అవిశ్వాసం పెడితే వైయస్‌ఆర్‌సిపి పూర్తి మద్దతు

బుచ్చిరెడ్డిపాలెం (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు), 30 అక్టోబర్‌ 2012: అసమర్ధ, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వంపై‌ టిడిపి అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయడు అవిశ్వాసం పెడితే వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు పూర్తి మద్దతు ఇస్తారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు దమ్ముంటే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని సవాల్‌ చేశారు. అవిశ్వాసం అన్న ఊసే లేకుండా ఈ రాష్ట్ర ప్రజలను ఇంకా మభ్యపెట్టేందుకే చంద్రబాబు పాదయాత్ర నెపంతో వస్తున్నారని ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు తోడుదొంగలని ప్రసన్న ఎద్దేవా చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఎదగ‌నీయకుండా చేయడమే లక్ష్యంగా వారిద్దరూ పెట్టుకున్నారని విమర్శించారు. జగన్మోహన్‌రెడ్డి జైలు నుంచి బయటకు వస్తే తమ పార్టీలు దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందన్న భయంతో ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రమూ నమ్మే స్థితి లేదన్నారు.
Back to Top