నెల్లూరు: చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని, అందుకే సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేసిందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు . తాను ఎలాంటి తప్పు చేయలేదని చంద్రబాబు అంటున్నారని, తప్పు చేసిన వారెవరూ నిజాన్ని ఒప్పుకోరని మంత్రి పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సీఐడీ వద్ద నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, రాజధాని పేరుతో అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. అన్ని వెలుగులోకి వస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది ఈ కేసుల్లో బయటకు వస్తారని కాకాణి అన్నారు. చంద్రబాబు అరెస్టును బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండిస్తున్నట్లు చెప్పడాన్ని కాకాణి తప్పుబట్టారు. వారిద్దరికి ఒప్పందం కుదిరినట్లుంది అందుకే చంద్రబాబు అరెస్ట్ ను పురందేశ్వరి తప్పుబడుతున్నారని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ధనం దుర్వినియోగమైన పర్వాలేదని మీరు చెప్పదలుచుకున్నారా అని పురందేశ్వరి నిలదీశారు. రెండుసార్లు లోక్ సభ పోటీ చేసి పురందేశ్వరి ఓడిపోయారని అందుకే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో జతకట్టి పోటీ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే చంద్రబాబును తీసుకొని బీజేపీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పురందేశ్వరికి లేదని తేల్చి చెప్పారు కాకాణి గోవర్థన్.