పక్షిరాజా ప్రొడక్షన్స్ వారి...!

హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియంలో ఓ చారిత్రక గోడ గడియారం ఉంది.
అందులో ఓ సైనికుడు ఉంటాడు.  ఆసైనికుడు ప్రతీ గంటకీ ఓ సారి బయటకు వచ్చి ఎన్నిగంటలైందో అన్ని సార్లు గంట కొట్టి మళ్లీ లోపలికి వెళ్లిపోతాడు.
సరిగ్గా ఆ సైనికుడిలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు  సినీ గడియారంలోంచి బయటకు వచ్చి ఏదో ఒకటి చెప్పి మళ్లీ లోపలికి వెళ్లిపోతూ ఉంటారు. తాను అలా వచ్చి వెళ్లకపోతే ప్రజలకు టైమ్ ఎంత అయ్యిందో చెప్పేవాళ్లే ఉండరని పవన్ అభిప్రాయం. బయటకు వచ్చే టైమ్ లేనపుడు ఆయన ట్విట్టర్ లో తన మనసులో మాటలు పెట్టేసి ఊరుకుంటారు. ట్వీటువు పిట్టలా.
ప్రత్యేక హోదా కోసం యువత పోరాడాలని అనే పవన్ కళ్యాన్ తాను మాత్రం పోరాడరట.
ఎందుకంటే ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు..వెంకయ్యనాయుడు రాష్ట్రాన్ని మోసం చేశారని ఓ పక్క అంటూనే.. వాళ్లంతే తనకి చాలా గౌరవమని ఒకటికి పది సార్లు గుర్తు చేస్తూ ఉంటారు పవన్. అది గౌరవమా లేక  భయమా అన్నది అర్ధం కాక జనం  అయోమయానికి గురవుతూ ఉంటారు. అయితే అనుభవజ్ఙులు మాత్రం అది భయమే అని అంటున్నారు.
................
పల్లెటూరి కోడి పుంజులు (నగరాల్లో కనపడ్డం లేదనుకోండి) తాము కొక్కొరోకో అనకపోతే లోకానికి తెల్లారదని అనుకుంటూ ఉంటాయి. అందుకే ఎంత ఆలస్యంగా పడుక్కున్నా..లోకం మీద జాలితో తెల్లారకట్టే లేచి కొక్కొరో కో అని కూస్తూ ఉంటాయి.
ఈ కోడి పుంజు లాంటి వారే మన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.
విభజన సమయంలో రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలని తాను అడిగి ఉండకపోతే ..అసలు ప్రత్యేక హోదా అనేది ఒకటి ఉంటుందని ఎవరికీ తెలీదని ఆయన  కొన్ని వందల సార్లు చాలా అమాయకంగా (కొండొకచో గడుసుగా) అంటూ వచ్చారు. ఎవరికీ తెలీదు కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఎవరూ అడగరులే అని ఆయన అనుకున్నారు.కానీ ..ప్రతిపక్షాలు..యువత ప్రత్యేక హోదా కోసం గట్టిగా నినదిస్తూ ఉంటే వెంకయ్యనాయుడు కళ్లుమూసుకుని పాపం అంతా కాంగ్రెస్ దే అంటున్నారు.
..................
కొంగ చెరువులో  ఒంటికాలిపై నిలబడి  తన ముక్కు గేలానికి అందే దూరంలో చేప వచ్చేంత వరకు జపం చేస్తున్నట్లు మౌనంగా   నిరీక్షిస్తూ ఉంటుంది. చేప పిల్ల అటుగా వచ్చినా సరే అమాంతం దాన్ని ఒడిసి పట్టుకుని భోంచేసి ..మళ్లీ జపంలో పడిపోతుంది.సరిగ్గా ఈ కొంగలాగే మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు. ఎవరైనా తన గేలానికి పడే ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు కనిపిస్తే వారిని అమాంతం కొనేసి తన వైపు లాగేసుకుని... తాను నిజాయితీకి మారు పేరని..నిప్పులాంటివాడినని స్వయం కితాబునిచ్చుకుంటూ ఉంటారు. ఈ జపం లో నిమగ్నమైపోవడం వల్లనే ఆయనకు ప్రత్యేక హోదా కోసం  జరుగుతోన్న ఉద్యమ ఘోష వినపడదు. ఆందోళనలు కనపడవు.
....................
చిలుక జోస్యం  చెప్పేవాళ్ల చక్కటి తర్ఫీదు వారి పంజరంలోని చిలుకలను చూసి  తెలుసుకోవచ్చు. చిలుక జోస్యం చెప్పేవారి దగ్గరకు జోస్యం చెప్పించుకునేందుకు వచ్చిన వారి పేరు మీద  కార్డు తీయమని యజమాని చెప్పడమే తరువాయి..ఉన్న కార్డుల్లోంచి ఓ కార్డును ముక్కుతో  తీసి పక్కన పెడుతుంది. ఆ కార్డును చూసి చిలుక జ్యోతిష్కుడు తనకు నచ్చింది చెప్పుకు పోతాడు.ఈ  రామ చిలుక మాదిరిగానే మన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ.. చిలుక జ్యోతిష్కుడు వెంకయ్యనాయుడు  చెప్పినప్పుడల్లా ప్రత్యేక హోదా బదులు కేంద్రం రాష్ట్రానికి ఏమేమి ఇస్తుందో  అప్పచెప్పేసి పంజరంలోకి వెళ్లిపోతున్నారు.
..................
ఉష్ట్ర పక్షి ( ఆస్ట్రిచ్ ) ఏదన్నా ప్రమాదం ముంచుకొచ్చినపుడు...తన తలను ఇసుకలోకి దింపి చాలా సేపు అలాగే ఉండిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ సరిగ్గా అలాగే ..తన నిర్ణయాలపైనా..తన విధానాలపైనా నిరసనతో ఎవరైనా ప్రశ్నలు సంధించడం మొదలు పెడితే ఏమీ మాట్లాడకుండా తలను మౌనంలోకి దూర్పేసి అలాగే ఉండిపోతున్నారు.
................
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించి నినదించినప్పుడల్లా  కాకులు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ కాకిగోల భరించలేక ఆయన చెవులు మూసేసుకుని కాకులను తిట్టుకుంటూ  అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ఉంటారు.
..................
చెదిరిన తన గూడు ఏ చెట్టుమీద ఉందో మర్చిపోయిన  వడ్రంగి పిట్టలా...లోక్ సత్తా అధ్యక్షుడు జయ ప్రకాష్ నారాయణ్ ప్రత్యేక హోదా కోసం ఇపుడు సోషల్ మీడియాలో తెగ ఆరాట పడుతున్నారు.
................
పాల నుండి నీటిని వేరు చేసి కేవలం పాలను మాత్రమే తాగే హంసలా జనం  పాలకులు..పార్టీల నేతల చిత్ర విచిత్ర విన్యాసాలను  నిశితంగా గమనిస్తున్నారు. ఎవరివి వేషాలో..ఎవరివి వెధవ్వేషాలో వాళ్లు తేలిగ్గానే పోల్చుకుంటున్నారు. ట్వీటువు పిట్టల..దొంగకొంగల..పంజరపు రామచిలుకల బలాలు..దౌర్బల్యాలను జనం బేరీజు వేసుకుంటున్నారు. 
పక్షులన్నీ ఇలా ఉంటే ఓ  పంది మాత్రం ప్రత్యేక హోదాపై జోకులేసుకుంటూ వెళ్లిపోయింది.
ఆ బురద జోకు భరించలేక జనం ముక్కులు మూసుకుని దూరంగా పరుగులు తీశారు.
---------------------
-లోక విరోధి
-----------------------


Back to Top