2014 నాటికి తెలంగాణ రాష్ట్రం : కేటీఆర్­

హైదరాబాద్­, 27 ఆగస్టు 2012 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం 2014 ఎన్నికల లోగానే సానుకూల ప్రకటన చేస్తుందని టీఆర్­ఎస్ ­ఎమ్మెల్యే కె. తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్­లోని ఆదివారం జరిగిన తెలంగాణ పబ్లిక్­ ప్రాసిక్యూటర్ల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్­ మాట్లాడుతూ, 2014 సాధారణ ఎన్నికల నాటికి తెలంగాణ సమస్యను తన ఎన్నికల అజెండాలో కేంద్రం చూడాలని కోరుకోవడంలేదన్నారు. అందుకే అప్పటి సాధారణ ఎన్నికలకు ముందే కేంద్రం, కాంగ్రెస్­ పార్టీ తెలంగాణ సమస్యను పరిష్కరిస్తాయని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తాయన్నఆశాభావాన్ని కేటీఆర్­ వ్యక్తం చేశారు.

తెలంగాణ విషయంలో కేంద్రం తన హామీని నెరవేర్చకపోతే సరైన గుణపాఠం చెప్పేందుకు ఈ ప్రాంత ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని కె.టి.ఆర్­. తెలిపారు. ప్రభుత్వ న్యాయవాదుల నియామకంలో తెలంగాణ ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యం కల్పించడంలేదని కేటీఆర్­ విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న 316 మంది ప్రభుత్వ న్యాయవాదుల్లో తెలంగాణ వారు కేవలం 123 మందే ఉన్నారని అన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతానని న్యాయవాదులకు కేటీఆర్ హామీ ఇచ్చారు.

Back to Top