అమర్‌ రహే.. వైయస్‌ఆర్‌

అభిమాననేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి మెట్రో నగరాలు జోహార్లు అర్పించాయి. అభిమానం వెల్లువెత్తింది. ఆరాధన ఆకాశాన్నంటింది.

మహానేత మూడో వర్ధంతి సందర్భంగా ఆయనకు చెన్నై, ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లోని ప్రజానీకం స్మృత్యంజలి ఘటించారు.

తమిళనాడులోని తెలుగు వారు ఆదివారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. చెన్నై, వేలూరు, తిరువళ్లూరు, పళ్లిపట్టు, పొద్దుటూరుపేటల్లో వైయస్ స్మృత్యంజలి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు విభాగం నేతలు ఎ.కె. జాకీర్ హుస్సేన్, పెరంబూరుకు చెందిన కె.శరవణన్, కెప్టెన్ కె.మణి వణ్ణన్, కె.బాలు, ఎం. సతీశ్, ఆనంద్, పళని, వెంకటేశ్ నేతృత్వంలో చెన్నైలోని పెరంబూరు, రాయపురం, చేట్‌పట్‌లలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

వై.యస్. జగన్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్యారిస్‌లోని వరద ముత్తయప్ప వీధిలోను, తరమణి వైయస్సార్ అభిమానుల నేతృత్వంలో ఓఎంఆర్ రోడ్డులోని కారపాక్కంలోను వైయస్‌కు శ్రద్ధాభిమానాలతో నివాళులర్పించారు.

తిరువళ్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సురేశ్ బాబు నేతృత్వంలో వైయస్ స్మృత్యంజలి కార్యక్రమం జరిగింది. పలు ప్రాంతాల్లో పేదలకు అన్నదానం, చీరలు పంపిణీ చేశారు.

దేశ రాజధానిలో...
వైయస్ మూడో వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ప్రవాసాంధ్రుల వైయస్సార్ ట్రస్ట్ ఢిల్లీ అధ్యక్షుడు కేఎస్.నారాయణ ఆధ్వర్యంలో ర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చెందిన వైయస్సార్ అభిమానులు పాల్గొన్నారు.

ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన జనహృదయ నేత వైయస్ అని ఈ సందర్భంగా ప్రసంగించిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రస్తుతించారు. మహానేతకు నివాళులు అర్పించారు.

మహారాష్ట్రలో...

మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కూడా వైయస్ మూడో స్మృత్యంజలి కార్యక్రమం పరమ శ్రద్ధాభిమానాలతో ప్రజానీకం నిర్వహించారు. ముంబై, పుణే, షోలాపూర్ సహా పలు ప్రాంతాల్లో వైయస్‌కు తెలుగు ప్రజలు పరమ అభిమానంతో నివాళులు అర్పించారు. వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

ముంబైలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాదిరెడ్డి కొండారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన స్మృత్యంజలి సభకు భారీ సంఖ్యలో తెలుగు ప్రజలు, వివిధ సంఘాల నాయకులు హాజరై మహానేతకు నివాళులు అర్పించి ఆయన సేవలను మననం చేసుకొన్నారు.

ఈ కార్యక్రమానికి నందమూరి లక్ష్మీపార్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు ప్రజల హృదయాల్లో వైయస్సార్ చిరస్థాయిగా నిలిచిపోతారని ఆమె అన్నారు.

Back to Top