దాడులకు పాల్పడిన వారిని వెనకేసుకువస్తూ కొవ్వొత్తుల ర్యాలీలా

 మార్కెట్ యార్డుల్లోనూ స్కాంలే

పేదలకు ఇంటి నిర్మాణం పేరుతో కొత్త స్కాం

బాబు హయాంలో తారాస్థాయికి చేరిన అవినీతి

అగ్రిగోల్డు బేరాలు వెలుగులోకి రావడంతో తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్న బాబు

ఎన్టీఆర్ కు వెన్ను పొడిచినట్లే, హోదాకు కూడా పొడిచారు.

అధికారంలోకి వస్తే  హౌజ్ ఫర్ ఆల్ పేరుతో పేదలందరికీ ఇళ్లు

అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదు

 పేదల అప్పుభారాన్ని
తొలగిస్తాం

గుడివాడలో బహిరంగ సభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి 

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గుడివాడ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు సోమవారం సాయంత్రం  నెహ్రూ చౌక్ వద్ద జరిగిన  బహిరంగ సభలో జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి
ప్రసంగించారు.

మహిళల రక్షణపై చంద్రబాబు కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించడం హాస్యాస్పదమనీ,  అబద్దాలు, మోసమే చంద్రబాబు జీవితమని, గత నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై వైయస్ జగన్ నిప్పులు చెరిగారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ...

 మండుటెండలో కూడా తన వెంట నడుస్తూ ఆప్యాయతలు
చూపుతున్న, ప్రేమానురాగాలు పంచిపెడుతూ ఆత్మీయతను చూపుతున్న  ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు .

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఇంతవరకు ఒక్క
సారి కూడా రెండో పంటకు నీళ్లి వ్వలేదంటూ రైతులు తన వద్ద వాపోయారన్నారు. గతంలో
వైయస్ ఆర్ హయాంలో రెండు పంటలకు నీళ్లు ఉండేవనీ, కానీ ఇవాళ తమ కర్మ అని ఆవేదన
చెందుతున్నారని రైతుల దుస్థితిని వివరించారు. పులిచింతల పక్కనే కనిపిస్తున్నా
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 45 టిఎంసిల నీటిని నిల్వ
ఉంచుకోలేకపోతున్నామని, తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 145 కోట్లను చెల్లించకుండా, ప్రజలకు తాగునీరు, సాగునీరు రాకుండా ప్రచారంతోనే  మోసపుచ్చుతున్నారన్నారు. 

ఈ రోజు మినుము, వరి రైతులు వచ్చి తమ పంటను
తగలపెట్టడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. పట్టిసీమతో డెల్టాను శ్యస్యశ్యామలం చేసి
ఉంటే, తమకు రెండు పంటలకు నీళ్లు ఎందుకు రావడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారని
చెప్పారు. చంద్రబాబు నాయుడు రాయలసీమకు పోయి, కృష్ణలో బంగారం పండిస్తున్నారనీ చెపుతారనీ,
కృష్ణా డెల్టాలో తిరుగుతున్నప్పుడు పట్టిసీమ కట్టాను, నితో రాయలసీమను శ్యస్య శ్యామలంచేశానని
చెప్పుకుంటూ చెవుల్లో పూలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అక్కడి వారు, ఇక్కడికి
రారు, ఇక్కడి వారు అక్కడికి పోరు కాబట్టి అబద్దాలతో మోసం చేస్తున్న ఈ పెద్దమనిషిని
ఏమనాలని సూటిగా అడిగారు.  అట్లాగే వరి,
మినుములకు కనీస మద్ధతు ధరలు రాకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ, దళారీలకు
కొమ్ము కాస్తూ, మార్కెట్ యార్డులలో కూడా స్కాంలకు పాల్పడుతున్నారని వైయస్ జగన్
చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ లో చంద్రబాబు దళారీలు మాత్రమే
కొనుగోళ్లు చేస్తుంటే  తామెలా బతకాలంటూ రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. అలాగే
చేపల, రొయ్యల చెరువుల నిర్వాహకులు కూడా నానా అగచాట్లు పడుతున్నారన్నారు.

దివంగత వైయస్ ఆర్ హయాంలో గుడివాడలో భూములు
కొనుగోలు చేసి 100 ఎకరాల భూమిని కొనుగోలు చేయడంతోపాటు,  5 వేల మందికి పైగా ఇళ్లు కట్టిస్తే, చంద్రబాబు
హయాంలో ఒక్క ఇంటిని కూడా కట్టించలేదని అన్నారు.

మహానేత హయాంలో గుడివాడలో  ఇళ్లు కట్టించాలని వంద ఎకరాలు
కొనుగోలు చేసి, స్థలాన్ని ఫ్లాట్లుగా మార్చి  పేదలకు పంపిణీ చేస్తే, తమ కర్మకొద్దీ చంద్రబాబు
సిఎం  అయిన తరువాత ఆ స్థలాలను వెనక్కు
తీసుకుంటున్నారని పేదలు తన దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి
ప్రస్తావించారు. ఇలా తిరిగి తీసుకుంటున్న స్థలంలో పేదలకు 300 చదరపు అడుగుల ప్లాట్
నిర్మాణం పేరుతో  పేదవాడి నెత్తిన అప్పులు
మోపే పెద్ద స్కాంకు శ్రీకారం చుడుతున్నారని జగన్ తీవ్రంగా మండిపడ్డారు. బాబు
హయాంలో మట్టి, బొగ్గు, కరెంటు కొనుగోళ్లు, కాంట్రాక్టర్లు, రాజధాని భూములు, గుడిభూములు
ఇలా ప్రతి దానిలోనూ అవినీతి చేశారనీ, పేదల ఇళ్ల నిర్మాణంలోని అవినీతితో అది  తారాస్థాయికి  చేరిందన్నారు.

చంద్రబాబు అవినీతి ఏమిటంటే పేదవాడికి  300 అడుగుల విస్తీర్ణంలో ప్లాట్లు కట్టిస్తానంటూ చదరపు అడుగుకు వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యే దానికి 2 వేల రూపాయల బిల్లును కాంట్రాక్టర్ కు
చెల్లిస్తారు.మొత్తం ఆరు లక్షలు ఖర్చు అయ్యే దాంట్లో, వాస్తవంగా అయ్యే 3 లక్షలను కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వాలు భరిస్తే మిగిలిన 3 లక్షలను పేదలపై అప్పుగా మోపుతారు. ఈ మొత్తాన్ని
పేదలు 20 సంవత్సరాలపాటు నెలకు 3 వేల చొప్పున కడుతూ.....పోవాలట అని వివరించారు.అక్రమంగా కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన మొత్తంలో లంచాలు మెక్కేది చంద్రబాబు అయితే,
దానిని పేదలు కడుతూ పోవాలనడాన్ని మించిన అన్యాయం, దారుణం మరేదైనా ఉంటుందా అని
సూటిగా ప్రశ్నించారు.

ఇలాంటి పరిస్థితులున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి
ఇళ్లు మంజూరైతే తీసుకోవాలని, అధికారంలోకి వచ్చిన  తరువాత పేదలపై ఉన్న భారాన్ని తామే
తీసుకుంటామని ప్రకటించారు. అలాగే ఈ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లపై
కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గుడివాడ ప్రజల దాహార్తిని తీర్చడానికి
గతంలో వైయస్ ఆర్ హయాంలో  నిర్మించిన సమ్మర్
స్టోరేజి ట్యాంకు నుంచి అవసరమైన పైప్ లైన్ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో
ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. పైపులు మార్చే పనిపై శ్రద్ధ చూపకుండా,
పాత పైపుల ద్వారా మురుగునీరు సరఫరా అవుతున్నా పాలకులకు పట్టని దైన్య స్థితి
ఉందన్నారు. వైయస్ ఆర్ మరణం అనంతరం తాగునీరివ్వాలనే తపన ఏనాయకుడిలోనూ
లేకపోవడం తమ కర్మగా ఇక్కడి ప్రజలు అనుకుంటున్నారన్నారు.

ఇలా పూర్తి అబద్దాలతో, మోసాలతో కొనసాగుతున్న
చంద్రబాబు నాలుగేళ్ల పాలనను, ప్రజా సంక్షేమానికి అహరం పాటుపడిన వైయస్ ఆర్ పాలను
బేరీజు వేసుకుని వచ్చే ఎటువంటి నాయకుడు తమకు కావాలో ప్రజలు గుండెలపై చేయి వేసుకుని
ఆలోచించాలని జగన్ మోహన్ రెడ్డి కోరారు. అబద్దాలు చెప్పేవాడు, మోసాలు చేసేవాడు
కావాలా తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.

ఎన్నికలకు ముందు మద్యం దుకాణాలపై చెప్పిన మాటలు, అటు
తరువాత అధికారంలోకి వచ్చి ఫోన్ కొడితే ఇంటికే మద్యం సరఫరా అయ్యేలా హైటెక్ పాలనన
తీసుకు వచ్చిన చంద్రబాబు నైజాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు.

వారి గోడు తలుచుకుంటే  తక్కు పోతుంది

అగ్రిగోల్డు బాధితుల గోడును
తలచుకున్నప్పుడల్లా తన గుండె తరుక్కు పోతుందని వైయస్ జగన్ అన్నారు.  కేవలం 1100 కోట్లు ఖర్చు చేస్తే చాలు
బాధితుల్లో 80 శాతం మందికి మేలు జరుగుతుందని చెపుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం
లేదని ధ్వజ మెత్తారు. పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బులు
వెనక్కు రాక లక్షలాది మంది అవస్థలు పడుతుంటే, వారి ఆస్తులు ఎలా కాజేయాలనే
చంద్రబాబు చూస్తున్నారన్నారు. వారిని ఆదుకోవాలన్న తలంపు చంద్రబాబులో ఎంతమాత్రం
లేదని , ఆస్తులను ఎలా కొట్టేయాలన్న దానిపై ఢిల్లీలో అమర్ సింగ్ తోనూ, ఇతరులతోనూ
అర్దరాత్రి చీకట్లో భేటీ అవుతూ బేరాలు సాగిస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
ఒక బ్రోకర్ మాదిరిగా అగ్రి గోల్డు ఆస్తులపై బేరాలు చేస్తున్నారన్నారు.

ఈ బేరాలపై పచ్చ మీడియా ఏమాత్రం
పట్టించుకోకపోయినా, తమకు వచ్చిన సమాచారంతో ప్రజలను అప్రమత్తం చేస్తే చంద్రబాబు తేలు
కుట్టిన దొంగలా గుంజుకుంటున్నారని పేర్కొన్నారు.

 చంద్రబాబు ముఖ్యమంత్రి
అయిన తరువాత రేషన్ షాపుల్లో లభించే వస్తువులను ఏ విధంగా తగ్గిస్తున్నదీ, వాటిలో
కూడా ఎలా కోతలు పెడుతున్నారో అన్న విషయాలను ప్రజలకు జగన్ వివరించారు. విద్యుత్ ఛార్జీల
పెంపు , పెట్రోలుపై టాక్సులతో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న వైనాన్ని వివరిస్తూ,
నాలుగేళ్ల పాలనలో అవినీతితో అక్రమార్జనకు పాల్పడతున్నారని మండిపడ్డారు.

అలాగే రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ
చేయకుండా,  నిరుద్యోగ భృతి ఇవ్వకుండానే
వారందరూ సంతోషంతో కేరింతలు కొడుతున్నారంటూ ప్రచారం చేసుకుంటూ చంద్రబాబు నయవంచనకు పాల్పడుతున్నారని
జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  ఇటువంటి
వాటన్నిటిపైనా చంద్రబాబును నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోసాలు,
అబద్దాలే చంద్రబాబు జీవితం అని ఎద్దెవా చేశారు.

హోదా వెన్నుపోటు దారు చంద్రబాబే

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేస్తున్న మోసం
అత్యంత దారుణమని వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాతో ప్రయోజనాలుంటాయని
తెలిసీ, ఎన్ టిఆర్ కు వెన్ను పోటు పొడిచినట్లే 
హోదాకూడా వెన్ను పోటు పొడిచారని తీవ్రంగా విమర్శించారు.  హోదా విషయంలో రోజుకో డ్రామా ఆడుతున్నారని , ఈ
డ్రామాల్లో నటనకు ఆయనకు ఆస్కార్ తో అన్ని అవార్డులు ఇవ్వవచ్చన్నారు. ఆయనకు ఉత్తమ
విలన్ అవార్డు తప్పకుండా లభిస్తుందన్నారు. రోజుకో స్టోరీ, స్క్రిప్టు, యాక్టింగ్
లతో ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. ఆయన చేసిన 420 దీక్షకు ప్రభుత్వ ఖజాను నుంచి
30 కోట్లు ఖర్చు పెట్టారని, నాలుగు సంవత్సరాలుగా ఆయన చేస్తున్న డ్రామాలన్నీ
ప్రజలకు తెలుసునన్నారు.

దాడులకు పాల్పడిన వారి కొమ్ము కాస్తూ ...కొవ్వొత్తుల ర్యాలీ హాస్యాస్పదం 

చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా
3026 కేసుల్లో మహిళలపై అకృత్యాలు జరిగితే నిద్రపోయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు
వాటి నివారణకు కొవ్వొత్తుల ర్యాలీ చేయడం దెయ్యాలు వేదాల వల్లించినట్లే ఉందని వైయస్
జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఎడిఆర్ నివేదికలో మహిళలపై దాడులకు పాల్పడిన వారు
రాష్ట్ర మంత్రులుగా ఉన్నారని తేలినా, స్వయంగా రాష్ట్ర స్పీకర్
గా ఉన్న కోడెల శివప్రసాద రావు కోడలు తమను చిత్రహింసలు పెడుతున్నారని చెప్పినా
చర్యలు తీసుకోకుండా వారిని ఇంకా పదవుల్లో కొనసాగిస్తూ మహిళపై అకృత్యాలకు వ్యతిరేకంగా
ర్యాలీ నిర్వహించడంలో అర్ధం లేదన్నారు. అంతే కాకుండా కోడలు మగపిల్లాడు కంటే అత్త
వద్దంటుందా అంటూ వెకిలిగా మాట్లాడిన వ్యక్తికి మహిళపై ఉన్న గౌరవం ఏపాటిదో అర్థం
అవుతుందని ఇలాంటి వారికి మహిళా రక్షణపై చిత్తశుద్ధి ఉందంటే ఎలా నమ్మాలంటూ ప్రశ్నించారు.
ఇది దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందన్నారు.

 ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి తాము అధికారంలోకి
వస్తే ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎలా పునరుద్దరిస్తామనే దానిని వివరించారు.


Back to Top