అసలు వీళ్లు మనుషులేనా?

హైదరాబాద్ 21 నవంబర్ 2012 : దివంగత మహానేత వైయస్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చినా కిమ్మననివారు అసలు మనుషులేనా? అని షర్మిల ప్రశ్నించారు. "రాజశేఖర్ రెడ్డిగారు ఇచ్చిన పదవులు అనుభవిస్తూ కూడా వారు వేడుక చూసినట్టు చూశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా పార్టీని నిలదీయలేదు. అందరికీ వారి పదవులే ముఖ్యమైపోయాయి." అని ఆమె విమర్శించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా కర్నూలు ఓల్డ్ బస్‌స్టాండ్ వద్ద బుధవారం జరిగిన ఒక భారీ బహిరంగసభలో ఆమె ప్రసంగించారు.
"వీరికే కనుక నిజాయితీ ఉంటే రాజశేఖర్ రెడ్డిగారి పేరును ఎఫ్ఐఆర్‌లో పెడితే ఊరుకుంటారా? రాజశేఖర్ రెడ్డిగారు బ్రతికుంటే కూడా వీళ్లు జైల్లో పెట్టి వుండేవారు. రాజశేఖర్ రెడ్డిగారిని జైల్లో పెట్టినా కూడా ఈ పదవులు అనుభవించేవాళ్లకు చలనం ఉండేది కాదు. కేవలం పదవీదాహంతో వీళ్లు రాజశేఖర్ రెడ్డిగారికి వెన్నుపోటు పొడిచినట్లు కాదా?" అని షర్మిల నిలదీశారు. అభిమానం అన్నది పెదాలకు మటుకే పరిమితమైతే అది అభిమానమనిపించుకోదన్నారు.
"ముఖ్యమంత్రిగారు ఈ రోజు ఆ కుర్చీలో కూర్చున్నారంటే, సోనియా కంటికి ఆయన కనిపించారూ అంటే అది రాజశేఖర్ రెడ్డిగారి చలువ కాదా? రాజశేఖర్ రెడ్డిగారు కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకర్‌గా చేయకపోయి ఉంటే ఈయన సోనియాగాంధీ కంటికి అసలు కనిపించేవారే కాదు. రాజశేఖర్ రెడ్డిగారు రెక్కల కష్టం మీద రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నదంటే అది రాజశేఖర్ రెడ్డిగారి పుణ్యం కాదా అని అడుగుతున్నాం. అలాంటిది ఆ మహానేత పేరుని, ఎంత పెద్ద మనసున్నవాడో తెలిసి కూడా ఆయన పేరుని ఎఫ్ఐఆర్‌లో చేర్చారే ! అసలు మీరు మనుషులేనా అని అడుగుతున్నాం." అని షర్మిల ప్రశ్నించారు.
పథకాలకు తూట్లు...
ముఖ్యమంత్రిగా ఉండిన రోశయ్య, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిగారి పథకాలకు తూట్లు పొడిచారన్నారు.
కర్నూలు వరదలు రావడానికి ప్రకృతి కారణం కాదన్నారు. ఇరవై అడుగుల మేరకు నీళ్లు వచ్చి వేలమంది లక్షల్లో ఆస్తులు కోల్పోయారంటే అది కాంగ్రెస్ పార్టీ తప్పు కాదా? అని ఆమె ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డిగారున్నప్పుడు ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లున్నాయో, ఏ ప్రాజెక్టు నుండి  నీళ్లు వదిలేయాలో, ఏ ప్రాజెక్టుకు ముప్పు ఉందో చేతి లెక్కలతోనే చెప్పేవారన్నారు. "కేవలం వీళ్లకి అనుభవం లేకపోవడం వల్ల, నిర్లక్ష్యం వల్ల కర్నూలు ఆ రోజు మునిగిపోయింది." అని ఆమె విమర్శించారు. "ఈ రోజు వరకు కూడా ఆ ఫ్లడ్‌వాల్ నిర్మించనే లేదు వీళ్లు" అని ఆమె నిందించారు.
"ఇక్కడ ప్రధానంగా తాగునీరు సమస్య ఉందని విన్నాం. కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వని ప్రభుత్వమూ ఒక ప్రభుత్వమేనా? ఈ ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత?" అని షర్మిల వ్యాఖ్యానించారు.
కరెంటు సంక్షోభానికి కిరణ్ కారణం...
"కిరణ్ కుమార్ రెడ్డి వల్ల ఈ రోజు రాష్ట్రంలో తీవ్రమైన కరెంటు సంక్షోభం ఉంది. రాజశేఖర్ రెడ్డిగారున్నప్పుడు ఎప్పుడూ కరెంటుకు సంక్షోభం లేదు. పైగా ఏడుగంటల ఉచిత విద్యుత్తు కూడా ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డిగారు బ్రతికుంటే ఈ  రోజు కూడా తొమ్మది గంటల కరెంటు వచ్చి ఉండేది.ఎక్కడ ఎంత కరెంటు అవసరమో ఆలోచించి ఎంతో చిత్తశుద్ధిగా ఏర్పాటు చేసేవారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డిగారి నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు విద్యుత్తు సంక్షోభం ఏర్పడింది. పైగా ముఖ్యమంత్రి కిటికీలు, తలుపులు తెరుచుకుని పడుకోమంటున్నారు. ఆయన, ఆయన మంత్రులు ఏసీల్లో ఉంటారట. ఆయన మాటల్ని బట్టే ఆయన ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారో తెలుస్తోంది." అని షర్మిల విమర్శించారు.
"ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు తెస్తానన్న ముఖ్యమంత్రి 60 కోట్లు కూడా తేలేదు. అదేమోగానీ కరెంటు సంక్షోభం వల్ల ఉన్న పరిశ్రమలూ మూతబడి లక్షల మంది రోడ్డు మీద పడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిగారు 15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అందులో పది శాతం కూడా చేయలేదు. దేశమంతా కలిపి 45 లక్షల ఇళ్లు కట్టిస్తే, రాజశేఖర్ రెడ్డిగారు ఒక్క మన రాష్ట్రంలోనే 45 లక్షల ఇళ్లు కట్టించారు. ఈ ప్రభుత్వం ఏడాదికి ఆరులక్షల ఇళ్లు కడతామంది కాని, వైయస్ హయాంలో మంజూరైన ఇళ్లకు కూడా ఇంతదాకా బిల్లులు ఇవ్వలేదు. చంద్రబాబుకు మాత్రమే అబద్ధాలాడడం చేతనౌతుందనుకున్నాం. కిరణ్ కుమార్ రెడ్డిగారికి అంతకంటే బాగా చేతనవును" అని షర్మిల ఎద్దేవా చేశారు.
మహా నటుడు చంద్రబాబు!
"సొంత పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్టీఆర్‌ని పిచ్చివాడన్నాడు. చెప్పులు వేయించాడు. ఎన్టీఆర్ వల్ల ఆయనకు ప్రాణహాని ఉందని కూడా కేసు పెట్టాడు. ఎన్టీఆర్ విడుదల చేసిన ఒక క్యాసెట్లో, చంద్రబాబు తన కంటే మంచి నటుడన్నారు. ఎనిమిది సంవత్సరాల్లో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచారు చంద్రబాబు. కరువుంది కట్టలేమంటే స్పెషల్ పోలీసులను, స్పెషల్ కోర్టులు పెట్టి కేసులు పెట్టి వేధించారు. ఆందోళన జరిగి పోలీసు కాల్పులలో కొందరు చనిపోతే చంద్రబాబు పరామర్శించింది పోలీసులను. చంద్రబాబు హయాంలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రపంచంలో ఇంకెక్కడా ఇలా జరుగలేదు." అని షర్మిల వ్యాఖ్యానించారు.

Back to Top