<strong>హైదరాబాద్, 2 మార్చి 2013:</strong> టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సిఎం కిరణ్ కుమార్‌రెడ్డి మధ్య 'అవిశ్వాస అవగాహన' కుదిరినట్లు ఉందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. అందుకే చంద్రబాబు అవిశ్వాసం పెట్టడానికి సిద్ధం అవుతున్నట్లున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాలలో విఫలమైందని అంటున్న చంద్రబాబు ఈ సారి తప్పకుండా వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెడతారని నమ్ముతున్నామన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు.<br/>రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతానని చంద్రబాబు నాయుడు, దాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధం అని కిరణ్ కుమార్‌రెడ్డి కూడా అంటున్నారని, ఇద్దరూ ఒకే సారి ఈ మాటలు చెప్పడంతో తన వ్యాఖ్యలకు బలం చేకూరుస్తోందన్నారు. సిఎం కిరణ్ కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో చీకట్లు కమ్ముకున్నాయని మేకపాటి ఆరోపించారు. విద్యుత్ కోతల కారణంగా పరీక్షలు రాయాల్సిన సమయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులు కూడా అవస్థలు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రజలను ఈ ప్రభుత్వం అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. ఇది చాలా శోచనీయం అన్నారు. హైడల్ పవర్ మన చేతిలో లేకపోయినా, థర్మల్ పవర్‌నైనా సక్రమంగా చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మంచిది కదా అని మేకపాటి వ్యాఖ్యానించారు.<br/>అవినీతిపై చంద్రబాబు నాయుడు పదే పదే మాట్లాడుతుండడాన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారని మేకపాటి ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు మేకపాటి బదులిచ్చారు. ఎంత మొత్తుకున్నా ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు నాయుడు విశ్వసనీయత కోల్పోయారన్నది అందరికీ తెలిసిందే అన్నారు. అవస్థలు పడి చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని, ప్రజలను ఒప్పించాలని చూస్తున్నారని, ఆయన ప్రయత్నం ఫలితాన్నిచ్చే అవకాశం లేదన్నారు.