ప్రత్యేక హోదా.. పదివేల నాటకాలు..!

దృష్టి మాంద్యం,
దృష్టిలోపం, దూర‌దృష్టి, హ్ర‌స్వ‌దృష్టి, రేచీక‌టి, క‌ళ్లు బైర్లు క‌మ్మ‌డం, క‌ళ్లు నెత్తికెక్క‌డం, కంటి కంటే కాటుక ఎక్కువ కావ‌డం, కంట్లో కారం... ఇలా మ‌న రోజువారీ జీవితంలో క‌ళ్లు
మూసుకున్నా క‌న‌బ‌డే లోపాలు లెక్క‌లేన‌న్ని. వీటితోనే క‌ళ్లు తిరుగుతుంటే బీజేపీ
వెంక‌య్య ఢిల్లీ తెలుగు మీడియాకు ప్ర‌త్యేక దృష్టిని ప్ర‌దానం చేశారు. ఇది
వైద్యులు చెప్ప‌లేనిది. ప్ర‌జ‌లు చూడ‌లేనిది. ఈ ప్ర‌త్యేక ప‌దార్థాన్ని చూడ్డానికి
క‌ళ్ల‌జోళ్లు ఇప్ప‌టిక‌యితే త‌యారు కాలేదు. స‌మీప భ‌విష్య‌త్తులో ఏ రాజ‌స్థాన్
నుంచి ఎవ‌రైనా త‌యారు చేస్తారేమోగానీ, ఇప్పుడే వెంక‌య్య ఎలా గ్యారెంటీ ఇవ్వ‌గ‌ల‌రు?

 అదేమిటంటే..!

అన‌గ‌న‌గా పెద్ద‌ల స‌భ‌లో విడ‌గొట్ట‌బోయే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఐదేళ్ల పాటు ప్ర‌త్యేక
హోదా అని ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌బోతే - అరుపుల మ‌ధ్య కూడా స్ప‌ష్టంగా
వినిపించేలా - కాదుకాదు ప‌దేళ్లు కావాల‌ని ప‌ట్టు ప‌ట్టింది వెంక‌య్య‌గారే. త‌రువాత
విశాఖ‌ప‌ట్నంలో బీజేపీ ప్ర‌త్యేక హోదా మ్యానిఫెస్టోను కూడా ఎన్నిక‌ల‌ప్పుడు విడుద‌ల
చేసి అంత్య‌ప్రాస‌లు,
ఆది ప్రాస‌ల‌తో
స‌భ‌ను,
ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాన్ని
రంజింప‌జేసింది కూడా ఆయ‌నే. అప్పడికే విడిప‌డ్డ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఇక ప్ర‌త్యేక
ర‌క్తంతో బ‌త‌క‌వ‌చ్చు అనుకుంటుండ‌గా, తిరుప‌తి వెంక‌న్న పాదాల సాక్షిగా మోడీ మ‌రిన్ని
అభ‌యాలిచ్చారు. మీ పెద్ద‌న్న, మేన‌మామ‌లాంటి బంధుత్వాలేవో హిందీలో చెప్తే అర‌వ‌పంచె క‌ట్టుక‌ట్టినా
మోదీవాణిని తెలుగులో త‌ర్జుమా చేసి మ‌రింత భ‌రోసా ఇచ్చింది కూడా వెంక‌య్యే. 

అత‌నికంటే ఘ‌నుడు ఆచంట మ‌ల్ల‌న్న మ‌న ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక హోదా ప‌దిహేనేళ్లు
కావాల‌న్నారు. అసెంబ్లీలో అడిగారు. స‌భ‌ల్లో బ‌ల్ల‌గుద్ది మ‌రీ అడిగారు. మీడియా
వీడియోల్లో అడిగారు. మోడీ చెంబులిచ్చి ప‌క్క‌నే కూర్చున్న‌ప్పుడు మాత్రం
మౌనందాల్చారు. తామ‌ర పువ్వులేమో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఇప్ప‌టికి ఇచ్చిందే ల‌క్ష
కోట్లు దాటింది అంటాయి. ప‌సుపుకొమ్ములేమో బాబు తిరిగే విమానాలు, హెలీక్యాప్ట‌ర్లు, పెళ్లి పేరంటాల‌కు కూడా ఢిల్లీ ఇచ్చిన
చిల్లిగ‌వ్వ‌లు చాల్లేదంటాయి. 

హోదారాదా?
అని రాష్ట్రం అల‌మ‌టిస్తూ
ఉంటే,
వ‌చ్చిమాత్రం
ప్ర‌యోజ‌న‌మేముంది?
వ‌చ్చిన
రాష్ట్రాలు బావుకున్న‌దేముంది అని తామ‌ర‌పువ్వు రేకుల్లో అక్క‌డో రేకు ఇక్క‌డో
రేకు అంటూనే ఉంటుంది. హోదాతో పాటు గోదాకూడా రావాల్సిందేనంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు
వెంక‌య్య ప్రాస‌ల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా. హోదా ఇవ్వ‌క‌పోతే మీ ప‌రువే గోదావ‌రిలో
కృష్ణా న‌దీ సంధాన‌మైన‌ట్లు కాలువ‌ల్లో క‌లిసిపోతుంద‌ని మోడీకి బాబే హెచ్చ‌రించిన‌ట్లుగా
హిత ప‌త్రిక‌ల్లో అధికారిక లీకు వంట‌క వార్త బాగానే వండి వార్చారు.

పాత్రధారుల హడావుడి 

రాని హోదాను వ‌స్తున్న‌ట్లుగా, అడుగుతూనే ఉన్న‌ట్లుగా, ఒత్తిడి తెస్తున్న‌ట్లుగా, ఒకే రోజు ఢిల్లీలో సుడిగాలి అభ్య‌ర్థ‌న‌ల
కాగితాలిచ్చిన‌ట్లుగా టీడీపీ వైపు నాట‌కం తెరప‌డ‌కుండా అంకాలు అంకాలు సాగిపోతూనే
ఉండాలి. హోదాకు మించి కేంద్ర సాయం స‌న్ రైజింగ్ స్టేట్‌కు వ‌ర‌ద‌పై పారుతున్న‌ట్లు, ఆ సాయం తుఫానుకు రాష్ట్ర ప్ర‌జ‌లు చాలు మ‌హాప్ర‌భో
అంటున్న‌ట్లు బీజేపీ వైపు ప్ర‌తి నాట‌కం ప‌ర‌దా ప‌డ‌కుండా పాత్ర‌లు మారుతూనే
ఉండాలి. నాట‌క స‌మాజాలు ఊళ్లు మారుతూ ఉంటాయి. కొన్ని పాత్ర‌ల్లో న‌టించే వేష‌ధారులు
మారుతూ ఉంటారు.

 అదే స్ర్కిప్టు అదే డైలాగులు. 

అమ‌రావ‌తి,
హోదా వేళా
విశేషం బాగుంటే ప్ర‌శ్నించే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఇంకొక‌రు త‌న‌ను ప్ర‌శ్నించేలోపు
నాట‌కాన్ని మ‌రింత ర‌క్తి క‌ట్టించ‌డానికి పంచెతోనే, మ‌రో వేషంతోనో ఫ్ల‌యిట్ ఎక్కి మ‌ళ్లీ గ‌న్న‌వ‌రం
నుంచి వేగంగా కాన్వ‌య్‌లో వెళ్లి బాబే క‌రెక్టు.. బాబే బుల్లెట్టు - బాబే ధైర్యం వ‌దిలిన
రాకెట్టు అంటూ గోడ‌కు కొట్టిన బంతిలా హైద‌రాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వెన‌క్కు
రావ‌చ్చు. నాట‌కంలో పాత్ర‌లూ దొర‌క్క, ప్రేక్ష‌కులుగా నాట‌కాన్ని అసాంతం ఆనందించ‌డానికీ
గొంతులో వెల‌క్కాయ మిగ‌లేక‌, కక్క లేక ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ నాయ‌కుల బాధ బాధ కాదు. 

ఆ రోజుల్లో నాగ‌భూష‌ణం ఒకే నాట‌కాన్ని వేల‌సార్లు అద్భుతంగా ప్ర‌ద‌ర్శించారు.
దాంతో ఆ నాటకం ఆయ‌న ఇంటి పేరుగా మారి ర‌క్త‌క‌న్నీరు నాగ భూష‌ణం అయ్యాడు. ర‌క్త‌క‌న్నీరు
ప్ర‌తిభ అది. ఆ స్ఫూర్తితో క‌ళ్ల‌లో ర‌క్తం కారేలా, గుండెలు ప‌గిలేలా హోదా నాట‌కాన్ని కూడా ప‌దేప‌దే
ప్ర‌ద‌ర్శించ‌వ‌చ్చు. 

 

Back to Top