కోవర్టుకెందుకు సమైక్య నాటకాలు?

హైదరాబాద్, 21 అక్టోబర్ 2013:

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోవర్టులా వ్యవహరించే సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి ఆడుతుతన్న నాటకాలు కట్టిపెట్టాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, సీఈసీ సభ్యుడు అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. విభజన తుపానును ఆ‌పుతానంటూ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా కిరణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యల‌ను తప్పపట్టారు. కిరణ్‌వన్నీ ఉత్తరకుమార ప్రగల్భాలే అన్నారు. సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలో భాగంగానే కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆదివారంనాడు అంబటి నిప్పులు చెరిగారు. సమయం చిక్కినప్పుడు సరైన నిర్ణయం తీసుకోకుండా మీనమేషాలు లెక్కించిన కిరణ్ ఇప్పుడు ‌విభజనను ఆపుతానని చెప్పి ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తున్నారని అంబటి దుయ్యబట్టారు.

‘సోనియాగాంధీకి కోవర్టులాగా వ్యవహరించి, రాష్ట్ర విభజనను వేగవంతంచేసేలా ప్రయత్నిస్తున్నది నువ్వు కాదా? విభజన విషయం నా చేతిలో ఏమీ లేదు’ అని ఎన్జీవోల నేతలతో స్వయంగా నువ్వు అనలేదా? సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్ర ఉద్యోగులు ఉవ్వెత్తున ఉద్యమిస్తే వారి సమ్మెను నయానా భయానా విరమింపజేసింది నువ్వు కాదా? నువ్వు చేస్తున్నవన్నీ విభజనకు అనుకూల చర్యలే కదా? ఇలా రోజుకో రకంగా మాట్లాడటం ఎవరిని మభ్యపెట్టేందుకు? ఎవరిని మోసగించేందుకు ఈ నాటకాలన్నీ? నీ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల జీవితాలతో ఎందుకిలా ఆటలాడుతున్నావు? విభజన ప్రకటన వచ్చిన వెంటనే నువ్వు రాజీనామా చేసి ఉంటే లక్షలాది మంది ఉద్యోగులు, కోట్లాది మంది ప్రజలు నడిబజారుకు వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితే దాపురించి ఉండేది కాదు కదా!’ అని కిరణ్‌ను అంబటి ప్రశ్నించారు.

‘ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తామని జూలై 30న సీడబ్ల్యూసీ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి అంతకు ముందే రోడ్‌మ్యాప్‌లని, వార్ రూ‌మ్ భేటీలని కాంగ్రె‌స్‌ పార్టీ అగ్రనేతలు కిరణ్‌ను, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను అనేకమార్లు ఢిల్లీకి పిలిపించుకుని సుదీర్ఘంగా చర్చలు జరిపారు. జూలై 30 సాయంత్రం విభజన ప్రకటన చేయబోతున్నారని కూడా వాళ్లిద్దరికీ కచ్చితంగా ముందే తెలుసు. అలాంటప్పుడు, విభజన ప్రకటన వస్తే రాజీనామా చేస్తానని ముందుగానే సోనియాకు కిరణ్ చెప్పి ఉంటే సీడబ్ల్యూసీ ఆ ప్రకటన చేసి ఉండేదా? విభజన ఆగి ఉండేది కాదా?’ అని ‌రాంబాబు సూటిగా ప్రశ్నించారు.

‘ఇలాంటి అంశంపై ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే అది జాతీయ స్థాయిలోనూ, కాంగ్రెస్ అధిష్టానంలోనూ తీవ్రమైన చర్చకు దారి తీసి ఉండేది.‌ కచ్చితంగా ఆ రోజు సీడబ్ల్యూసీ విభజన ప్రకటన చేయకుండా వెనక్కి తగ్గి ఉండేది. కానీ అప్పుడలా చేయని కిరణ్, ఇప్పుడు తన పదవిని తృణప్రాయంగా త్యాగం చేస్తానని, తనకు సమైక్య రాష్ట్రం కన్నా పదవి ముఖ్యం కాదని ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు. శ్రీకాకుళంలో తుపాను బాధితుల పరామర్శకు వెళ్లి, ‘తుపానును ఆపలేక పోయాం గానీ, రాష్ట్ర విభజనను ఆపే ప్రయత్నం చేస్తా’నని గొప్పలు చెబుతున్నారు. సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజన ప్రకటనను వెల్లడించగానే కిమ్మనకుండా మౌనం దాల్చిన కిరణ్, సీమాంధ్రలో చెలరేగిన ప్రజాగ్రహాన్ని చూసి బయటకు వచ్చి విభజనకు తాను వ్యతిరేకమన్నట్టుగా మాట్లాడారు.

'కిరణ్‌కుమార్‌రెడ్డి అలా మాట్లాడుతూ ఉండగానే విభజన నోట్ కేబినె‌ట్‌కు కూడా వచ్చింది. కేంద్ర మంత్రుల బృందం కూడా విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది’ అని అంబటి విమర్శించారు. సీఎం ఇప్పటికైనా వాస్తవాలను అర్థం చేసుకుని ప్రగల్భాలు మాని, అసెంబ్లీని సమావేశపరచి, సమైక్య తీర్మానం చేయడం ద్వారా విభజనను అడ్డుకునేందుకు నిజమైన ప్రయత్నం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Back to Top