకిస్థాన్, మరోవైపు చైనా, ఇంకోవైపు పాకిస్థాన్‌.. ఇలా మూడు దేశాలు మన దేశాన్ని ఎంత ఆక్రమించుకుందామా అని చూస్తున్న తరుణంలో భారతసైన్యం వీరోచితంగా చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ను కూడా కొంతమంది రాజకీయ నాయకులు విమర్శించారని చెప్పారు.. పాకిస్తాన్‌పై మన దేశం చేసిన పోరాటం ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో జాతీయ భావాన్ని పెంపొందించిందన్నారు. దేశ రక్షణ కోసం ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించాల్సిందిపోయి ఈ విషయంలో అనుమానాలు రేకెత్తేలా మాట్లాడటం సరికాదని ఆయన చెప్పారు.

రెండు నాలుకల వ్యక్తి మనకు సీఎం
సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఐక్యంగా ఉన్న తెలుగువారిని విడగొట్టారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. రెండు నాలుకలతో వ్యవహరించేటువంటి టీడీపీ లాంటి పార్టీలు విభజనకు సమర్థించాయని మండిపడ్డారు. కానీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీపీఎంలు సమైక్యత కోసం పోరాటం చేశాయన్నారు. విభజనకు సమర్ధించిన చంద్రబాబు బలమైన కారణం చెబితే బాగుండేది కానీ, రాష్ట్రం విడిపోతే ఏపీలో అధికారంలోకి రావచ్చు అని కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. రెండు నాలుకల సిద్ధాంతంతో వ్యవహరించే వ్యక్తి మనకు ప్రస్తుతంగా సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన ఫలితాన్ని ఇప్పుడు ఏపీ ప్రజలంతా అనుభవిస్తున్నారన్నారు. 

విభజనతో అన్యాయానికి గురైన ఏపీ మనుగడ కోసం ప్రత్యేక హోదా అని ప్రకటించి వాటిని అమలు చేయడంలో మాత్రం బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. హోదా సాధనలో ముందుండాల్సిన చంద్రబాబు స్వార్ధపూరిత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి ప్యాకేజీవైపు మొగ్గు చూపుతున్నారని దుయ్యబట్టారు. హోదా వల్ల జరిగే అభివృద్ధి అంచెనాలు వేయడమే కష్టతరం అయినప్పుడు హోదాను ప్యాకేజీతో ఎలా పోల్చుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవడం కోసం మీడియా ముందుండాలని చెప్పారు. ప్రభుత్వం, ప్రతిపక్షం, న్యాయవ్యవస్థల తప్పులను కూడా ఎత్తిచూపే బాధ్యత మీడియాకు ఉందన్నారు. మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా ఉండాలని తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మనమంతా కష్టపడాలని అన్ని వర్గాలకు పిలుపునిచ్చారు. 

 
Back to Top