దేశం మొత్తం దెబ్బతినే ప్రమాదం

  • మోడీ ఏకపక్ష నిర్ణయం వల్లే ఈ దుస్థితి
  • ప్రజలు కడుపునిండా తిండి తినలేని దౌర్భాగ్యం
  • బాబు పూటకో మాటతో ప్రజలను మోసగిస్తున్నారు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకే  భారత్ బంద్
  • వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టీకరణ
గుంటూరు: నోట్ల రద్దుతో దేశంలో 80 శాతం పైచిలుకు ఉన్న కార్మికులు కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య పరిస్థితిలు నెలకొన్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్ర ప్రజానికం పడుతున్న ఇబ్బందులకు నిరసనగా గుంటూరులో వైయస్‌ఆర్‌ సీపీ నేతలు మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డిల ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గుంటూరు ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. 

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ....నగదు రహిత బ్యాంక్‌ లావాదేవీలు జరగాలని సీఎం చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు, రాష్ట్రంలోని అనేక మంది కార్మికులకు బ్యాంక్‌ అకౌంట్‌లే లేవన్నారు. పోపుడబ్బాలో దాచుకున్న రూ. 5 వందల నోటు చెల్లకపోవడంతో కూలీలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నల్లధనాన్ని వెలికితీయడానికి వైయస్‌ఆర్‌ సీపీ వ్యతిరేకం కాదు, కానీ నల్లధానాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను ప్రభుత్వాలు పెడుతున్న ఇబ్బందులను ఖండిస్తున్నామని చెప్పారు. నోట్ల రద్దుతో ప్రజలు శుభకార్యాలు కూడా చేసుకోలేని దౌర్భాగ్యపు పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుంటే మోడీ వారిపై ఎదురుదాడికి దిగుతున్నారని, ఇప్పటికైనా మోడీ చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు ఈ బంద్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

మోడీ అనాలోచిత నిర్ణయం వల్ల దేశానికే ప్రమాదం
ఉరవకొండః ప్రధాని తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల కూలీలు, రైతులు సహా  కోట్లాదిమంది  ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. దీనిపై ప్రశ్నిస్తే  దేశద్రోహులనో, బ్లాక్ మనీకి అనుకూలమనే రీతిలో ప్రధాని చిత్రీకరిస్తున్నారని చెప్పారు . పార్లమెంట్లో చర్చ జరిపేందుకు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. మన్మోహన్ సింగ్, అమర్త్యసేన్ లాంటి వాళ్ల సలహాలు పట్టించుకోకుండా ఏకపక్షంగా పోవడం సరికాదని ప్రధానికి హితవు పలికారు.  ఏకపక్షంగా నిరంకుశంగా ఇబ్బంది పెట్టే చర్యలకు పూనుకోవడం తగదన్నారు.  ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా మోడీ అనాలోచితంగా తీసుకున్న చర్యలనే తాము వ్యతిరేకిస్తున్నాం తప్ప నల్లధనం వెలికితీతకు కాదని చెప్పారు. మోడీ ఏకపక్ష నిర్ణయాల వల్ల  దేశం మొత్తం దెబ్బతినే ప్రమాదమున్నదని అన్నారు. 
 
Back to Top