ఇప్పుడైనా 'అవిశ్వాసం' పెట్టు బాబూ!

హైదరాబాద్ 12 నవంబర్ 2012 : ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్ననేపథ్యంలో ప్రభుత్వం మైనారిటీలో పడినందున చంద్రబాబు అసెంబ్లీలో తక్షణమే 'అవిశ్వాస తీర్మానం' పెట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రస్తుత కీలక పరిణామంతో కాంగ్రెస్ ప్రభుత్వ బలం సందిగ్ధంలో పడిందని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం వారు మీడియాతో మాట్లా డుతూ, ప్రభుత్వం నిజంగానే పడిపోవాలని చంద్రబాబు కోరుకుంటూ ఉంటే 'పాదయాత్ర' ఆపి ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవా లన్నారు.
ఇప్పుడు కూడా అవిశ్వాసం పెట్టకపోతే కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము మిత్రపక్షమనైనా చెప్పాలని వారు ఎద్దేవా చేశారు. ఈ ప్రజావ్యతిరేక దౌర్భాగ్య ప్రభుత్వం గంట కూడా అధికా రంలో కొనసాగడానికి వీలు లేదని నిత్యం వల్లె వేసే చంద్రబాబు 'అవిశ్వాసం' పెట్టడానికి ఎందుకు వెనుకాడుతున్నారని వారు ప్రశ్నించారు.
ఇదివరకటి సంగతి అంతా ఒకెత్తు కాగా, ఎంఐఎం మద్దతు ఉపసంహరణ తర్వాత పరిస్థితి మరొకెత్తని వారు వ్యాఖ్యానించారు.
కిరణ్ ప్రభుత్వానికి 155 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, వారిలో ముగ్గురు వైయస్ఆర్ సీపీలో చేరారన్నారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఏవో డిమాండ్లతో రాజీనామాలు చేస్తామంటున్నారనీ, ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొనసాగడానికి కావలసిన 148 (మేజిక్ ఫిగర్) మంది శాసనసభ్యుల బలం లేనట్లు కనిపిస్తోందనీ వారు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో జారుకోకుండా చంద్రబాబు అవిశ్వాసం పెడితేనే ప్రతిపక్ష నాయకునిగా తన పాత్రను నిర్వహించినవారౌతారని వారు వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం అటు కరువు, ఇటు వరదలను ఎదుర్కోవడంలో విఫలమైందనీ, కరెంటు సంక్షోభానికి కారణమైందనీ, నడ్డివిరిచే పన్నులతో ప్రజలలో తీవ్ర అసంతృప్తిని మూటగట్టుకుందనీ వారు విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని రక్షించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.
"అసదుద్దీన్ ఒవైసీ మద్దతు ఉపసంహరణ ప్రకటన చేయగానే ఒక టిడిపి నాయకుడు అవిశ్వాసం పెట్టబోమన్నారు. మరో వైపు పీసీసీ చీఫ్ బొత్స తమ ప్రభుత్వానికి ఢోకా లేదంటూ ప్రకటించారు. ఇదంతా చూస్తుంటే టిడిపి, కాంగ్రెస్ పార్టీల మధ్య లాలూచీ కుస్తీ జరుగుతున్నట్లుగా తోస్తోంది"అని వారు ఎగతాళి చేశారు. కాళ్లు బొబ్బలెక్కుతున్నా మీ కోసం వస్తున్నానంటూ చంద్రబాబు పాదయాత్రలో చెబుతున్నారనీ, ఇక ఆ 'కష్టం' లేకుండా 'అవిశ్వాసం' పెట్టగలిగి వున్నా ఆ పని చేయటం లేదంటే మిలాఖత్ అయినట్లు తేటతెల్లమౌతోందనీ వారు వ్యాఖ్యానించారు.
'అవిశ్వాసం' పెట్టాలంటే కనీసం 30 మంది శాసనసభ్యుల బలం ఉండాలనీ, కనుక తాము సొంతంగా ఆ పని చేయ లేమనీ వారు వివరించారు. సైద్ధాంతిక వైరుధ్ధ్యాల దృష్ట్యా అవిశ్వాసం పెట్టడానికి ఇతర పార్టీలను కలుపుకునే ప్రయత్నమూ వైయస్ఆర్ సీపీ చేయదన్నారు. అయితే ఎవరు 'అవిశ్వాసం' పెట్టినా తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తామన్నారు.
ప్రభుత్వం మైనారిటీలో పడిందని గవర్నర్‌ను కలిసి చెప్పే విషయంపై వైయస్ఆర్ సీపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని వారు తెలిపారు. అయితే పార్టీ దీనిపై చర్చించి నిర్ణయి స్తుందన్నారు.
వ్యక్తిగత సంబంధాల వల్లే అసదుద్దీన్ ఒవైసీ జైలుకు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగిందని వారు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కిరణ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జగన్ కుట్ర చేస్తున్నారనడం సరి కాదనీ, ఏది జరిగినా జగన్ కుట్ర అనడం అనుచితమనీ వారు అన్నారు. "చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టకపోవడం కూడా జగన్ కుట్రేనా?" అని వారు వ్యంగ్యంగా ప్రశ్నించారు. 'అవిశ్వాసం' పెడితే వైయస్ఆర్ సీపీ బేరసారాలు చేసుకుంటుందని చంద్రబాబు అనడాన్ని వారు ఖండించారు. ఇదివరలో 'అవిశ్వాసం' పెట్టినప్పుడు తమ పార్టీ 16 మంది శాసనసభ్యులను కోల్పోయిందని వారు గుర్తు చేశారు. చంద్రబాబు నిజానికి ఇలా కోల్పోయిందేమీలేదన్నారు.

Back to Top