ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా మనం: షర్మిల

విశాఖపట్టణం 05 జూలై 2013:

దోషులు వందమంది తప్పించుకున్నప్పటికీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని న్యాయ శాస్త్రం చెబుతోందని శ్రీమతి వైయస్ షర్మిల చెప్పారు. మరి రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ఇది న్యాయమా ధర్మమా అని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డిగారికి హక్కులు లేవా? 90రోజుల రిమాండ్ తర్వాత బెయిలు ఇవ్వాలని చట్టం చెబుతుంటే ఆయనకు ఇది ఎందుకు వర్తించడం లేదని అడిగారు. గాంధీజీని అబద్ధపు ఆరోపణలతో నిర్బంధించిన బ్రిటిష్ ఇండియాలో ఉన్నామా.. నెల్సన్ మండేలాను రాజకీయ ఆరోపణలతో ఖైదు చేసిన దక్షిణాఫ్రికాను అనుసరించడం లేదా. . అంగ్ సాంగ్ సూకీకి ప్రజలలో ఉన్న అభిమానాన్ని వారికి దూరం చేసేందుకు ప్రయత్నించిన పాలనలో లేమా... ఏం జరుగుతోంది మన దేశంలో.. రాజకీయ వేధింపుల కోసం చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్నీ ఎలా పడితే అలా అపహాస్యం చేయొచ్చని ప్రపంచానికి మనం చాటి చెప్పడం లేదా.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న భారత దేశంలో ఇంకా న్యాయానికీ, ధర్మానికీ, ప్రజాభిప్రాయనికీ విలువలున్నాయా? అంటూ ఆమె ఆవేశంగా ప్రశ్నించారు. నేర నిరూపణ కాకుండా ఒక మనిషిని ఏడాది పాటు జైలులో పెట్టచ్చని ఏ చట్టం చెబుతోందన్నారు. నిర్దోషి అని రుజువైతే ఈ ఏడాది కాలం ఎలా తిరిగిస్తారని ఆమె ప్రశ్నించారు.

మరో ప్రజా ప్రస్థానం ప్రారంభమై 200 రోజులు, వంద నియోజకవర్గాలు పూర్తయిన సందర్భంగా విశాఖపట్టణంలోని ఆర్.కె. బీచ్‌లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె ఆవేదనా భరిత ప్రసంగాన్ని చేశారు. దేశంలో సాగుతున్న కుట్రలను ఎత్తిచూపారు. పాలక, ప్రతిపక్షాల కుమ్మక్కును తూర్పారబట్టారు.
సీబీఐ సాక్షులను ప్రభావితం చేస్తారనే అభియోగంతో జగనన్న జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారన్న ఇంగితం కూడా లేకుండా ఆయన దోషి అని విమర్శిస్తున్న ఈ నీతిమాలిన రాజకీయ నాయకులకు 'జగన్మోహన్ రెడ్డి దోషి అని ఏ న్యాయస్థానమూ చెప్పలేదని' మళ్ళీ చెబుతున్నామని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. చంద్రబాబు ఎమ్మార్, ఐఎమ్‌జీ లాంటి కేసులలో నిర్దోషి అని ఏ కోర్టూ చెప్పలేదన్నారు. చిరంజీవి బంధువుల ఇంట్లో దొరికిన 70 కోట్ల రూపాయలు సక్రమమేనని ఏ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. బొత్స సత్యనారాయణ మాఫియా డాన్ కాదనీ, ఉత్తముడనీ ఏ కోర్టూ చెప్పలేదన్నారు. ఈ వ్యాఖ్య చేసినప్పుడు విశాఖ సాగరతీరం జనహర్షాతిరేకంతో హోరెత్తింది. వీరికున్న చావు, నక్కజిత్తుల తెలివితేటలతో తమపై విచారణ జరగకుండా ఈ నాయకులంతా చూసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని చేసి, వేయి కుట్రలు పన్ని, వ్యవస్థల్ని వాడుకుని తొక్కేయాలనుకుంటున్నారన్నారు. అయినప్పటికీ జగనన్న గుండె నిబ్బరం ఏమాత్రం చెక్కుచెదరలేదని స్పష్టంచేశారు. జైల్లో పెట్టినా కూడా ప్రజల గురించే ఆయన ఆలోచిస్తున్నారన్నారు. ప్రజల సమస్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందించాలనే దానిపై దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు. ప్రజల పక్షాన ఎలా పోరాడాలనే దానిపై చెబుతూనే ఉన్నారనీ, జగన్మోహన్ రెడ్డిగారి ప్రత్యేకత ఇదని ఆమె హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. కారు చీకటిలో ఉన్నా జగన్మోహన్ రెడ్డిగారు కాంతి కిరణమేనన్నారు. జైలులో ఉన్నప్పటికీ  ఆయన తిరుగులేని జననేతేనని పేర్కొన్నారు. బోనులో ఉన్నా సింహం సింహమేనన్నారు. ఆయన్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్మూ ధైర్యమూ ఈ కాంగ్రెస్, టీడీపీలకు లేవని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు.

అందుకే ఈ నీచమైన కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. వీళ్ళ పాపాలన్నింటినీ దేవుడు గమనిస్తున్నాడనీ, అవి పండిన నాడు ఆ పుట్టలు పగిలి బయటకు వచ్చే విషసర్సాలను వేటాడే ఓటు అనే హక్కు వినియోగించుకునే తరుణం దగ్గరలోనే ఉందని చెప్పారు. ఆరోజు వచ్చేంతవరకూ మీరంతా జగనన్నను ఆశీర్వదించాలనీ, మాతో కలిసి కదం తొక్కాలనీ ప్రార్థించారు. రాబోయే రాజన్న రాజ్యంలో ముఖ్యమంత్రయిన తర్వాత రాజన్న ప్రతి కలను జగనన్న నెరవేరుస్తాడని శ్రీమతి షర్మిల ప్రకటించారు. రాజన్న ఇచ్చిన ప్రతి మాటను నిలబెడతాడని తెలిపారు.

ప్రతి ఎకరాకు నీరివ్వాలనీ, మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు పెద్ద చదువులు చదువుకోవాలనీ, పెద్ద ఉద్యోగాలు చేయాలనీ, ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు ఉండాలనీ కన్న రాజన్న కలలను జగనన్న తప్పకుండా నిలబెడతారని చెప్పారు. వైయస్ఆర్ అమ్మ ఒడి పథకం ద్వారా అక్కచెల్లెళ్లు వారి బిడ్డలను చదివించుకోవడం కోసం ఇద్దరు బిడ్డలకు పదో తరగతి వరకూ నెలకు 500రూపాయలు నేరుగా అమ్మబ్యాంకు ఖాతాలో జమవుతాయన్నారు. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే వెయ్యి రూపాయలు అకౌంట్లో పడతాయన్నారు. పింఛన్లు వృద్ధులు వితంతువులకు 700, వికలాంగులకు వెయ్యి రూపాయలు అవుతాయని చెప్పారు. రాబోయే రాజన్న రాజ్యం సువర్ణ యుగాన్ని తలపిస్తుందన్నారు.  త్వరలో స్థానిక ఎన్నికలు, తదుపరి సాధారణ ఎన్నికలు రానున్నాయనీ, వాటిలో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పాలనీ విజ్ఙప్తిచేశారు. జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం సాధ్యమవుతుందన్నారు. జగనన్నకు వేసే ప్రతి ఓటూ జగనన్న నిర్దోషని ప్రజలు నమ్ముతున్న విషయాన్ని చాటి చెబుతుందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు జగనన్న జైలునుంచి బయటకు రావడానికి బాటలు వేస్తుందన్నారు.

 'ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ వైఫల్యాలను, దానికి మద్దతు ఇస్తున్న చంద్రబాబు వైఖరిని ఎండగట్టడానికి ఇడుపుల పాయలో మొదలైన మరో ప్రజా ప్రస్థానం 200  రోజులు పూర్తయ్యింది. ప్రజలనుంచి వెల్లువెత్తిన అభిమానమే మమ్మల్ని నడిపించింది.' అంటూ శ్రీమతి షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
'అద్భుతమైన పథకాలతో రాజన్న రాష్ట్రాన్ని పరిపాలించారు. జలయజ్ఙంతో ప్రతి ఎకరాకూ నీరివ్వాలనుకున్నారు. రైతన్న ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారు. రైతుల్ని 12000 కోట్ల మేరకు రుణ విముక్తుల్ని చేశారు. అంతకు ముందు చంద్రబాబు రూపాయి వడ్డీకి రుణాలిచ్చేవారు. రాజన్న పావలా వడ్డీకే ఇచ్చారు. విద్యార్థులకు తండ్రిలా ఆలోచించారు. ఫీజు రీయింబర్సుమెంటుతో భరోసా కల్పించారు. మన రాష్ట్రంలో ఉచితంగా లక్షలాదిమంది చదువుకునే అవకాశాన్నిచ్చారు. పేదవాడు వైద్యానికి కార్పొరేటు ఆస్పత్రికి వెళ్లేలా చేశారు. మనసున్న వైద్యునిగా ఆరోగ్యశ్రీ పెట్టారు. 108 అంబులెన్ను ఫోను చేసిన 20 నిముషాల్లో వచ్చేది. అన్ని పథకాలూ అద్భుతంగా చేశారు. 47 లక్షల పక్కా ఇళ్ళుకట్టారు. 71 లక్షలమందికి పింఛన్లిచ్చారు. ఏ రోజూ ఏ చార్జీ పెంచలేదు. చార్జీలు పెంచితే పేదవాడిపై భారం పడుతుందని ఆయన భావించడమే దీనికి కారణం. రాజన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్యాస్ సిలిండరు ధర 305 నుంచి రూపాయి కూడా పెరగలేదు. ఆర్టీసీ, మున్సిపల్ పన్నులు పెరగలేదు. చార్జీలు పెంచకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేసిన రికార్డు సీఎంగా నిలిచారు.' అని ఆమె వివరించారు.

ప్రజలను ప్రేమించిన వ్యక్తి వైయస్‌ఆర్‌. రైతు ప్రతి అవసరాన్ని గుర్తించి ఆదుకున్నదీ ఆయనే. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని ఉచితంగా అందించిన ఘనత వైయస్‌ఆర్‌దే. ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలని ఆయన తపించారన్నారు. విద్యార్థులను ఆయన ఒక కన్న తండ్రి స్థానంలో ఉండి ఆలోచించారని, ప్రతి విద్యార్థినీ ఉచితంగా ఉన్నత చదువులు చదివించారని గుర్తుచేశారు. రూ.12 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత రాజశేఖరరెడ్డిదే అన్నారు. చంద్రబాబు నాయుడు రైతులు, మహిళలకు రూపాయికి పైగా వడ్డీకి రుణాలు ఇచ్చేవారని, మహానేత వైయస్‌ సీఎం అయ్యాక కేవలం పావలా వడ్డీకే రుణాలు అందించారని పేర్కొన్నారు. దీనితో ఎందరో మహిళలు పావలా వడ్డీ రుణాలు తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించారని తెలిపారు. ఏ పథకాన్నయినా రాజశేఖరరెడ్డిగారు అద్భుతంగా అమలు చేసి చూపించారని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలమూ చార్జీలు, ధరలూ ఒక్క రూపాయి కూడా పెంచకుండానే పథకాలను అమలు చేసిన రికార్డు సిఎంగా నిలిచారని అన్నారు.
ఆదాయం, తెచ్చిన అప్పులు ఏమయ్యాయి.

మన రాష్ట్ర ప్రభుత్వానికి గత నాలుగేళ్ళలో 60వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చింది. అది కాకుండా 50 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది. ఎవరి సంక్షేమానికి ఖర్చు పెడుతున్నరు. ఇరిగేషన్ ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం నీరుగార్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టును ఎక్కడా చేపట్టడం లేదు. రైతుకి సాగు నీరివ్వడం లేదు. కరెంటు ఇవ్వడం లేదు. ధరలు పెరిగినా కావలసినంత మద్దతు దర ఇవ్వడం లేదు. పంటలు పోయి నష్టపోయామని ప్రతి గ్రామంలోనూ రైతులు చెబుతున్నారు. రైతులకు, మహిళలకు వడ్డీలేకుండా రుణాలిస్తామన్న హామీని కేవలం ప్రచారానికే వాడుకుంటున్నారు. కిరణ్ కుమార్ మాటలు కోటలు దాటతాయి కానీ, చేతలు గడప దాటడం లేదు. ఉన్న పరిశ్రమలు మూతపడి 20 లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు.  ఏ నెలలోనూ, ఏ ప్రాంతానికీ కరెంటు ఇవ్వడం లేదన్నారు. సమాధానం చెప్పమంటే కిటికీలు, తలుపులు తెరుచుకుని పడుకోండి అని చెబుతున్నారంటే కిరణ్ కుమార్ రెడ్డి ఇంగితం ఏపాటిదో చెప్పనక్కరలేదన్నారు. విద్యార్థులకు పదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలో చదవాలి, తదితర వంద ఆంక్షలు పెట్టి ఫీజు రీయింబర్సుమెంటు పథకం నుంచి తప్పించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ నుంచి ఇప్పటికే 133 రోగాలను, 47 ఆస్పత్రులను తీసేశారు. పక్కా ఇళ్ళ పథకానికి ఈ ప్రభుత్వం పాడె కట్టింది. రాజన్న హయాంలో మంజూరైన ఇళ్లకు కూడా ఈ కిరణ్ సర్కారు బిల్లులు చెల్లించలేదంటే సంక్షేమం ఎక్కడుంది. 30 కిలోల బియ్యం, 9 గంటల విద్యుత్తు హామీలను ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. వంట నూనె, కూరగాయ వరకూ అన్ని ధరలూ భగ్గుమంటున్నాయని  మహిళలు వాపోతున్నారు. ఒక్క రూపాయి పింఛను పెంచడం లేదంటున్నారు. ఉన్న పింఛన్లు కూడా తీసేస్తున్నారంటే... వీరిని పాలకులనాలా? రాక్షసులనాలా?

పుల్లయ్య వ్యవహారంలా కిరణ్ శైలి
కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రతి వారం ఢిల్లీ వెడతారు.. వస్తారు.. పుల్లయ్యా! వేమవరం వెళ్ళాలని ఓ ఆసామి అడిగితే ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా వేమవరం వెళ్ళి వచ్చాడట. మన కిరణ్ కుమార్ రెడ్డిగారిది కూడా ఇలాంటి వ్యవహారమే. అక్కడ ఎవరిని కలుస్తారో.. ఏమి చర్చిస్తారో.. మీడియా కళ్ళు గప్పి ఎక్కడికి మాయమై పోతారో ఎవరికీ తెలీదు. కానీ మన రాష్ట్రానికి మటుకు ప్రాజెక్టులకు నిదులు, కరెంటు తేరు.. రైతులకు సబ్సిడీ తేరు. ఇది ఆయన తీరు. పుల్లయ్య వ్యవహారంలా ఇది మన కిరణయ్య యవ్వారం. పన్నులు పెంచుతూ, కరెంటు చార్జీలు పెంచుతూ ఆమ్ ఆద్మీకి మళ్ళీ మళ్లీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ. అంటూ శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

ఈ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగులుతారన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి కుర్చీపై కన్ను తప్ప ఏనాడూ ప్రజల సమస్యలు పట్టలేదన్నారు. ఒక్క కేంద్ర మంత్రి పదవి కోసం చిరంజీవి తనకు ఓటేసిన 70 లక్షల మంది ప్రజలను పిచ్చోళ్ళను చేసి ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారన్నారు. తన మీద విచారణ జరగకుండా చంద్రబాబుకూడా టీడీపీని కాంగ్రెస్ పార్టీకి రాసిచ్చేశారన్నారు.

కాంగ్రెస్ పెరటిలో కుక్క సీబీఐ
విచారణ పూర్తికాకుండానే సీబీఐ దాఖలు చేసిన ప్రతి చార్జిషీటులో జగనన్న ఏ వన్ గానూ, సాయిరెడ్ది ఏ టూ గానూ ఉంటారని డైరెక్టరు ప్రకటించారన్నారు. దర్యాప్తు ప్రారంభం కాకుండానే ఇలా ప్రకటించిందంటే కేసును ఎలా నడిపించదలిచిందో ఆరోజే తేలిపోయిందన్నారు. సీబీఐ కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మనీ, కాంగ్రెస్ కోసమే పనిచేస్తుందనే విషయం బొగ్గు కుంభకోణం అంశంతో సహా  పలు కేసుల్లో ఇప్పటికే రుజువైందన్నారు. సీబీఐ కాంగ్రెస్ పంజరంలో చిలకనీ, కాంగ్రెస్ పెరట్లో కుక్కనీ, ఎవరి మీద మొరగమంటే వారిమీద మొరుగుతుందనీ, వద్దంటే వెనక్కి వచ్చి కూర్చోమంటే కూర్చుంటుందనీ స్టాలిన్ కేసులో రుజువైందన్నారు. సీబీఐ ఒక బ్లాక్ మెయిల్ సంస్థని ఆరోపించారు.

Back to Top