బాబుగారు యాడికి పోనారబ్బా..?

చంద్రబాబు నాయుడి ఛాంబర్ .
సింవాచలం....సూరిబాబు చెరో మూల నుంచి తడిబట్టతో ఫ్లోర్ క్లీన్ చేస్తున్నారు.
సింవాచలం: ఏరా సూరిగా...బాబుగోరేంట్రా నాలుగు రోజుల నుంచీ అజా అయిపూ లేకుండా పోనారు? యాడికెళ్లారేటి? అని అడిగాడు.
మెడమీద నుంచి జారిపోతోన్న తువాలును పైకి సద్దుకున్నాడు ..సూరిబాబు.
సింవాచలం కేసి చూసి
సూరిబాబు: ఏదో సామెత చెప్పినట్లుందిరా..?  నాను ఫలానీ చోటుకు పోతున్నారా సూరిగా..సెగట్రేరియట్ అంతా నువ్వు చూసుకోవాల..అని బాబుగోరు నాకేమన్నా చెప్పి పోతారనకుంటున్నావా ఏటి ఎర్రి నాయాల..? అని వెటకారపు నవ్వొకటి నవ్వాడు సూరిబాబు.
సింవాచలానికి  కాస్త ఉడుక్కున్నాడు.
చెప్పుచ్చుక్కొట్టానంటే మొహం చెట్నీ అయిపోతాది ఎదవ ఎటకారాలాడావంటే ఎదవ నాయాల అని..కసిగా అనేశాడు సింవాచలం.
సూరిగాడు కొంచెం తమాయించుకుని.. మరి లేకపోతే ఏంట్రా..మనబోటోళ్లకి బాబుగోరు యాడికెళ్లారో ఎలా తెలుస్తుందిరా?   అని కాస్త అనునయంగా అన్నట్లు అన్నాడు సూరి.
సింవాచలం-మరయితే  వైదరాబాద్ ఎళ్లారంటావా?
సూరిగాడు- వైదరాబాద్ లో ఏముందిరా? ఎల్తే అక్కడ ఓటుకు కోట్లు కేసులో పోలీసులు పట్టుకుని కొట్లో వేసేస్తారు. ఆడికి వెళ్లరెహె.
సింవాచలం- మరయితే ...డిల్లీ కానీ పోనారేమోరా?
సూరిగాడు-డిల్లీకి పోయి ఏం చేత్తార్రా బాబూ?  అక్కడ ఈయనగోరిని ఎవరూ పట్టించుకోవడం లేదు కదా.
సింవాచలం-పెత్యేక హోదా అడగడం కోసం పోనారేమోరా?
సూరిగాడు-పెత్యేక వోదా లేదని  బిజెపి ఓళ్లు ముకం మీద కొట్టినట్లు చెప్పేసారు కదరా బాబూ. దానికీ అయ్యుండదు.
సింవాచలం-వోదా కాకపోతే  పోలవరం కోసం వెళ్లుంటారు
సూరిగాడు-లేదేస్. పోలవరాన్ని పక్కన పెట్టీసి పట్టిసీమ పట్టుకున్నారు కదేస్ బాబుగోరు.
సింవాచలం-మరింకేడికి పోయుంటార్రా?
కార్పెంటర్  వానపల్లి రామారావు చాంబర్ లోకి వచ్చి ఈ ఇద్దరి మాటలూ చాలా సేపటి నుంచి వింటున్నాడు.వాడు నవ్వాపుకోలేకపోయాడు.
ఊరుకోండేస్.. మీ ఇద్దరికీ ఏటీ తెలీదు. బాబుగోరు వైదరాబాదూ ఎల్లనేదు..ఆదిలాబాదూ ఎల్లనేదు.యాడికెళ్లారో నాకు మాత్రం తెలుసు. అని చాలా గర్వంగా చెప్పాడు.
సింవాచలం,సూరిబాబు  అమాయకంగా రామారావు కేసి చూస్తూ ఉండిపోయారు.
రామారావే కల్పించుకుని-మళ్లా ఎక్కడా కుయ్యకండిరా ఎదవ నాయనలారా..బాబుగోరు ఫారిన్ టూర్ కి వెళ్లార్రా బాబూ అని రహస్యంగా చెప్పినట్లు చెప్పాడు.
సింవాచలం నవ్వేసి...ఊరుకోస్..బాబుగోరు ఫారిన్ వెళ్తే.. టీవీల్లా..పేపర్లా... రెండు మూడురోజుల ముందు నుంచే ఊదరగొడతారు కదా. వాటిలో రాలేదంటే... ఆయన ఫారిన్ వెళ్లడేస్  అన్నాడు.
సూరిగాడు కూడా జోక్యం చేసుకుని బాబుగోరు ఫారిన్ ఎల్లాలంటే ఆయనతో పాటు ఆ పరకాల పెబాకర్ బాబుతో పాటు మంత్రులు..ఆఫీసరు బాబులూ కలిసి ఓ బెటాలియన్ ఎల్తాది కదా.. అని అనుమానం వ్యక్తం చేశాడు.
వానపల్లి రామారావు చికాగ్గా మొహం చిట్లించి ..మూసుకోండ్రా...చాలా రగస్యంగా ఎల్లారు. ఎవరికీ తెలీకుండా వెల్లి రావాలని అరజంటుగా వెళ్లారట. బాబుగోరి కారు డ్రైవర్  సత్తయ్య  నాకు చెప్పాడు అన్నాడు.
సింవాచలం..సూరిబాబు ఆసక్తిగా చెవులు రిక్కించి విని ఆశ్చర్యపోయారు.
మరయితే ఒక్కరూ ..ఎవరికీ చెప్పకుండా ఎందుకు పోనారేటి? అని ఇద్దరూ ఒకేసారి అడిగారు.
రామారావు చాలా భయపడుతూ..ఎక్కడా వాగకండిరా బాబూ. మొన్న  స్విస్ చాలెంజో ఏదో.. దాని మీద హై కోర్టులో చంద్రబాబుగోరికి ఎతిరేకంగా జడ్జి బాబు ఏదో అన్నారట కదా.ఆ కాంట్రాక్టు విదేశీ కంపెనీవోళ్లకి ఇస్తానని అంతకు ముందు వెళ్లినపుడు బాబుగోరు  హామీ ఇచ్చారట.  ఆ పనులు ఇచ్చినందుకు బాబుగోరికి కూడా బానే ముట్టిందట. ఇపుడు హై కోర్టు  నో అనేసింది కదా. ఆ ఇసయమే విదేశీ కంపెనీలకు చెప్పి..ఏదో ఒకటి సద్దుబాటు చేసుకోడానికి వెళ్లారట్రా బాబూ అన్నాడు రామారావు.
సింవాచలం..సూరిబాబు కూడా భయపడిపోయి.. ఇలాంటి ఇసయాలు మనకెందుకురా బాబూ మన తలలు ఎగిరిపోతాయి..నోర్మూసుకుని ఎవరి పని వాళ్లు చేసుకోండేస్ అని ఎవరి పనిలో వారు మునిగిపోయారు.
------------------------
-కవికాకి
------------------------


Back to Top