రైతుకు క‌న్నీరు - హెరిటేజ్ కు ప‌న్నీరు


   వ్య‌వ‌సాయం దండ‌గ అన్న బాబు ఇప్పుడు పండ‌గ అని అక్ష‌రాల‌ను  స‌రిదిద్దుతున్నారు. ఆయ‌న అక్ష‌రాల‌ను అటు ఇటు మార్చి మీడియాలో త‌న వార్తలు తానే చూసుకుని మురిసిపోగ‌ల‌రు కానీ అన్న మాట‌ల‌యితే శిలాక్ష‌రాలుగా  మిగిలిఉంటాయి క‌దా !
   మ‌నిషికి నిద్ర‌, ఆహారం త‌ప్ప‌నిస‌రి. కానీ వ్య‌వ‌సాయాన్ని లాభ‌సాటి చేసే వ‌ర‌కు చంద్ర‌బాబు నిద్ర‌పోరు. రాయ‌ల‌సీమ నుండి క‌రువు భ‌య‌ప‌డి వెళ్లిపోయే వ‌ర‌కు నిద్ర‌పోన‌ని ఆగ‌డ్డ మీద నిద్ర‌పోవ‌డానికి ముందు బాబు భీష‌ణ ప్ర‌తిఙ్ఞ చేసిన‌ట్లు ప్రింటు, ఆడియో, వీడియో వార్త‌లు అందుబాటులో ఉన్నాయి.
    చ‌దువుల్లో ఆర్ట్స్  స‌బ్జెక్టులు దండ‌గ‌. స‌ర్వీస్ సెక్టార్ ఒక్క‌టే పండ‌గ‌. అన్నీ ఇజాల‌కు కాలం చెల్లింది. క‌ల‌కాలం నిలిచి వెలిగేది టూరిజం ఒక్క‌టే అని కూడా ముఖ్య‌మంత్రిగా బాబు అనుగ్ర‌హ భాష‌ణ‌ల్లో కొన్ని ఆణిముత్యాలున్నాయి. అస‌లే రైతుల రుణ‌మాఫీ హామీ అమ‌లు పూర్తి సాధ్యం కాదు కానుక‌, రైతుల‌ను ఏదో ఒక ర‌కంగా జో కొట్టి నిద్ర‌పుచ్చాల్సిన బాధ్య‌త నిద్ర‌పోని బాబు మీద ఉంది.
    బాబు ముఖ్యమంత్రిగా ఉండ‌గా బ‌షీర్‌బాగ్ కాల్పులు జ‌రిగాయి. విద్యుత్ ఛార్జీలు త‌గ్గించాల‌న్న డిమాండుకు రైతులంటే ద‌య‌గ‌ల బాబు తుపాకి గుండ్ల‌తో సమాధానం చెప్పారు. ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల సాక్షిగా అమాయ‌కుల ప్రాణాలు గాలిలో క‌లిశాయి. బాబు కంపెనీ హెరిటేజ్ పాడి మాత్రం దిన‌దిన ప్ర‌వ‌ర్థ‌మాన‌మ‌వుతుంది. వ్య‌వ‌సాయం మీద‌, రైతుల‌మీద వ్య‌తిరేక‌త‌ను, అయిష్టాన్నీ బాబు ఎంత మాత్రం దాచుకోరు. దాచేప‌ల్లి నుండి దావోస్ దాకా ఎక్క‌డ ఛాన్స్ దొరికినా `` పొలాలు వ‌ద‌లండోయ్ - సేవ‌ల‌కు రారండోయ్`` అంటూ ఉప‌న్యాసాలు దంచి కొడ‌తారు. పేరు రాక కోసం ఎదురు చూసే ఏరువాక‌ల్లో మాత్రం ఆయ‌న దుక్క‌దున్ని, నారువేసి, నీరు పోసి హామీల సాగు చేస్తూ ఆశ‌ల పంట‌ల‌ను బ‌స్తాల‌కు బ‌స్తాల‌కు పండిస్తుంటారు. అందుకే రైతుకు క‌న్నీరు- హెరిటేజ్‌కు ప‌న్నీరు.
Back to Top