బాధ్యత లేని ప్రభుత్వం

* రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన
* నిజాలు దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది?
* ఏపీకి రెవెన్యూ ఎలా వచ్చింది..కేంద్రం ఎందుకు భర్తీ చేస్తుంది
* వైయస్‌ జగన్‌ వాదనను వెంకయ్యే ఏకీభవించారు
* ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు వైజాగ్‌లో బహిరంగ సభ
* నవంబర్‌ 6న తలపెట్టిన జై ఆంధ్ర ప్రదేశ్‌ సభను విజయవంతం చేయాలి
* వైయస్‌ఆర్‌సీపీ  ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు

విశాఖపట్నం: ఆంధ్ర రాష్ట్రంలో పాలన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సాగుతుందని, చంద్రబాబు ప్రభుత్వానికి బాధ్యత లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం, టీడీపీ సర్కార్‌ అక్రమాలు, అసత్య ప్రచారాలను ఎండగట్టేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన నవంబర్‌ 6న విశాఖపట్నంలో జై ఆంధ్ర ప్రదేశ్‌ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు శనివారం వైజాగ్‌లోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌తో కలిసి ధర్మాన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పాలన గాడీ తప్పిందన్నారు. టీyî పీ ప్రభుత్వం మెరుగైన ఫలితాలు ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల ముందు టీడీపీ చేసిన ఏ ఒక్క వాగ్ధానం కూడా అమలు కాలేదని విమర్శించారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదానే సంజీవిని అన్న చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు. హోదా కోసం రెండేళ్లుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వెల్లడిస్తామన్నారు.

వెంకయ్యే అంగీకరించారు
ప్రత్యేక హోదాపై ఇన్నాళ్లు వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెబుతున్న ప్రయోజనాలను నిన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా అంగీకరించారని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి పరిశ్రమల ఏర్పాటుకు 90 శాతం గ్రాంట్లు వస్తాయని కేంద్ర మంత్రి స్వయంగా చెప్పారన్నారు. అలాంటి ప్రయోజనాలు ఉన్న ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వబోమని ప్రకటిస్తే..చంద్రబాబు ఎందుకు అడగడం లేదని నిలదీశారు. ఒకవేళ ఏపీకిలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే కేంద్రం ఇస్తామంటున్న నిధుల్లో ఎంత కేటాయిస్తారని ప్రశ్నించారు. గతేడాది విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన సమ్మిట్‌లో రూ.4.70 లక్షల కోట్ల ఎంవోయూలకు సంతకాలు జరిగాయని చంద్రబాబు చెప్పారని, అయితే అవి ఎంత వరకు కార్యరూపం దాల్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికే 30 శాతం ఎంవోయూలు ఒప్పుకున్నారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల ప్రకటించారని, అయితే వచ్చే పరిశ్రమలను ఎక్కడ ఏర్పాటు చేస్తారు. అందులో వేటిని ఉత్పత్తి చేస్తారన్నది ఇంతవరకు స్పష్టత లేదన్నారు.

చట్టాన్ని సవరించే ప్రయత్నాలు
చంద్రబాబు ప్రభుత్వం చట్టాలను సవరించే ప్రయత్నాలు చేయడం దారుణమని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. రాజధాని నిర్మాణం పేరుతో టెండర్లు పిలిచామని, స్విస్‌ చాలెంజ్‌ పద్ధతిలో నిర్మిస్తున్నామని ఇన్నాళ్లు చెప్పి..ఇప్పుడు మళ్లీ ఉపసంహరించుకుంటున్నామని చట్టాలను సవరించే ప్రయత్నాలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. గతంలో రాజధాని నిర్మాణానికి రెండుసార్లు శంకుస్థాపన చేసిన చంద్రబాబు, మళ్లీ నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో భవన నిర్మాణాలకు ఫౌండేషన్‌ వేయించడం ఏంటని ప్రశ్నించారు.

కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 10.99 జీడీపీ సాధించిందని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని, ఇలాంటి సమయంలో రెవెన్యూ లోటు ఎలా వస్తుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు.  ఇంత పెద్ద ఎత్తున జీడీపీ సాధించిన రాష్ట్రానికి కేంద్రం ఏ రకంగా సాయం చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు.10.99 జీడీపీ సాధించిన రాష్ట్రం కనీసం 35 శాతం రెవెన్యూ సాధించాల్సి ఉండగా, కేవలం 13 శాతమే అని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. నిజాలు చెప్పకుండా చంద్రబాబు దాచిపెడుతూ తన్ను తాను మోసం చేసుకుంటూ..కేంద్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. మూడు నెలల్లోనే 12.5 శాతం రెవెన్యూ సాధించామని ప్రకటిస్తున్న ఏపీకి కేంద్రం రెÐð న్యూ లోటు ఎలా భర్తీ చేస్తుందన్నారు. చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చట్టబద్ధత కలిగిన అంశాలపై అడగకుండా అవగాహన లేని వ్యక్తులు మాట్లాడినట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. విశాఖను ఆర్థిక రాజధాని చేస్తామన్న చంద్రబాబు రెండున్నరేళ్లు అవుతున్నా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గతంలో హైదరాబాద్‌ నగరాన్ని మాత్రమే అభివృద్ధి చేయడంతో ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అదే పరిస్థితి నవ్యాంధ్ర రాజధానిలో కల్పిస్తున్నారని తప్పుపట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టాలని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. నవంబర్‌ 6న విశాఖ నగరంలోని ఇందిరా మున్సిపల్‌ స్టేడియంలో తలపెట్టిన జై ఆంధ్ర ప్రదేశ్‌ బహిరంగ సభను విజయవంతం చేయాలని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.
Back to Top