అసత్య ఆరోపణలు మానండి: శోభా నాగిరెడ్డి

కర్నూలు:

వైయస్ జగన్ సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు పార్టీ మారుతున్నారన్న భయంతోనే యనమల ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కర్నూలులో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. బాబు రాసిచ్చిన స్క్రిప్టు చదివి ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దని యనమలకు హితవు పలికారు. ములాఖత్ లలో తెలుగు దేశం నాయకులు జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీ మారిపోతారని భయపడుతున్నారన్నారు. భయముంటే మీ నాయకుల్ని ఆఫీసులో పెట్టి తాళం వేసుకోవాలి తప్ప.. ఇలాంటి ఆరోపణలు చేయడం తగదన్నారు. జగన్ సెల్‌ఫోన్ ఉపయోగించడం లేదని తాను బిడ్డల మీద ప్రమాణం చేస్తానని ఆయన సతీమణి భారతి విసిరిన సవాలును స్వీకరించాలనీ లేదా మాట్లాడకుండా ఉండాలనీ  శోభ కోరారు.  మరో ప్రజాప్రస్థానం పేరిట మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర తలపెట్టిన షర్మిల నవంబరు ఆరున కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తారని వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు భూమా నాగిరెడ్డి చెప్పారు. షర్మిల యాత్ర చారిత్రక అవసరమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప కూడా పాల్గొన్నారు.

Back to Top