అప్పుల ఊబిలో అన్నదాత: షర్మిల ఆవేదన

షాద్‌నగర్‌ (పాలమూరు జిల్లా), 10 డిసెంబర్‌ 2012: దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయించి ఉండేవారని ఆ మహానేత తనయ శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. ప్రస్తుత పాలకులకు అన్నదాతల అవస్థలు పట్టడంలేదని ఆమె దుయ్యబట్టారు. రాజన్న పాలనలో రైతే రాజులా వెలిగిపోయాడని అభివర్ణించారు. మహిళలను ఆయన తన సొంత అక్కచెల్లెళ్ళలా చూసుకున్నారని తెలిపారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారంనాడు పాలమూరు జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని జెపి దర్గా నుంచి ప్రారంభమైంది. శ్రీమతి షర్మిల ప్రజాప్రస్థానంలో భాగంగా ఇన్ముల్‌నర్వలో రైతులు, మహిళలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, మహిళలు, ప్రత్యేకించి గిరిజన మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముందుగా స్థానిక రైతులు, మహిళల సమస్యలను శ్రీమతి షర్మిల అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీమతి షర్మిల రచ్చబండకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి బ్రతికి ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర ప్రజలకు సేవలు అందించారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఆయన ఉన్నప్పుడు రైతే రాజుగా బ్రతికాడన్నారు. తాను అధికారంలోకి వస్తే వ్యవసాయానికి రోజుకు 7 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తానని వాగ్దానం చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్‌ ఫైలు మీద మొదటి సంతకం చేశారన్నారు. మహానేత వైయస్ జీవించి ఉన్నంత కాలమూ ‌తాను ఇచ్చిన ఉచిత విద్యుత్‌ పథకాన్ని నిర్విఘ్నంగా అమలు చేశారన్నారు. ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారన్నారు. రైతులకు రూ. 12 వేల కోట్లు రణ మాఫీ చేయించారన్నారు. ఆయన కృషి ఫలితంగా రైతులందరికీ రుణాలు మాఫీ అయిపోయాయన్నారు. అప్పుల్లో నుంచి రైతన్న బయటపడ్డాడన్నారు. విత్తనాలు, ఎరువుల ధరలు పెరగకుండా మహానేత వైయస్‌ చూసుకున్నారని వివరించారు. మద్దతు ధర సరిగ్గా అందేలా చేశారన్నారు. నీళ్ళు, కరెంటు సమయానికి అందేలా చూశారన్నారు. రైతుకు అండగా నిలబడి తాను మీకు అండగా ఉంటానని భరోసాని, ధైర్యాన్ని ఇచ్చారని షర్మిల ప్రస్తావించారు.

అయితే, ఇప్పుడు అన్నదాతకు అలాంటి అభయం, భరోసా లేకుండాపోయిందని, ఏ రైతుతో మాట్లాడినా లక్షలకు లక్షలు అప్పుల్లో కూరుకుపోయామని ఆవేదన చెందుతున్నారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న రాజ్యంలో రైతన్న అప్పుల నుంచి విముక్తి పొందితే ప్రస్తుత పాలకుల నిర్వాకం కారణంగా మళ్ళీ అప్పుల ఊబిలో కూరుకుపోయారని విచారం వ్యక్తం చేశారు. కరెంటు, విద్యుత్‌ ఉండడంలేదని, దేవుని దయ కూడా తక్కువైపోయి వానలు కూడా పడడంలేదని శ్రీమతి షర్మిల తెలిపారు. ఎరువులు, విత్తనాల ధరలు పెరిగిపోయాయన్నారు. ఒక పక్క వ్యవసాయానికి ఖర్చు ఎక్కువైపోగా, మరో పక్క మద్దతు ధర లేక అన్నదాతకు ఆదాయం తగ్గిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఈ రోజున రాజన్న బ్రతికి ఉంటే 7 గంటలు కాదు గదా 9 గంటలు ఇచ్చి ఉండేవారని అన్నారు. కానీ, ఈ ప్రభుత్వానికి రైతన్న బాగు అక్కర్లేకుండా పోయిందని దుయ్యబట్టారు. రెండు గంటలు, నాలుగు గంటలు మాత్రమే విద్యుత్‌ ఉంటోందని, దీనితో పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు.

మహిళలకు కూడా ఇప్పుడు భరోసా లేకుండా పోయిందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న బ్రతికి ఉన్నప్పుడు మహాళలను సొంత అక్క చెల్లెళ్ళుగా చూసుకున్నారన్నారు. రాష్ట్ర మహిళలంతా తన తోబుట్టువులని అందరికీ పావలా వడ్డీ రుణాలు ఇప్పించారన్నారు. వారిని ఆర్థికంగా అభివృద్ధి చేశారన్నారు. మహిళలంతా ఆత్మగౌరవంతో బతికేలా చూశారని పేర్కొన్నారు. తమ పిల్లలను వారే చక్కగా చదివించుకుని, అభివృద్ధి చెందాలని మహానేత వైయస్‌ కృషిచేశారని గుర్తుచేశారు. ఈ రచ్చబండ కార్యక్రమంలో మహిళలు, రైతులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Back to Top