చర్చిస్తే.. విభజన ఆగుతుందని చెప్పగలరా?

హైదరాబాద్ :

రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు మీద చర్చిస్తే విభజన ఆగిపోతుందని సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి హామీ ఇవ్వగలరా? అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. ఓటింగ్‌కు అవకాశం లేదంటూనే అసెంబ్లీలో అంశాల వారీగా చర్చించాలనడం ఎంత వరకూ సబబు అన్నారు. విభజన బిల్లు మీద చర్చించకపోతే సమైక్యానికి కట్టుబడినట్లు కాదనే వాదాన్ని కూడా ప్రచారం చేస్తున్నారంటూ అభ్యంతరం తెలిపారు.

రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన బిల్లుపై చర్చకు ససేమిరా అని అడ్డుకోవడం సమైక్యవాదానికి ద్రోహం చేయడం అవుతుందా? అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమంత్రికి ఏమైనా మతి చలించిందా! లేక తన మెదడును సోనియాగాంధీకి తాకట్టు పెట్టారా? అని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్ఆర్ కాంగ్రెస్, టీడీపీలు బిల్లుపై చర్చలో పాల్గొనాలంటూ సీఎం కిర‌ణ్ బుధవారం ‌చేసిన విజ్ఞప్తిపై అంబటి ఒక ప్రకటనలో స్పందించారు.

రాష్ట్ర విభజనను మొత్తంగా తిరస్కరించకుండా పునర్విభజన బిల్లు మీద శాసనసభలో చర్చించడమంటే అర్థమేమిటి? విభజనకు అంగీకరించడం కాదా? అన్నారు. శాసనసభలో సమైక్య తీర్మానం జరగకుండా విభజన బిల్లుపై చర్చించడమంటే మన మెడకు మనమే ఉరి బిగించుకున్నట్లవుతుందన్నారు. కిరణ్‌కు సోనియా సిద్ధాంతం నచ్చక పోతే, సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తుంటే పోరాడాల్సింది సోనియా మీదా? లేక సమైక్యవాద వైయస్ఆర్ కాంగ్రె‌స్ మీదా?‌ అని ప్రశ్నించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top