అది ఇంద్రలోకం..ఇది చంద్రలోకం..అంతా మాలోకం-----------------ఇంద్రుడి రాజధాని అమరావతి.అది ఇంద్రలోకం.చంద్రుడు కలగంటోన్న రాజధాని కూడా అమరావతే.ఇది చంద్రలోకం.ఇంద్రలోకాన్ని తలదన్నేలా..తన చంద్రలోకాన్ని నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు అడిగిన వాళ్లకీ...అడగని వాళ్లకీ మాత్రమే చెబుతున్నారు.దేశంలోనే ఏపీ రాజధానిని మించిన రాజధాని మరోటి ఉండబోదని..ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఇలాంటి రాజధాని ఇంకోటి ఉండకూడదని చంద్రబాబు అనుకుంటున్నారు.విజయవాడ-గుంటూరు మధ్య నిర్మించబోతోన్న అమరావతి భూతల స్వర్గంలాగే ఉంటుందని చంద్రబాబు నాయుడు ..ఆయనగారి మంత్రులు మీడియా వాళ్లకి మ్యాపులు..గ్రాఫిక్ డిజైన్స్ తో సహా పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇస్తున్నారు.ఈ మొత్తం వ్యవహారాన్ని ఇంద్రలోకంలో ఇంద్రుడి పట్టమహిషి శచీదేవి కూడా చూస్తోంది.శచీదేవి అంటే ఈర్ష్య అసూయలను నాశనం చేసేదని అర్ధం. అటువంటి శచీ దేవి కూడా చంద్రబాబు తాను కట్టబోయే అమరావతి ఎలాం ఉంటుందో చెప్పేసరికి అసూయపడిపోయింది.ఆమెకు ఒళ్లు మండిపోయింది. ఏంటీ నా ఇంద్రలోకం కన్నా కూడా గొప్పగా కడతారా అంటూ ఆవేశంగా అరిచేసింది. అప్పుడే వచ్చిన ఇంద్రుడు ఎప్పుడూ అలకంటే కూడా తెలీని ఇంద్రాణి ఈరోజేంటి ఇంత ఆగ్రహంగా ఆవేశంగా ఉందేంటి అని ఆశ్చర్యపోయాడు.ఏం జరిగింది దేవీ అని శచీదేవిని అడిగేశాడు.మీరేం చేస్తున్నారో నాకు తెలీడం లేదు.భూలోకంలో ఎవడో చంద్రబాబంట..ఇంద్రలోకం కన్నా గొప్పగా తన చంద్రలోకం కట్టుకుంటాడట ఇక మన దర్జాలు..వైభవాలూ అటకెక్కినట్లేనా? అని నిలదీసింది.ఇంద్రుడికి ఒక్క క్షణం ఏం జరుగుతోందో అర్ధం కాలేదు.వెంటనే తన దివ్య దృష్టితో చూసి ... పగల బడి నవ్వడం మొదలు పెట్టాడు.శచీదేవికి కోపంతో పాటు ఉక్రోషం వచ్చింది.అసలే చికాగ్గా ఉంటే అలా నవ్వుతారేంటి నాథా అని అడిగింది శచీదేవి.ఏం లేదు దేవీ...నువ్వు అనవసరంగా భయపడుతున్నావు.నువ్వు అనుకుంటోన్నట్లు చంద్రలోకం ఏమీ మన ఇంద్రలోకం దరిదాపుల్లోకి కూడా రాదు. నక్కకీ నాగలోకానికీ ఎంత తేడా ఉందో..మనకీ చంద్రలోకానికీ అంతే తేడా ఉంటుంది అన్నాడు.ఇదేమీ నేననుకుంటోంది కాదు. చంద్రబాబు నాయుడే ఇందాక చెప్తోంటే విన్నాను. అన్ని దృశ్యాలూ చూపించాడు కూడానూ అంది శచీదేవి.ఇంద్రుడు మళ్లీ నవ్వేసి..అవన్నీ నమ్మకు శచీదేవి.ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఇంతే.ఆ చంద్రలోకం...అదే మన అమరావతి పేరుమీదే ఉంది కదా. అక్కడ చుట్టూరా భూముల రేట్లు పెంచుకోడానికి చంద్రబాబు నాయుడు చాలా జిమ్మిక్కులు చేస్తున్నాడని మన భూలోక రిపోర్టర్ నారదుడు ఇంతకు ముందే వాట్స్ ఆప్ లో అప్ డేట్ చేశాడు.టీవీలో చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్..ఆ డిజైన్ లూ అన్నీ కూడా అందరినీ మభ్య పెట్టి..అరచేతిలో వైకుంఠం చూపించడానికి ఉద్దేశించినవే. వాటిని భూలోకంలో అడ్వర్టైజ్ మెంట్లని కూడా అంటారు. వాటిని చూపించి రాజధాని నగర పరిసరాల భూము ల రేట్లు పెంచుకోవాలనే చంద్రబాబు నాయుడు అలాంటి సినిమాలు చూపిస్తున్నారు. అంతే కానీ నిజంగానే మన ఇంద్రలోకం కంటే గొప్పగా కడతారని నమ్మేశావా ఏంటి పిచ్చిదానిలా? అని ఇంద్రుడు మళ్లీ నవ్వాడు. మరయితే మొత్తం దేశ వ్యాప్తంగా అందరు ముఖ్యమంత్రులనీ..గవర్నర్లనీ..ప్రతిపక్ష నాయకులనీ అందరినీ ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకు అంత ఆర్బాటంగా చేస్తున్నారు? అని శచీదేవి మనసులోని అనుమానాలు బయట పెట్టింది.దాన్నే మార్కెటింగ్ అంటారు అక్కడ అన్నాడు ఇంద్రుడు.అంటే ఏంటీ అన్నట్లు చూసింది శచీదేవి.మార్కెటింగ్ అంటే...మన చేతిలో ఏమీ లేకపోయినా.. అద్బుతంగా ఉందని చెప్పి అమ్మేయడమన్న మాట. అంటే శూన్యాన్ని అమ్మేసి లాభాలు జేబులో వేసుకోవడం అన్నమాట.అదెలా సాధ్యం? అందరూ చూస్తోండగా లేనిది ఉన్నట్లు నమ్మించి ఎలా అమ్ముతారు ? అని ఆరా తీసింది శచీదేవి.దాందేముంది నా ఇంద్రజాలం లేదా ఏంటి ? అలానే అదీనూ అన్నాడు ఇంద్రుడు.మరి చంద్రబాబు చేస్తున్నదేంటీ అని అడిగింది శచీదేవి.అదా..అది చంద్రజాలం అనుకో. అన్నాడు ఇంద్రుడు.అంటే ఏంటీ అంది శచీదేవి.అంటే...ఏముందీ...పచ్చిదగా అన్నమాట అన్నాడు ఇంద్రుడు.దగా అని ఎలా చెప్తారు అని అడిగింది శచీదేవి.చూడు శచీ...అమరావతి రాజధాని నగరాన్ని 35 ఏళ్ల పాటు కడతామని చంద్రబాబు నాయుడు..సింగపూర్ కంపెనీలే చెబుతున్నాయి. చంద్రబాబు మరో మూడున్నరేళ్లు మాత్రమే సిఎంగా ఉంటారు. అప్పటికి అమరావతి నిర్మాణం లో వందోవంతు కూడా పూర్తికాదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ కనపడ్డం లేదు.తాను లేకుండా చంద్రలోకాన్ని..అదే అమరావతి రాజధానిని అందరూ అసూయపడేలా ఎలా నిర్మిస్తారో చంద్రబాబునే చెప్పమను అని అడిగాడు ఇంద్రుడు.శచీదేవి ప్రశాంతంగా గాలి పీల్చుకుంది.అయితే చంద్రలోకం గురించి బెంగ పడక్కర్లేదన్నమాట.సర్లేండి నాకు అవతల బోలెడు పనులున్నాయి..మీతో కబుర్లు చెప్పుకూంటూ కూర్చోడానికి నాకుఖాళీ లేదు అని అక్కడి నుంచి ఐరావతం పై వెళ్లిపోయింది.ఇంద్రుడు బిక్కమొగం వేసుకుని భూలోకంలో అమరావతి వైపు చూడ్డం మొదలెట్టాడు.............................-కవికాకి.-------------------