9న గుంటూరులో ‘వంచనపై గర్జన’– ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ అలుపెరగని పోరాటం
– నాలుగేళ్లుగా చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదు
– కాంగ్రెస్‌తో పొత్తు కోసం చంద్రబాబు తహతహ


హైదరాబాద్‌: 
ఈ నెల 9వ తేదీ గుంటూరులో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో వంచన గర్జన నిర్వహిస్తున్నట్లు పార్టీ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం, రాప్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిరంతర పోరాటం చేశామని ఆయన గుర్తు చేశారు. గురువారం ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో అఖరి బడ్జెట్‌ ప్రతిపాదించే వరకు వేచి చూశామని, కేంద్రం తీరుకు నిరసనగా పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఢిల్లీ వేదికగా ఆమరణ దీక్షలు చేశారన్నారు. మొదటి నుంచి కూడా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను, దీక్షల ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించామన్నారు. నిరసన కార్యక్రమాలలో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని చెబుతూ మేం పోరాటం చేస్తుంటే చంద్రబాబు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని చెబుతున్న చంద్రబాబు భవిష్యత్తులో కాంగ్రెస్‌తో సయోధ్యకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు ఇవాళ కాంగ్రెస్‌తో స్నేహం కోసం తహతహలాడుతున్నారని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తుంటే టీడీపీ అడ్డుపడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలపై ఇటీవల రాష్ట్రబంద్‌కు వైయస్‌ఆర్‌సీపీ పిలుపునిస్తే..బంద్‌ను విఫలం చేసేందుకు చంద్రబాబు పోలీసులతో ఉద్యమకారులను అక్రమంగా అరెస్టు చేయించారన్నారు. రాష్ట్ర విభజనకు మొట్ట మొదట ఆమోదం తెలిపింది టీడీపీనే అన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను కేంద్రం అన్యాయం చేస్తుంటే చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని నిలదీశారు. వైయస్‌ జగన్‌నాయకత్వంలో ప్రత్యేక హోదా సాధించి తీరుతామని చెప్పారు. 9న నిర్వహించే వంచనపై గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
 
Back to Top