<strong>అవనిగడ్డ (కృష్ణాజిల్లా) :</strong> దేశంలోని చిల్లర వర్తకరంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పై రాజ్యసభలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఓటింగ్‌కు టిడిపి ఎందుకు గైర్హాజరైందో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని మాజీ కేంద్ర మంత్రి, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారంనాడు అవనిగడ్డ వచ్చిన ఆయన వైయస్‌ఆర్ సిపి నాయకుడు సింహాద్రి రమేష్‌బాబు ఇంటిలో కాసేపు మీడియాతో మాట్లాడారు.<br/>కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టే బాధ్యతను భుజాన వేసుకున్న చంద్రబాబు తన పార్టీ రాజ్యసభ సభ్యులను ఓటింగ్‌కు పంపలేదని ఉమ్మారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్న చంద్రబాబు స్వప్రయోజనాలను కాపాడుకోవడానికి కేంద్రానికే బాసటగా నిలిచారన్నారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో వైయస్‌ఆర్‌సిపి కలిసిపోతుందని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మనుగడకు కొమ్ము కాస్తున్నది చంద్రబాబే అన్న విషయం సామాన్యులకు సైతం అర్ధమయిందన్నారు. ఎఫ్‌డిఐలపై జరిగిన ఓటింగ్ సమయంలో టిడిపికి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు సభకు గైర్హాజరవడం కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమే అన్నారు.<br/>చంద్రబాబు ఆశీస్సులతోనే తాము ఎఫ్‌డిఐలపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌లో పాల్గొనలేదని టిడిపి సభ్యులు స్పష్టం చేశారని, అయినా వారి నుంచి సంజాయిషీ కోరతానని చంద్రబాబు ప్రకటించటం విడ్డూరంగా ఉందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. గతంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైలులో కలిసిన వెంటనే కొడాలి నానిని, విజయవాడలో మర్యాద పూర్వకంగా కలిసిన వల్లభనేని వంశీమోహన్‌ను సస్పెండ్ చేసిన చంద్రబాబు... ఓటింగ్‌కు గైర్హాజరయిన ముగ్గురు రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయకుండా వారి నుంచి సంజాయిషీ కోరడం విడ్డూరం కాక మరేమిటి అన్నారు.