ఆపన్నులకు షర్మిల ఆత్మీయ స్పర్శ

అంతవరకూ ఆపుకున్న దుఖం కట్టలు తెంచుకుంటోంది. గుండెలో గూడుకట్టుకున్న ఆవేదన బరువు దిగిపోతోంది.  ఇంకిపోయిన కళ్లు చెమరుస్తున్నాయి. చేష్టలుడిగిన చేతులు సత్తువ పుంజుకుంటున్నాయి. నీరసించిన హృదయాలు ఉత్తేజితమవుతున్నాయి. మూగబోయిన గొంతుకలు శంఖాల్లా మోగుతున్నాయి. గుండె గొంతుకలో కొట్టుమిట్టాడే బాధలు బడబాగ్ని చల్లారుతోంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్. రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్.  జగన్మోహన్‌ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్. షర్మిల పాదయాత్ర చేస్తున్న ప్రాంతాల్లో కనిపిస్తున్న  దృశ్యాలివి.  అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. ఆర్తులను ఓదారుస్తూ శ్రీమతి షర్మిల సాగుతున్నారు.

మాచర్ల(గుంటూరు):

మాచర్ల నియోజకవర్గ ప్రజల మది నిండా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కొలువున్నారు. ఆయన చేసిన మేలును ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్రలో ప్రజలు వైయస్ స్మృతులను ఆమెతో పంచుకున్నారు. ‘మీ నాయన మా గ్రామంలో చర్చి ప్రారంభించారు. కాలువలకు మరమ్మతులు చేయించారు. రూ. 1.5 కోట్ల రుణాలను మాఫీ చేశారు. మా గ్రామంలో మహానేత వల్ల లబ్ధి పొందని వారే లేరు. ఈ మనసు లేని ప్రభుత్వం వల్ల అనేక కష్టాలు పడుతున్నాం’’ అంటూ షర్మిల ఎదుట ఆవేదన వ్యక్తం  చేశారు. గుంటూరు జిల్లాలో మూడోరోజు మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం కాచవరం, ఇనుపరాజుపల్లె, గాదెవారిపల్లె గ్రామాల్లో శ్రీమతి షర్మిల పాదయాత్ర చేశారు. దివంగత మహానేత వైయస్  హయాంలో చేపట్టిన రూ.900 కోట్ల విలువైన అభివృద్ధి పనుల కారణంగా జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. నియోజకవర్గానికి వచ్చిన ప్రతిసారి ఆయన ఏదో ఒక పెద్ద ప్రాజెక్టు మంజూరు చేసేవారన్నారు. మనసు లేని ఈ ప్రభుత్వం వల్ల అభివృద్ది నిలిచిపోయిందనీ, మహానేత పథకాలు నిలిచిపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామనీ ఆవేదన వ్యక్తంచేశారు. ఉదయం గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది.

     పార్టీ జిల్లా కన్వీనరు మర్రి రాజశేఖర్, కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, గుంటూరు, కృష్ణాజిల్లాల కోఆర్డినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్‌కె), వాసిరెడ్డి పద్మ తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు. గ్రామంలోని  డాక్టర్ వైయస్‌ఆర్ విగ్రహానికి షర్మిల నివాళులర్పించారు. తనను పలకరించేందుకు వచ్చిన మహిళలతో మాట్లాడుతూ, కరచాలనం చేసుకుంటూ ముందుకు సాగారు. ఉదయం సమయంలో సుమారు 5 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలం కాచవరం గ్రామ సమీపంలో భోజన విరామం తీసుకున్నారు.

స్వాగతించిన ఎమ్మెల్యే పీఆర్కే..

     సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. ఇక్కడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పాదయాత్ర ముగిసే వరకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు షర్మిలపై పూలవర్షం కురిపించారు. ఇనుపరాజుపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లి ఆరబోసిన మిరపకాయలను పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు. నీళ్లు, కరెంటు లేకపోవడం వల్ల మిర్చి పంట పూర్తిగా దెబ్బతిందని, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని తెలిపారు. మీ ప్రాణాలు, పొలాలు చాలా విలువైనవని, వాటిని పోగొట్టుకోవద్దని జగనన్న రాజ్యంలో కష్ణాలు తీరతాయని శ్రీమతి షర్మిల వారికి భరోసా ఇచ్చారు. గాదెవారిపల్లి గ్రామంలోకి ప్రవేశించిన షర్మిలకు మహిళలు గుమ్మడికాయతో దిష్టితీశారు. అనంతరం వైఎస్‌ఆర్ చిత్రపటానికి నివాళులర్పించి రచ్చబండ నిర్వహించారు.

     దాదాపు 30 నిమిషాలు జరిగిన రచ్చబండలో ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టడంతోపాటు మహానేత పట్ల వారికున్న అభిమానాన్ని షర్మిలతో పంచుకున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై ప్రజలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడున్న కాంగ్రెస్‌కు, అప్పటి టీడీపీ ప్రభుత్వాలకు ఏ మాత్రం తేడాలేదని మహిళలు ధ్వజమెత్తారు. జగన్ అరెస్టు పట్ల ఆరో తరగతి విద్యార్థి షేక్ బాబు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తరువాత షర్మిల మాట్లాడుతూ, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ పార్టు - 2గా పేర్కొన్నారు. ఓపికపడితే మనసున్న జగన్ సీఎం అయి ప్రజల కష్టాలు తీరుస్తారన్నారు. రచ్చబండ తరువాత చిన కొదమగుండ్ల గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు.

     శ్రీమతి షర్మిలతోపాటు పార్టీ శాసనసభా పక్ష ఉపనేత మేకతోటి సుచరిత, జిల్లా పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డి, యెనుముల మురళీధరరెడ్డి, మేరుగ నాగార్జున, జిల్లా యూత్ కాంగ్రెస్ కన్వీనరు కావటి మనోహరనాయుడు, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనరు అన్నాబత్తుని సదాశివరావు, సాంస్కృతిక విభాగం కన్వీనరు జానీబాషా, బీసీ విభాగం కన్వీనరు దేవళ్ల రేవతి, ఎస్సీ విభాగం జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబ, ఎస్టీసెల్ కన్వీనర్ హనుమంతునాయక్, రాష్ర్టమైనార్టీసెల్ ఉపాధ్యక్షులు జిలానీ, గుంటూరు సిటీ ట్రేడ్ యూనియన్ కన్వీనరు రసూల్, ఎం. పురుషోత్తం, నాయకులు నూనె ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top