ఆర్టీసీ సిబ్బంది సొంతింటి కల‌ జగన్‌తోనే సాధ్యం

ఏలూరు : ఆర్టీసీ కార్మికుల సొంత ఇంటి కల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ పరంగా సొంత ఇళ్ళు నిర్మించి ఇవ్వటానికి తాను కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో పశ్చిమ రీజియన్‌లో విజయం సాధించిన నేషనల్ మజ్దూ‌ర్ యూనియ‌న్ నాయకులు, కార్మికులు మంగళవారం రాత్రి ఎమ్మెల్యే‌ నానిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారికి శుభాకాంక్షలు తెలిపిన నాని మాట్లాడుతూ, ఆర్టీసీలో పనిచేస్తున్న పేద కార్మికులు ఇళ్ల స్థలాల కోసం ఎప్పటి నుంచో విజ్ఞప్తులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికులకు సొంత ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపడతామని తెలిపారు.

పోలీస్ హౌసింగ్ బోర్టు తరహాలో ఆ‌ర్టీసీ హౌసింగ్ బోర్టును ఏర్పాటు‌చేసే విషయంపై శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆలోచిస్తున్నారని ఎమ్మెల్యే నాని వెల్లడించారు. కార్మికులకు ప్రభుత్వ పరంగా కేటాయించే నివాసిత స్థలాలలో సులభతరమైన రుణాలు మంజూరు చేసి సొంత ఇంటి కల నెరవేరుస్తామన్నారు.
Back to Top