దాచాలన్నా దాగదులే...


తెలంగాణాలో చంద్రబాబు వ్యూహం.....
కాంగ్రెస్ ను ముందుడి నడిపిస్తున్న చంద్రబాబు.....
తెలంగాణాలో సీట్ల ఎంపికలో బాబు స్టేటజీ ఇదే.....
మహా కూటమికి బాబే దిక్కు....
చంద్రబాబు ఎంట్రీతో తెలంగాణాలో తలకిందులైన టిఆర్ఎస్ అని తేల్చిన లగడపాటి సర్వే...

పై కథనాలన్నీ వండి వడ్డించిన ఎల్లో మీడియా రెండు రోజులుగా మౌన వ్రతం పాటిస్తోంది. ఇది టిడిపికి తెలంగాణాలో జరిగిన పరాభవానికి సంతాపం కావచ్చు. అందుకే తెలంగాణా ఎన్నికల్లో కూటమి కుదేలుకు సంబంధించిన కథనాల్లో మచ్చుకు కూడా బాబు మేటర్ లేదు. మరి ఎన్నికల ముందు రోజు వరకూ అంతా బాబే...సర్వం బాబే అని చెప్పిన ఈ సోకాల్డ్ పత్రికలు, ఛానెళ్లు ఉన్నట్టుండి బాబును బ్యాగ్రౌండ్ లో లేకుండా చేయడానికి కారణాలేమిటి? ఎన్నికల్లో విజయం సాధించి ఉంటే ఈపాటికి బానర్లలలో చంద్రబాబు చెర్రుగడ సైజులో, రాహుల్ రేగిపండు సైజులు కనిపించి ఉండేవారు. కూటమి ఖాతాలో ఓటమి పడేసరికి చంద్రబాబును సైడు చేసేసారు. ఈ ఓటమికి బాబుకీ అసలు సంబంధమేమీ లేదేమో అనిపించేలా ఉన్నాయి రెండ్రోజులుగా ఈ ఎల్లో మీడియా వార్తలు. తెలంగాణాలో కూటమి ఓటమికి చంద్రబాబు లెగ్గు కారణం అని సాధారణ ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ ను ఎదిరించలేక కేసీఆర్ పై వ్యతిరేకత పెరిగిన తరుణంలో చంద్రబాబు ఎంట్రీ కేసీఆర్ కి ఊరటనిచ్చిందని టిఆర్ఎస్ నేతలే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ బాబు వస్తాడనే అనుమానంతోనే కాంగ్రెస్ ను నమ్మిన వాళ్లు కూడా టిఆర్ఎస్ కు జై కొట్టారని బైటకు చెప్పుకోలేక కాంగ్రెస్ నేతలు కళ్లు తుడుచుకుంటున్నారు. మరి తెలంగాణా ఎన్నికల ఫలితాలను ఇంతగా ప్రభావితం చేసిన చంద్రబాబు గురించి కనీసం ప్రస్తావించకుండా జాతి మీడియా బాగా జాగ్రత్త పడుతోంది. చివరకి ఈనాడు, ఆంధ్రజ్యోతి కార్టూన‌్లలోనూ  చంద్రబాబు ముఖమే కనిపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఎల్లో మీడియా ముసుగేసినంత మాత్రాన నిజాలు నీడల్లో దాగిపోతాయా? ఓ పక్క సోషల్ మీడియా, మరోపక్క పింక్ మీడియా కలిసి బాబు భరతం పట్టేస్తున్నాయ్. అసలు తెలంగాణాలో కేసీఆర్ గెలుపుకు ప్రముఖ పాత్ర పోషించిన చంద్రబాబుకు తెలంగాణాలో గుడికట్టినా తప్పులేదంటున్నారు గులాబి తమ్ముళ్లు. ’దాచాలన్నా దాగదులే...దాగుడుమూతలు చాలునులే...’ అని ఎల్లో మీడియా తీరును సోషల్ మీడియా వెక్కిరిస్తోంది. పింక్ మీడియా ఆటాడుకుంటోంది. 
 
Back to Top