'బాబుకు జెయింట్‌ కాంగ్రెస్‌ దెబ్బ రుచి చూపిస్తాం'

విశాఖపట్నం, 2 డిసెంబర్‌ 2012: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అంటే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి గుండెదడ పట్టుకుందని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ‌వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని పిల్ల కాంగ్రె‌స్ అని విమర్శిస్తున్న చంద్రబాబు తమ పార్టీ జెయింట్ దెబ్బ‌ను 2014 ఎన్నికల్లో రుచిచూపిస్తామన్నారు. పిల్ల కాంగ్రెస్‌ అని విమర్శిస్తున్న వైయస్‌ఆర్‌ సిపి దెబ్బకే కదా చంద్రబాబు హెలికాప్టర్లు వదిలేసి పాదయాత్ర మొదలు పెట్టారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో వైయస్‌ఆర్‌సిపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అంబటి మీడియాతో మాట్లాడారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్ మరణంపై ఇప్పటికీ ఎన్నో సందేహాలున్నాయని‌ అంబటి తెలిపారు. హెలికాఫ్టర్ ప్రమాదంపై త్యాగి ఇచ్చిన నివేదిక‌లో లొసుగులున్నాయని ఆయన చెప్పారు.‌ వైయస్‌ఆర్‌ మరణంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపడానికి ఎందుకు వెనకాడుతున్నారని ప్రభుత్వాన్ని రాంబాబు ప్రశ్నించారు.

అసలు చంద్రబాబు ఎక్కడి నుంచి వచ్చారని అంబటి ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో పుట్టి, కాంగ్రెస్‌లో పెరిగారని, అదే పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా చంద్రబాబు పనిచేశారని, ఆ మంత్రి పదవిని చూసే కదా చంద్రబాబుకు ఎన్టీఆర్‌ పిల్లనిచ్చి పెళ్ళి చేశారన్న విషయాన్ని అంబటి గుర్తుచేశారు. అలాంటి మామను ముంచిన చంద్రబాబు తన గతాన్ని మరిచిపోయినట్లున్నారని అంబటి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను, పిల్ల కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు ఎక్కడ ఉన్నదని అంబటి నిలదీశారు. 
Back to Top