జై జగన్‌ అన్నవారికే ఓటు వేయండి

విజయనగరం, 16 జూన్‌ 2013:

ఉత్తరాంధ్రలో ఎన్నికల వేడి పుట్టిందని, ఎన్నికలు పూర్తయ్యే దాకా,‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేదాకా, శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని సిఎం చేసే దాకా ఈ వేడి తగ్గే ప్రసక్తే లేదని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. మీ వాడీ వేడీ ఎన్నికల్లో చూపించండి అని ఆయన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయనగరంలో ఆదివారం జరిగిన పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో అంబటి రాంబాబు మాట్లాడారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌, టిడిపిలను చిత్తుచిత్తుగా ఓడించాలని అంబటి రాంబాబు విజ్ఞప్తిచేశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, శ్రీ జగన్మోహన్‌రెడ్డికి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.

పార్టీ రహితంగా, గుర్తులు లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారంతా 'మా బాబే' (సత్తిబాబే, కిరణ్‌బాబే, చంద్రబాబే) అని చెప్పుకోవాలని కాంగ్రెస్‌, టిడిపిలు ఆశపడుతున్నాయని అంబటి ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గుర్తులు లేకపోయినా 'జై జగన్'‌ అన్నవారికి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, శ్రీ జగన్మోహన్‌రెడ్డికి అండగా ఉంటామని ప్రమాణం చేసిన వారికి మాత్రమే ఓటు వేయమని పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ఉవ్వెత్తున లేచే కెరటంలా లేవాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని ఆయన వజ్ఞప్తిచేశారు.

ముప్పై ఏళ్ళుగా కాంగ్రెస్‌ పార్టీతో పోరాటం చేస్తున్నానంటూ చెప్పుకునే చంద్రబాబు నాయుడు కేవలం 146 స్థానాలతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఎలా ఉంటుందని ఏ ఒక్క రోజునా ప్రశ్నించలేదేమని అంబటి రాంబాబు నిలదీశారు. అలా అడిగిన మరుక్షణమే చంద్రబాబు నాయుడు జైలులోకి పోతారని, ఆయన అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరుగుతుందన్న భయం ఉందని చెప్పారు. సిబిఐ విచారణ అంటేనే చంద్రబాబులో చలి పుడుతుందని ఎద్దేవా చేశారు.

సంవత్సర కాలానికి పైగా అక్రమంగా, అన్యాయంగా జైలులో నిర్బంధించినా ధైర్యంగా పోరాటం చేస్తున్న ధీశాలి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అని అంబటి రాంబాబు అభివర్ణించారు. అదే చంద్రబాబుపై సిబిఐ విచారణ అంటేనే వణుకు పుట్టి ఢిల్లీ వెళ్ళి సోనియాగాంధీ కాళ్ళు పట్టుకుని మేనేజ్‌ చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదు, కిరణ్‌కుమార్‌రెడ్డి దొంగ అంటూ పాదయాత్రలో విమర్శించిన చంద్రబాబును అవిశ్వాసం పెట్టమంటే పెట్టలేదన్నారు. ఒకవేళ తాను అవిశ్వాసం పెడితే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని, శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సిఎం అవుతారని అందుకే తాను అవిశ్వాసం పెట్టబోనని చంద్రబాబు తోకముడిచారని ఆరోపించారు. అలుపొచ్చే వరకూ నడుస్తాను గాని అవిశ్వాసం మాత్రం పెట్టబోననే పరిస్థితికి చంద్రబాబు వచ్చారన్నారు. తీరా ప్రతిపక్షాలన్నీ అవిశ్వాసం పెడితే విప్‌ జారీ చేసి మరీ దాన్ని రక్షించారని అంబటి విమర్శించారు.

చంద్రబాబు, కిరణ్, సత్తిబాబు ముగ్గురూ ఏకమై శ్రీ జగన్మోహన్‌రెడ్డిని వేధిస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తగా పెట్టిన పథకాల అమలు శూన్యమన్నారు. అమ్మహస్తం పథకం పేరుతో ఇచ్చే ఒక్క వస్తువైనా తన నియోజకవర్గానికి రాలేదని సాక్షాత్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డి.ఎల్. రవీంద్రారెడ్డి చెప్పిన విషయాన్ని అంబటి ప్రస్తావించారు. పుచ్చిపోయిన కందిపప్పు, పురుగులున్న చింతపండు లాంటి వస్తువులు ఇచ్చిన ఆ పథకం రాక్షసహస్తం అని ఆయన ఎద్దేవా చేశారు. దౌర్భాగ్యమైన రాజకీయాలు నడుపుతున్న కాంగ్రెస్‌, టిడిపిలకు ఉత్తరాంధ్రలో డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని అంబటి పిలుపునిచ్చారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందే జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సత్తా చూపించాలని పార్టీ శ్రేణులకు అంబటి పిలుపునిచ్చారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు రెండు పదవులని, ఆయన కుటుంబం మొత్తం విజయనగరం జిల్లాలో పదవులు అనుభవిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. రాజకీయాల్లోకి రాక ముందు బొత్స జీవితం ఏమిటి? ఇప్పుడెలా ఉందో అందరికీ తెలిసిందే అన్నారు. అలాంటి బొత్స సత్తిబాబు మహానేత వైయస్‌ఆర్‌ గురించి,‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి గురించి నువ్వా మాట్లాడేది అని పార్టీ శ్రేణులు విజృంభించి నిలదీయాల్సిన సమయం వచ్చిందన్నారు.

నిజాలు రాసే సాక్షి పత్రిక, నిజాలను ప్రసారం చేసే సాక్షి చానల్‌ అంటే చంద్రబాబుకు, కిరణ్‌ కుమార్‌ రెడ్డికి భయమే అని అంబటి వ్యాఖ్యానించారు. అర్ధరాత్రిపూట, కుక్కలు అరిచే సమయంలో పాదయాత్ర చేసే చంద్రబాబు వార్తను ఈనాడు తప్ప మరే పత్రికా మొదటి పేజీలో ఎందుకు వేస్తాయని అంబటి ప్రశ్నించారు. అందుకే సాక్షిని చంద్రబాబు బహిష్కరించారని ఆయన ఎద్దేవా చేశారు. కిరణ్, చంద్రబాబు, బొత్సలకు ప్రత్యక్షంగా చానల్‌ను నడిపే దమ్ము లేదని, అది కేవలం రాజశేఖరరెడ్డికి మాత్రమే ఉందన్నారు. జగనన్నకు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలవాలని అంబటి రాంబాబు విజ్ఞప్తిచేశారు.

Back to Top