రెండేళ్ళలో విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెర్మినల్

రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ : విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో నిర్మిస్తున్న కొత్త ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ 2023 మార్చి నాటికి సిద్ధం అవుతుందని రాజ్యసభలో బుధవారం పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు. వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిస్తూ మంత్రి ఈ విషయం తెలిపారు. 611.80 కోట్ల రూపాయల వ్యయంతో విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో సరికొత్త ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనం, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) టవర్‌, యాప్రాన్‌, లింక్ టాక్సీవే తదితర నిర్మాణాలను చేపట్టాడానికి గత ఏడాది జూన్‌ 17న ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదాన్ని ఇస్తూ నిధులను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు ఎయిర్‌పోర్ట్‌లో టెర్మినల్‌ భవనం, లింక్‌ టాక్సీవే తదితర నిర్మాణ పనులకు సంబంధించి 11.33 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు.
 

Back to Top