ప్రజా సమస్యలపై కలిసి స్పందిద్దాం

రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అంశంపై మంగళవారం అసెంబ్లీలో పార్టీల అభిప్రాయాలు వెల్లడించేందుకు స్పీకర్‌ అనుమతించిన సమయంలో విజయమ్మ పార్టీ శాసనసభా పక్ష నేత హోదాలో మాట్లాడారు. తెలంగాణతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ప్రజలు అనేక సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. తెలంగాణ సమస్యపై అన్ని పార్టీలు కలిసి కూర్చొని బీఏసీలో చర్చించి, పరిష్కారాన్ని కనుగొనవచ్చని విజయమ్మ సూచించారు. తెలంగాణపై అసెంబ్లీలో ఎలాంటి తీర్మానం చేస్తారో అని తెలంగాణ వారే కాకుండా అన్ని ప్రాంతాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం కేవలం ఐదు రోజులే నిర్వహిస్తున్నందున ప్రజా సమస్యలపై అన్ని పార్టీల సభ్యులూ స్పందించి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని విజయమ్మ సలహా ఇచ్చారు.

సీఎం తీరు బాధాకరం:
కర్నూలు, వైయస్‌ఆర్‌ కడప జిల్లాల రైతుల పంటలకు తక్షణమే నీరు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. అయితే, ముఖ్యమంత్రి నుంచి తమకు ఇంతవరకూ స్పష్టమైన హామీ రాలేదన్నారు. సిఎం తీరు బాధాకరం అని వారు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద‌ వారు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పంటలకు నీరు ఇస్తుందన్న నమ్మకంతో రైతులు నారుమళ్ళు వేసుకొన్నారని, అయితే, వారి నమ్మకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం వమ్ము చేసిందన్నారు. పంటలకు నీటి సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.

రైతుల ఇబ్బందులపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాదయాత్ర చేసి, కలెక్టర్‌కు మెమొరాండం సమర్పించారన్నారు. కర్నూలు, వైయస్‌ఆర్‌ కడప జిల్లాల పంటలకు నీటి సరఫరా చేయాలని తాము ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. నీళ్ళిస్తామని గాని, ఇవ్వలేమని కాని తమకు సిఎం స్పష్టంగా చెప్పలేదన్నారు. ప్రభుత్వం తీరు కారణంగా రైతులు రోడ్డున పడే దుస్థితి నెలకొందని శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో విద్యుత్‌ విధానం గందరగోళంగా ఉందని శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సంక్షోభంపై‌ అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఉమ్మడిగా కుమ్మక్కై గందరగోళం సృష్టించాయని ఆరోపించారు. చిన్న సమస్యను తీసుకొని సభలో అల్లరి చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. పంటలకు గంట సేపు కూడా విద్యుత్‌ సరఫరా చేసే అవకాశం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. విద్యుత్‌ సమస్యపై సమాధానం చెప్పకుండా కిరణ్ ప్రభుత్వం ‌పారిపోతోందని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రజాసమస్యలను పట్టించుకోని కాంగ్రెస్‌ సర్కార్‌కు ప్రధాన ప్రతిపక్షం వంతపాడుతోందని విమర్శించారు.  ప్రజాసమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగకుండా కాంగ్రెస్‌, టిడిపిలు కుట్రలు చేస్తున్నాయని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని విమర్శించారు.

కరవు మండలాలు ప్రకటించాలి: 
రాష్ట్రంలో కరవు మండలాలను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు శాసనమండలిలో డిమాండ్‌ చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామాల్లో కరవు సమస్యను పరిష్కరించాలని సూచించారు. డాక్టర్‌ వైయస్‌ గ్రామాలను యూనిట్‌గా తీసుకుని కరవు నివారణ చర్యలు చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా శేషుబాబు ప్రస్తావించారు.

అంతకు ముందు, అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన వెంటనే రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్‌ సంక్షోభంపై చర్చ కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. తెలంగాణ అంశంపై సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఒకసారి అరగంట పాటు వాయిదా పడింది. వాయిదా అనంతరం మళ్ళీ సభలో పరిస్థితి మారకపోవడంతో స్పీకర్‌ మనోహర్‌ సభను గురువారం ఉదయానికి వాయిదా వేశారు. 
Back to Top