అసత్యాల బాబును జనం నమ్మరు: మేకపాటి

- బాబు హయాంలో ఏ వర్గానికైనా మేలు జరిగిందా? 
- దివంగత వైయస్ హయాంలోనే మైనారిటీలకు మేలు 
- వై‌యస్‌ లేని లోటును జగన్ భర్తీచేస్తారని విశ్వసిస్తున్నాం 
- వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్‌లో చేరిన కదిరి మైనారిటీ నాయకులు

హైదరాబాద్, ‌2 అక్టోబర్‌ 2012: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిలువెల్లా అసత్యాలే అని, అలాంటి అబద్ధాలకోరును ప్రజలు నమ్మబోరని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. అసలు అలాంటి వారు ప్రజానాయకులే కాబోరని ఆయన దుయ్యబట్టారు.

అనంతపురం జిల్లా కదిరికి చెందిన ముస్లిం మైనారిటీలు, ఇతర నాయకులు సోమవారంనాడు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీలో చేరిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మేకపాటి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన హయాంలో ఏ వర్గానికైనా ఏమైనా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ముస్లింలకు మేలు జరిగింది ఒక్క మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడేనని పేర్కొన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి వైయస్ ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందన్నారు. ‌మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ ముస్లింలు కాంగ్రెస్‌నే నమ్ముకుని ఉన్నా ఆ పార్టీ వారికేమీ చేయలేదని, రాష్ట్రంలో వైయస్ ముఖ్యమంత్రి అయ్యాకే వారి సంక్షేమానికి చర్యలు తీసుకున్నారని చెప్పారు.
వైయస్ లేని లోటు ఆయన కుమారుడు వై‌యస్‌ జగన్మోహన్‌రెడ్డి వల్ల పూడుతుందని తాను విశ్వసిస్తున్నానని రాజమోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అందుకే తాను జగన్‌ను అనుసరిస్తున్నానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, ప్రధాని కుమారులైనంత మాత్రాన ఎవరికీ నాయకత్వ లక్షణాలు రావని, కానీ జగన్‌కు మాత్రం పుష్కలంగా నాయకత్వ లక్షణాలున్నాయని అన్నారు.

వైయస్‌ఆర్ కాంగ్రెస్‌‌ పార్టీకి లభిస్తున్న ఆదరణను చూసి చాలా మంది ఇతర పార్టీల్లోని ఎమ్మెల్యేలు, మంత్రులు చేరటానికి సిద్ధమవుతున్నారని, అయితే వారి స్థానాలు ఇప్పటికే భర్తీ అయ్యాయి కనుక వారిక అవకాశం కోల్పోయినట్లేనని మేకపాటి వ్యాఖ్యానించారు.

రాష్ట్ర పార్టీ మైనారిటీ విభాగం కన్వీనర్ హె‌చ్.ఎ.రెహ్మా‌న్ మాట్లాడుతూ‌, ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైయస్‌దే అన్నారు. గతంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రీ ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసి ముస్లింలు తమ రుణం తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ప్రకటించిన మైనారిటీ డిక్లరేషన్ పూర్తి మోసపూరితమని‌, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎందుకు వాటిని అమలు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు.

అనంతపురం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ విభాగం మాజీ కన్వీనర్ ఎ‌న్.ఆరీ‌ఫ్ అలీ (కదిరి) తన అనుచరులతో కలిసి మేకపాటి సమక్షంలో‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అ‌డ్‌హాక్ కమిటీ కన్వీనర్ శంక‌ర్‌నారాయణ అధ్యక్షత వహించారు.
Back to Top