అసెంబ్లీ తీరుపై వైయస్‌ఆర్‌ సిపి ఆవేదన

హైదరాబాద్, 22 సెప్టెంబర్, 2012: రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై శాసనసభ చర్చించనందుకు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలను క్షమాపణ కోరారు. ‌ఐదు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పట్టుమని ఐదు నిమిషాలు కూడా ప్రజా సమస్యలపై చర్చ జరగలేదని పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాసులు మండిపడ్డారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు శనివారంనాడు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం వారిద్దరూ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. సభను ఏమాత్రం జరగకుండా ప్రభుత్వం, ప్రతిపక్షం ఏకమైపోయి కుట్ర పన్నాయని వారు ఆరోపించారు.‌ ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రభుత్వానికి స్పీకర్ అనుకూలంగా వ్యవహరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపైన, ప్రతిపక్షంపైన ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
ఐదు రోజుల పాటు కొనసాగిన శాసనసభ సమావేశాల్లో ఏ అంశంపైన కూడా నామమాత్రపు చర్చ అయినా జరగలేదు. సభలో ఎలాంటి బిల్లులనూ ప్రవేశపెట్టలేదు. కేవలం వాయిదాలకే పరిమితమైన సభలో మాట్లాడే అవకాశం లేకపోవటంతో ప్రతిపక్ష పార్టీల సభ్యులంతా మీడియా పాయింట్ వద్ద క్యూ కట్టారు.
Back to Top