బాబూ! చిత్తశుద్ధి ఉంటే 'అవిశ్వాసం' పెట్టు!

వజ్రకరూరు

5 నవంబర్ 2012 : శాసనసభ్యుల సంఖ్యాబలం ఉన్న చంద్రబాబు చిత్తశుద్ధి ఉంటే పాదయాత్రల డ్రామాలు కట్టిపెట్టి అసెంబ్లీలో ఈ ప్రజాకంటక ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.19 వ రోజు పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా వజ్రకరూరులో సోమవారం సాయంత్రం జరిగిన ఒక భారీ బహిరంగసభలో షర్మిల ప్రసంగించారు.
"మీకు, మీ పాదయాత్రకు, మీ పార్టీకి చిత్తశుద్ధి కనుక ఉంటే పాదయాత్రలు మాని రైతులను, ఈ రాష్ట్ర ప్రజలను ఇంత కష్ట పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని దించే యాలని చంద్రబాబునాయుడుగారిని సూటిగా అడుగుతున్నాం"అని ఆమె నిలదీశారు. వైయస్ఆర్  సీపీ కూడా అవిశ్వాసానికి మద్దతు ఇస్తుందని చెప్పినా చంద్రబాబు ఆ పని చేయటం లేదని ఆమె విమర్శించారు. బాబు 'అవిశ్వాసం' పెట్టకుండా కాంగ్రెస్‌తో కుమ్మక్కై నీచరాజకీయాలు చేస్తున్నారని ఆమె తూర్పారబట్టారు.
"వారి తపన ఒక్కటే. చంద్రబాబుకైనా, కాంగ్రెస్‌వారికైనా కావలసింది ఒక్కటే. అది అధికారం. దాని కోసం ఏమైనా చేస్తారు.వెన్నుపోట్లకైనా రెడీ. అబద్ధాలకైనా రెడీ. ఏమి చేసైనా, కుట్రలు చేసైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. అందుకే వాళ్లు కుమ్మక్కై, అబద్ధపుకేసులు పెట్టి, బెయిలు కూడా రానివ్వకుండా ఒక్కడిని చేసి జగనన్నను నాలుగు గోడల మధ్య బందీని చేశారు" అని ఆమె అన్నారు. ఇంత నీచమైన రాజకీయాలు, కుతంత్రాలు ఇంతకు ముందెన్నడూ ఎరగనివని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
.
నాటి తన పరిపాలనను మళ్లీ అందిస్తానని చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని షర్మిల ఎద్దేవా చేశారు. రాజశేఖర్ రెడ్డిగారి పథకాలనే తానూ అమలు చేస్తానని చెప్పుకుంటున్నారని ఆమె ఎగతాళి చేశారు. రాజశేఖర్ రెడ్డిగారిలాగే తానూ రుణమాఫీ చేస్తాననీ, ఉచిత విద్యుత్తు ఇస్తాననీ, ఫీజుల పథకం అమలు చేస్తాననీ, ఆరోగ్యశ్రీ ఇస్తాననీ చంద్రబాబు చెప్పుకుంటున్నారని షర్మిల అవహేళన చేశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఇప్పుడు మళ్లీ ఒక సారి అవకాశం ఇమ్మంటూ కోరుతున్నారని ఆమె దుయ్యబట్టారు. రాజశేఖర్ రెడ్డిగారిని రోజూ తిట్టిపోసే బాబు అదే రాజశేఖర్ రెడ్డిగారి పథకాలనే అమలు చేస్తామంటు న్నారని షర్మిల ఎత్తిపొడిచారు. నిస్సిగ్గుగా మళ్లీ పాదయాత్ర అంటూ డ్రామా చేస్తున్నారని ఆమె చంద్రబాబు తీరును దుయ్యబట్టారు. అసలు పాదయాత్ర చేసే అవసరం చంద్రబాబునాయుడుగారికి లేనేలేదనీ, తనకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో అసెంబ్లీలో 'అవిశ్వాస తీర్మానం' పెట్టి ఈ ప్రజాకంటక ప్రభుత్వాన్ని గద్దె దింపవచ్చనీ ఆమె అన్నారు. కానీ బాబు ఆ పని చేయడం లేదని ఆమె విమర్శించారు.
రాజశేఖర్ రెడ్డిగారు అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేసే హంద్రీ-నీవా ప్రాజెక్టును తలపెట్టి ఐదేళ్లలో వేగంగా 95 శాతం నిర్మాణం పూర్తి చేశారని ఆమె గుర్తు చేశారు. మూడేళ్లలో మిగిలిపోయిన 5 శాతం పనిని కూడా ఈ ప్రభుత్వం చేయలేక పోయిందన్నారు. ఒక్క గంప మట్టి కూడా ఎత్తలేదన్నారు. రాజశేఖర్ రెడ్డిగారి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం వైయస్ రూపకల్పన చేసిన ప్రతి పథకానికీ తూట్లు పొడచి తుంగలో తొక్కుతోందని ఆమె విమర్శించారు. చార్జీలను వేటినీ పెంచనని చెప్పిన వైయస్ ఆర్టీసీ, కరెంటు చార్జీలను గ్యాస్‌ధరను ఎప్పుడూ పెంచలేదని షర్మిల గుర్తు చేశారు.
"మాకు ప్రజలు వినతి పత్రాలు ఇస్తుంటే దాంతో ఏం లాభమని ముఖ్యమంత్రి అంటున్నారు. ముఖ్యమంత్రిగారూ! రాజశేఖర్ రెడ్డిగారు చెప్పుకోలేరని తెలిసి కూడా కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. కానీ మూడేళ్లు గడచిపోయినా నేటికీ వైయస్‌ను ప్రజలు గుర్తు పెట్టుకుంటున్నారు. అదీ రాజశేఖర్ రెడ్డిగారి విశ్వసనీయత. జగనన్నను అన్యాయంగా జైలు పాలు చేసి దోషి అంటూ ముద్ర వేయాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు కిరణ్ కుమార్ రెడ్డిగారు మాకు వద్దు, చంద్రబాబునాయుడుగారు మాకు వద్దు, మాకు రాజన్న కొడుకే కావాలి, మాకు జగనన్నే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అదీ జగనన్న విశ్వసనీయత. మీకు విశ్వసనీయత లేదు కనుక మీకు అర్జీలు ఇచ్చుకున్నా అవి ఈ జన్మలో నెరవేరతాయన్న నమ్మకం వారికి లేదు కనుక, మేము వెళ్లినప్పుడు అర్జీలిస్తే కనీసం మేము అధికారంలోకి వచ్చినప్పుడైనా వాటిని పూర్తి చేస్తామన్న నమ్మకం వారికి ఉంది కనుక మాకు వినతిపత్రాలు ఇస్తున్నారు. కేవలం అధికారం ఉంటే సరిపోదు, ముఖ్యమంత్రిగారూ! చిత్తశుద్ధి ఉండాలి. విశ్వసనీయత ఉండాలి. జగనన్న రైతులు, విద్యార్థులు, చేనేతల కోసం పోరాడినందునే కుమ్మక్కై కుట్రలు పన్ని జైలుకు పంపారని షర్మిల ముఖ్యమంత్రి సంగారెడ్డి సభ వ్యాఖ్యలకు మరోసారి సమాధానం చెప్పారు. వజ్రకరూరుసభకు పెద్దయెత్తున జనం హాజరయ్యారు. ఈ సభతో షర్మిల 19 వ రోజు పాదయాత్ర ముగిసింది.

Back to Top