పింఛన్ ను దోచేస్తున్నారు..!

రాజధాని పేరుతో పెన్షన్ దోపిడీ..!
వికలాంగులు,వితంతులు, వృద్ధుల కన్నీరు..!

ఏలూరుః టీడీపీ అవినీతి ఎల్లలు దాటిపోతోంది. ఎంతలా దోపిడీకి పాల్పడుతున్నారంటే..తమ అక్రమాలకు కాదెవ్వరు అతీతులు అన్నంతగా చెలరేగిపోతున్నారు. రాజధాని అమరావతి శంకుస్థాపన పేరుతో వందలాది కోట్లు దుబారా చేసిన పాలకులు..ఇప్పుడు అదే నిర్మాణం కోసం వికలాంగులు, వృద్ధులు , వితంతు పింఛన్లను లాగేసుకుంటున్నారు. వచ్చేదే అరకొర పెన్షన్. దాంట్లోనే ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.100 బలవంతంగా వసూలు చేస్తూ కొత్తదందాకు తెరలేపారు. ఇవ్వకపోతే పింఛన్ రాదంటూ బెదిరింపులకు గురిచేస్తూ దోచుకుంటున్నారు.

తారాస్థాయికి అవినీతి..!
ఏలూరు నగరపాలకసంస్థలో ఈదందా షురూ అయ్యింది.  లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ రూ. వంద స్వచ్ఛందంగా ఇవ్వాలంటూ చేస్తున్నదోపిడీకి ఎమ్మెల్యే బుజ్జి పూర్తి సహకారం అందిస్తున్నారు. రూ. 100 ఇచ్చే విధంగా ప్రకటన జారీ చేయాలని పౌరసంబంధాల అధికారులను ఆదేశించడమే తర్వాయి...వారు  పత్రికలకు ప్రకటన కూడా రిలీజ్ చేశారు. పింఛన్ దారులనుండే కాకుండా నగరంలోని ప్రభుత్వ, కార్పొరేషన్ పాఠశాల్లో చదివే ప్రతి విద్యార్థి నుంచి పది రూపాయల చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారు. 
 
కాపుకాసి లాగేస్తున్నారు...!
ఏలూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 18,890 మంది లబ్ధిదారులున్నారు. ప్రతి నెలా మాదిరిగానే ఈసారీ పింఛన్లు తీసుకునేందుకు రెండురోజులుగా లబ్ధిదారులు ఆయా కేంద్రాలకు వెళుతున్నారు. అయితే ఎక్కడికక్కడ పింఛన్ కేంద్రాల వద్ద కార్పొరేటర్లు, టీడీపీ కార్యకర్తలు కాపుకాసి ... రూ.100 ఇస్తేనే కౌంటరులోకి పంపిస్తున్నారు. ఈవిధంగా ఇప్పటివరకు దాదాపు రూ.20 లక్షలపైనే వసూలు చేశారు.  అధికార పార్టీ నేతల అక్రమాలకు కార్పొరేషన్ అధికారులు పూర్తిస్థాయిలో వత్తాసు పలుకుతూ పేదలను నిలువు దోపిడీ చేస్తున్నారు.

పేదలపై పచ్చచొక్కాల పాపం..!
పెన్షన్ పైనే ఆధారపడి బతుకుతున్న పేదల నోళ్లు కొట్టేందుకు... మనసెలా వస్తోందని పాలకులపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎడాపెడా పెన్షన్లలో కోత విధిస్తూ.... వచ్చేదాంట్లోనే లాక్కుంటే తామెలా బతికేదని బాధితులు లబోదిబోమంటున్నారు. ఎమ్మెల్యే ఇవ్వమన్నారని టీడీపీ నేతలు రూ. 100 లాక్కుంటున్నారని వారు వాపోతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే పింఛన్ ఆపేస్తారేమోనన్న భయంతో ఇచ్చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పింఛన్ లాక్కోవడం వల్ల రూ. 100 అప్పు చేసి ఇంటి అద్దె కట్టాల్సివస్తుందని మద్దెలక్ష్మమ్మ అనే బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. మందులు కూడా కొనలేకపోతున్నాని మరో బాధితురాలు చిట్టెమ్మ వాపోయింది. 
Back to Top