ఎలుకల కథ

తన చాంబర్ లోకి అడుగుపెట్టాడు చంద్రబాబు. రెండు ఎలుకలు కిచకిచ ఎగిరి కాసేపు నాట్యం చేసాయి. బాబు కంగారు పడి ఏంటవి? అని పిఏని అడిగాడు.

 "ఎలుకలు సార్, చిన్నవిగా వుంటే చిట్టెలుకలు, పెద్దవిగా వుంటే పందికొక్కులు అంటారు" అని చెప్పాడు పిఏ
"కానీ అవి నా చాంబర్ లో ఎందుకున్నాయి?
"మీ ప్రభుత్వంలో బోలెడు ఎలుకలున్నాయి. బహుశా వాటి ప్రతినిధులేమో ఇవి". ఇంతలో పైన వున్న శ్లాబ్ నుంచి రెండు పెచ్చులూడి బాబుపై పడింది.
" ఏం చేసినా టాప్ గా ఉండాలని అన్నారు కదా, అందుకని టాప్ వూడిపోయేలా మన ఇంజినీర్లు కట్టారు" అని చెప్పాడు పిఏ
చీఫ్ ఇంజినీర్ ను పిలిపించాడు బాబు
"నేను చెప్పిందేంటి? మీరు చేసిందేంటి?" కోపంగా అరిచాడు బాబు
" మీరు చెప్పిందే చేసాను" సార్ అన్నాడు ఇంజినీర్
ఎలుకలు మళ్లీ వచ్చి భరత నాట్యం చేసాయి
"ఏంటివి?" గట్టిగా అరిచాడు బాబు
"మన కాంట్రాక్టర్లు సార్" అన్నాడు ఇంజినీర్
బాబు తలగోక్కొని  "అవి ఎలుకలు కదా" అన్నాడు
" నా దృష్టిలో కాంట్రాక్టర్లకి ఎలుకలకి పెద్ద తేడా లేదు సార్. రెండూ బొరియలు తవ్వే పనిలో ఉంటాయి" అన్నాడు ఇంజినీర్
"అవి నా చాంబర్ లో ఎందుకున్నాయి?"
"మీ చాంబర్ లో ఎలుకలకే ప్రథమస్థానం కదా సార్"
"వాటిని వెంటనే తరిమేయండి"
"వాటిని తరిమేస్తే మన ప్రభుత్వం కుప్పకూలిపోతుంది"
ఈసారి ఎలుకలు కథక్ ఆడి  బాబుగారి గడ్డాన్ని కాస్త ముద్దాడి లాగాయి
"నేను సింగపూర్ తరహాలో భవనాలు నిర్మిచమంటే మీరు ఎలుకల నివాసాలు నిర్మిస్తున్నారా?" చిరాకు పడ్డాడు బాబు
"సార్, మీరో రోజు సింగపూర్, మలేసియా అని ప్రకటనలిస్తారు. మీడియా భారీ కవరేజ్ ఇస్తుంది. ఆ తరువాత ముడుపులు ఎవరెక్కువిస్తే వాళ్లకి కాంట్రాక్ట్ ఇస్తారు. వాళ్లు ఇవ్వాల్సిన వాళ్లందరికీ ఇవ్వగా, మిగిలిన డబ్బుతో బిల్డింగ్ లు కడుతున్నారు. అందుకే గోడలు పెచ్చులూడుతున్నాయి. ఎంత పిండికి అంత రొట్టె"అని వివరించారు ఇంజినీర్.
ఈసారి ఎలుకలు బ్రేక్ డ్యాన్స్ వేసి వెళ్లాయి.
"వినాయక, గణనాథ, ఏకదంతా, నవ్వురాలేక నీ వాహనాలను పంపుతున్నావా?" అని పిఏ లెంపలేసుకున్నాడు.
"నీ గోలేంటి అరిచాడు బాబు"
"మనవల్ల ఏ పని కానప్పుడు దేవుడిపై భారమెయ్యేలి" అన్నాడు పిఏ
వెంటనే ఎలుకలను బోన్ లో పెట్టించండి అని ఇంజినీర్ ను ఆదేశించాడు బాబు
మరుసటి రోజు ఎలుకలకి బదులు ఇద్దరు తెలుగుతమ్ముళ్లు, నలుగురు అధికారులు బోనులో చిక్కారు. ఆ తరువాత బాబు ఎలుకల జోలికెళ్లకుండా సహజీవనం అలవాటు చేసుకున్నాడు.

తాజా వీడియోలు

Back to Top