వానదేవున్ని మ్యానేజ్ చేయలేం కాబట్టి వాననీటి కోసం మళ్ళీ ఇంకుడు గుంతల పథకం ప్రారంభించాడు చంద్రబాబు. గతంలో 9 ఏళ్ళ పాటు తవ్విన ఇంకుడు గుంతలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. వాటిలో కోట్లు కుమ్మరించారు. అవి తెలుగుదేశం నాయకుల జేబుల్లోకి రహస్య పైప్ లైన్స్ ద్వారా చేరిపోయాయి.
ప్రచారం ఎక్కువ... పనితక్కువ అనేది బాబు నినాదం కాబట్టి వెంటనే ఇంకుడు గుంతలపై పదిమంది ఐఎఎస్ అధికారులు నివేదికలు తయారుచేశారు. వాన ఎక్కడ పడినా భూమిలోకి ఇంకవలసిందే కాబట్టి ప్రత్యేకంగా ఈ గుంతలు ఎందుకని ఒక అధికారి ప్రశ్నించాడు. వెంటనే అతన్ని మంగళగిరి మాన్యాలు పట్టించారు. రాజకీయాల్లో గోతులు తీయడం తన స్పెషాలిటీ కాబట్టి ఇంకుడు గుంతల పథకాన్ని ప్రత్యేకశ్రద్ధతో చేపట్టాలని బాబు ఆదేశించాడు.

అస్సాంలోని చిరపుంజి ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ కాబట్టి, అక్కడ వాననీళ్ళు ఎలా సంరక్షిస్తున్నారో తెలుసు కోడానికి ప్రత్యేకవిమానంలో మంత్రుల బృందం బయలుదేరింది. వానలో తడుస్తూ వాళ్ళు అధ్యయనం చేసారు. అక్కడి ప్రజలను ఇంకుడుగుంతల గురించి ప్రశ్నించగా ఇక్కడ మనుషులు పోతేనే గుంతలు తీస్తారు తప్ప, ఇంకేవిధంగానూ ఆ పని చేయరని చేప్పారు. మంత్రులు తిరిగి వచ్చినివేదిక ఇలా ఇచ్చారు.

`` ఎప్పుడూ వానపడే చిరపుంజిలో ఇంకుడుగుంతల గురించి ప్రజలకు చెప్పగా వారు ఎగిరి గంతేసి చంద్రబాబుని పొగడ్తలతో నింపేశారు. ఆనందంతో ఎడాపెడా గుంతలు తవ్వేయగా, అవి సొరంగాలని అనుమానించిన సరిహద్దు భద్రతా దళం వారు తుపాకులను కూడా గురిపెట్టారు. వారికి చంద్రబాబు గురించి చెప్పగా సైనిక వందనం చేసారు. దేశవిదేశాల్లో బాబు పేరు మారుమోగి పోతూ వుందంటే అది గోతులు తీసే పథకం వల్లే``

ఇది చదివి చంద్రబాబు ఉబ్బితబ్బిబయి వర్షం- హర్షం అని ఇంకో పథకాన్ని ప్రారంభించాడు. వర్షం వచ్చినపుడు ప్రజలు పెద్దపెద్ద ట్యాంక్‌లు కట్టుకుని నీటిని నిల్వచేసుకుంటే భూగర్భ జలాలు సంరక్షణ జరుగుతుందని పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చారు. దీనివల్ల ప్రజలకు నీళ్ళు సరఫరా చేసే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుని, ఆ నిధుల్ని రాజధాని నిర్మాణానికి ఖర్చుపెడుతుందని తెలిపారు.

ఈ రకంగా ముందుకి పోవడం వల్ల వానలో తడుస్తూ ప్రజలు బిందెలు, మూకుళ్ళు, గిన్నెలని నీళ్ళతో నింపారు. తడిసి ప్రజలకు జబ్బులొచ్చాయి. దాంతో డాక్టర్లకి డబ్బులొచ్చాయి. ఆ డబ్బులతో వాళ్ళు స్థలాలు కొన్నారు. దాంతో రియల్ఎస్టేట్ పెరిగింది. రాజధాని కల సాకారమైంది.